చేతి ఉంగరంపై జగన్ ఫోటో.. డిప్యూటీ సీఎం స్వామి భక్తి మామూలుగా లేదుగా..

చేతి వేళ్లకు చాలా మంది ఉంగరాలు ధరిస్తారు. కొందరు సాధారణంగా తయారు చేసే గోల్డ్ రింగ్స్ ధరిస్తారు.. మరికొందరు ఖరీదైన వజ్రాలు పొదిగిన ఉంగరాలు వేసుకుంటారు. కొందరు జాతక చక్రం ఆధారంగా జాతిరత్నాలతో ప్రత్యేకంగా తయారు చేయించుకుని వేళ్లకు ఉంగరాలు వేసుకుంటారు. ఎక్కువ మంది తమ చేతికి దేవుడి ఫోటోలు ఉన్న ఉంగరం ధరించడానికే ఇష్టపడతారు. కానీ అంధ్రప్రదేశ్ లో మాత్రం ఇప్పుడు కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. అధికార వైసీపీ నేతలు తమిళ రాజకీయాల ఫార్ములాను అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. మంత్రి పదవుల కోసం.. అధిష్టానం చూపు తమపై పడేందుకు స్వామి భక్తిని ప్రదర్శిస్తున్నారు. తమ అధినాయకుడి ఫోటోలతో కూడిన ఉంగరాలు ధరిస్తున్నారు. పదవుల కోసం ఆశపడే ఓ చిన్నా చితకే లీడర్లే కాదు.. ఏకంగా డిప్యూటీ ముఖ్యమంత్రే.. సీఎం జగన్ ఫోటో ఉన్న ఉంగరం ధరించడం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.

ఏపీలో త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ సారి మంత్రి వర్గంలో భారీగా మార్పులు ఉంటాయని.. ఈ రెండున్నరేళ్ల పని తీరు ఆధారంగా కొందరికి ఉద్వాసన తప్పదని.. కొత్తగా కొందర్ని కేబినెట్ లో చేర్చుకుంటారంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో ఇప్పుడు కేబినెట్ లో ఉన్న మంత్రుల్లో చాలామందిలో టెన్షన్ మొదలైంది. తమ పదవి ఉంటుందా ఊడుతుందా అంటూ చర్చ మొదలెట్టారు. కొందరైతే బహిరంగంగానే తమ భయం వెలిబుచ్చుతున్నారు. సన్నిహితుల దగ్గర తమ పదవి పోతుందా అంటూ వాపోతున్నారంట.. మరికొందరైతే తమ పదవి పోయినా భయం లేదు.. జగన్ కు విధేయులుగా ఉంటామంటూ బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఓ డిప్యూటీ సీఎం వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  

చిత్తూరు జిల్లాకు చెందిన ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.. తన చేతికి పెట్టుకున్న ఉంగరమే తాజా చర్చకు కారణమైంది.ఇటీవల జరిగిన ప్రెస్‌మీట్‌లో నారాయణ స్వామి తన ఉంగరాన్ని చూపిస్తూ.. పదవికోసం కాదు.. అభిమానంతో పెట్టుకున్నాను అని చెప్పడంతో అందరి దృష్టీ దానిపై పడింది. ఆ ఉంగరంలో దివంగత సీఎం వైఎస్‌ఆర్‌తోపాటు ప్రస్తుత సీఎం జగన్‌ బొమ్మలు ఉండటంతో చర్చకు ఎక్కడ లేని హైప్‌ వచ్చింది.అది కూడా రెండున్నరేళ్ల కేబినెట్‌ ప్రక్షాణళనకు ముందు ఇలా ఉంగరంతో ప్రత్యక్షం కావడం చర్చకు ఇంకాస్త మసాలా దట్టించినట్టు అయింది. 

స్వామి భక్తిని ప్రదర్శించడం తమిళనాడు నేతలు ముందు ఉంటారు. తమిళనాడు ప్రజలు అక్కడి రాజకీయాలను ఇంటిలో భాగంగా చేసుకుంటారు. మాజీ సీఎంలు ఎంజీఆర్‌, జయలలిత, కరుణానిధి సహా ఇతర నేతలను వారి గుండెల్లోనే కాదు.. చేతికి పెట్టుకునే ఉంగారాల్లోనూ బంధిస్తుంటారు. ఆ గోల్డెన్‌ రింగ్స్‌ ఎంత పెద్దగా ఉంటే అంత అభిమానం ఉందని లెక్క. అది అక్కడి స్పెషల్. ఆ ట్రెండ్‌ను ఆంధ్రా రాజకీయాలకు పరిచయం చేశారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి. . కానీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వారినే మించిపోయరంటూ కేడరే చర్చించుకుంటోంది.

ఇదేదో బాగుందని అనుకున్న ఆయన అభిమానులు.. పార్టీ కేడర్‌ అటువంటి ఉంగరాలు కోసం ఆర్డర్స్‌ ఇచ్చారట. ఇన్నాళ్లూ లేంది ఇప్పుడు ఆయన ఈ ఉంగరం పెట్టుకోవడానికి మంత్రివర్గ విస్తరణే కారణం అనే టాక్ బలంగా వినిపిస్తోంది. కొద్దిరోజుల క్రితం అమరావతిలో కరకట్టపై విస్తరణ పనుల శంకుస్థాపనలో ఆయన అధినేత జగన్ కాళ్లు మొక్కారు. ఇప్పుడు ఉంగరాన్ని నమ్ముకున్నారు. చాలా మంది జాతకం బాగుంటుందని.. మంచి భవిష్యత్‌ ఉంటుందని జాతిరత్నాలతో కూడిన ఉంగరాలు పెట్టుకుంటారని..  నారాయణస్వామికి తన జాతకం ఎవరి చేతిలో ఉందో తెలుసు కాబట్టి వారి ఫొటో ఉన్న ఉంగరాన్నే పెట్టేసుకున్నారని ఆయనపై సెటైర్లు పేలుతున్నాయి.