వానాకాల‌మా? ఎండాకాల‌మా? ఈ ఉక్కపోత ఏందిరా బాబోయ్‌..

జూన్‌లో రుతుప‌వ‌నాలు వ‌స్తాయ్‌. జులైలో వాన‌లు కురుస్తాయ్‌. ఆగ‌స్టులో వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా మారుతుంది. ఇది స‌హ‌జం. ప్ర‌కృతి నియ‌మం. కానీ, ఆ వ‌రుస క్ర‌మం ఆగ‌మాగం అవుతోంది. ప్ర‌కృతి ప్ర‌కోపిస్తోంది. గ్లోబ‌ల్ వార్మింగ్‌తో వార్ చేస్తోంది. మ‌నుషులు చేసిన పాపం తిరిగి మ‌నుషుల‌కే శాపంగా మారుతోంది. అందుకే, నేచ‌ర్ కుత‌కుత ఉడుకుతోంది. ఆగ‌స్టులో మునుపెన్న‌డూ లేనివిధంగా అనూహ్య వాతావ‌ర‌ణం. ఓ వైపు వ‌ర్షం. మ‌రోవైపు ఉక్క‌పోత‌. ఉద‌యం లేవ‌గానే చెమ‌ట‌. రాత్రి వేళ‌లోనే మంట‌. ఇది ఆగ‌స్టు నెలా? ఏప్రిల్ నెలా? అర్థంకాని ప‌రిస్థితి. తెలంగాణ‌లో ఈ టార్చ‌ర్ మ‌రీ ఎక్కువ‌గా ఉంది.

డే అండ్ నైట్ టెంప‌రేచ‌ర్ పెరిగిపోతోంది. సాధారణం కంటే నాలుగు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత న‌మోద‌వుతోంది. పగటిపూట గరిష్ఠంగా 34 డిగ్రీల వరకు, రాత్రివేళ‌ కనిష్ఠ ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల వరకు చేరుతోంది. 

పశ్చిమం నుంచి పొడిగాలులు వస్తుండటంతో వేడి ఎక్కువగా ఉంటోంది. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం, ద్రోణి ఏవి లేకపోవడంతో తేమ గాలులు రావడం లేదు. వర్షాలు పడటం లేదు. ఇలాంటి వెద‌ర్ మ‌రో మూడు రోజుల పాటు ఉంటుంద‌ని.. 16 నుంచి వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణశాఖ చెబుతోంది. 

ఉక్క‌పోత విప‌రీతంగా పెర‌గ‌డంతో.. కరెంట్‌ వినియోగం ఒక్క‌సారిగా పెరిగింది. ఈ సీజన్‌లో మంగళవారం గరిష్ఠ వినియోగం న‌మోదైంది. గతేడాది ఆగస్టు 5 నుంచి 10 మధ్య గరిష్ఠ వినియోగం 44.2 మిలియన్‌ యూనిట్లు ఉంటే.. ఈఏడాది గరిష్ఠంగా 58.78 మిలియన్‌ యూనిట్లపైనే కరెంట్‌ వినియోగం ఉంది. విద్యుత్ డిమాండ్‌ వేసవిలో 2800 మెగావాట్లు ఉంటే.. ప్రస్తుతం 2746 మెగావాట్ల వరకు ఉంది. వానలు కుర‌వ‌కపోతే క‌రెంట్ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ప‌వ‌ర్ క‌ట్స్ కూడా పెర‌గ‌నున్నాయి.