కార్యకర్తలకు రుణపడి ఉంటా.. చంద్రబాబు
posted on Apr 24, 2015 5:27PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహబూబ్ నగర్ పాలమూరులో నిర్వహించిన బహిరంగసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెదేపాను దెబ్బతీయడం ఎవరి వల్ల కాదని, ఈరోజు తెలంగాణ రాష్టం ధనిక రాష్టంగా ఉందంటే దానికి నేను చేసిన అభివృద్ధే కారణమని స్పష్టం చేశారు. ఒకరిద్దరు పార్టీ నుండి వెళిపోతే పార్టీకీ వచ్చిన నష్టం ఏం లేదన్నారు. ఒక నాయకుడు పోతే వంద మంది నాయకులను తయారుచేసే సత్తా పార్టీకి ఉందని అన్నారు. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు ఉండటం పార్టీకి అదృష్టమని, ఇక్కడి కార్యకర్తల అభిమానం చూసి వారికి శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నా అని అన్నారు. గతంలో పాలమూరు జిల్లా ఎక్కువగా బడుగు, బలహీన వర్గాల పేదలున్నారు. ఈ జిల్లాను అభివృద్ధి చేస్తానని చెప్పినట్టుగానే ఆ మాటకు కట్టుబడి ఉన్నా అని తెలిపారు. మహిళలకు ప్రసవ సమయంలో ఏదైనా జరిగితే ఆదుకోవాలని నేతలు సూచించినప్పుడు తప్పకుండా ఈ విషయం మీద ఆలోచిస్తానని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణకు జాతీయ కమిటీ ఏర్పాటు చేస్తానని స్పష్టం చేశారు.