వైకాపా విమర్శలకు చంద్రబాబు చేతలతో జవాబు

 

 

వైకాపా నేత శ్రీకాంత్ రెడ్డి రెండు రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం సింగపూర్, జపాన్ దేశాలలో చేస్తున్న పర్యటనల వలన రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనమూ ఉండదని, ఆయన తన పార్టీలో వ్యాపారవేత్తలయిన యంపీలు, మంత్రులకు లాభం చేకూర్చేందుకే వారిని వెంటబెట్టుకొని ప్రజాధనంతో విదేశీ యాత్రలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదేవిధంగా విదేశీయాత్రలు చేసేరని కానీ వాటి వలన రాష్ట్రానికి ఒక్క రూపాయి పెట్టుబడి కూడా రాలేదని విమర్శించారు. అందువలన ఆయన చేస్తున్న విదేశీ యాత్రలకు అయిన ఖర్చు, వాటి ఉద్దేశ్యం, ప్రయోజనం గురించి విచారణ జరిపించాలని డిమాండ్ చేసారు.

 

గతంలో చంద్రబాబు నాయుడు సమైక్య ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అమెరికా తదితర దేశాలలో పర్యటించి మైక్రోసాఫ్ట్ వంటి ప్రముఖ ఐటీ సంస్థలను హైదరాబాద్ రప్పించి రాష్టానికి అక్షయ పాత్ర వంటి హై టెక్ సిటీని నిర్మించిన సంగతి బహుశః శ్రీకాంత్ రెడ్డికి తెలుసో తెలియదో?

 

మళ్ళీ ఇప్పుడు సింగపూర్, జపాన్ దేశాల పర్యటనల వలన రాష్ట్రానికి దాదాపు రూ.60,000కోట్లు పెట్టుబడులు రావచ్చని అంచనా వేస్తున్నారు. ప్రముఖ వాహనాల తయారీ సంస్థ ‘ఇసుజు’ చిత్తూరులో శ్రీసిటీ వద్ద తమ పికప్ వాహనాల తయారీ సంస్థ ఏర్పాటుకు సంసిద్దత వ్యక్తం చేసింది. అదేవిధంగా ఆహారోత్పత్తులను నిలువచేసే కోల్డ్ స్టోరేజీలకు, ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థలకు అవసరమయిన కూలింగ్ వ్యవస్థ (రిఫ్రిజిరేషన్) ఏర్పాటుకు సంసిద్దత వ్యక్తం చేసింది. అదేవిధంగా ఈరోజు సుముటిమో సంస్థతో సమావేశమయిన చంద్రబాబు బృందం నాలుగు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసింది. వాటిలో ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో 4000మెగావాట్స్ సామర్ధ్యం గల ధర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు, రాజధాని నిర్మాణంలో సహకారం, రాజధాని నిర్మాణం కోసం నిధుల సమీకరణ, రాజధానిని స్మార్ట్ సిటీ గా మలిచేందుకు అవసరమయిన సాంకేతిక పరిజ్ఞానం అందజేయడం, రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థల ఏర్పాటుకు నిధుల సమీకరణ వంటి కీలక ఒప్పందాలపై సంతకాలు చేసారు. మరి వీటన్నిటినీ చూసిన తరువాత కూడా వైకాపా అనుమానాలు వ్యక్తం చేసినట్లయితే, దానికి ప్రజలే తగిన గుణపాటం చెపుతారు.

 

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికలలో తనే గెలిచి ముఖ్యమంత్రి కాబోతున్నందున రాజధాని నిర్మాణం కోసం విదేశీ కన్సల్టెన్సీ కూడా ఖరారు చేసేసారని, డ్రాయింగులు కూడా సిద్దమయిపోయాయని వైకాపా నేతలు చెప్పుకోవడం ప్రజలకి తెలుసు. ఒకవేళ ఆయనే నిజంగా ఎన్నికలలో గెలిచి ముఖ్యమంత్రి అయినట్లయితే, అప్పుడు ఆయన తన లోటస్ పాండ్ లో కూర్చొనే రాజధాని కట్టించేసేవారా లేకపోతే ఆయన కూడా చంద్రబాబులా విదేశీయాత్రలు చేసిఉండేవారా? అని వైకాపా ప్రశ్నించుకొంటే ఇటువంటి కువిమర్శలు చేసేవారు కాదు. ఇవ్వన్నీ వైకాపా ఓర్వలేక చేస్తున్న విమర్శలే తప్ప వేరే కాదని చెప్పవచ్చును.