యువనేత అనుకున్నదొకటి.. అయ్యిందొకటి
posted on Nov 10, 2015 5:05AM

అనుకున్నది ఒక్కటి.. అయ్యింది ఒక్కటి... బోల్తా పడ్డావులే బుల్ బుల్ పిట్టా అని ఒక యువనేతను చూసి రాజకీయ వర్గాలు కామెడీగా పాటలు పాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కేసుల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న సదరు యువనేత ఏ నిమిషాన అయినా మళ్ళీ జైలు ఊచలు లెక్కబెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మళ్ళీ జైలు జీవితం రాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వున్నంతవరకూ ఆ పార్టీ కాళ్ళావేళ్ళా పడి నెట్టుకొచ్చిన ఆ నేత ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాన్ని మంచి చేసుకునే ప్రయత్నంలో పడ్డాడు. ఇప్పటికే నానా రకాలుగా బీజేపీని కాకా పట్టే ప్రయత్నాలు చేస్తున్న ఆయనకు ఈమధ్య జరిగిన బీహార్ ఎన్నికలు మరో మంచి అవకాశంలా కనిపించాయి. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం భారీ స్టెప్పు, ఇంకా భారీ లింకప్పు చేశాడు.. కానీ బీహార్ ఎన్నికలలో బీజేపీ తుస్సుమనడంతో ఆయనగారి శ్రమ మొత్తం బూడిదలో పోసిన పన్నీరైపోయింది.
మొన్నటి బీహార్ ఎన్నికలలో హైదరాబాద్‌లో హవా నడిపే ఒక పార్టీకి ఎంతమాత్రం పోటీ చేసే ఆలోచన లేదు. ఆమధ్య జరిగిన మహారాష్ట్ర ఎన్నికలలో పోటీ చేసి రెండు సీట్లు గెలిచిన ఆ పార్టీ బీహార్‌లో కూడా పోటీ చేసే ఆలోచన చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ పార్టీ అలాంటి స్టెప్పే తీసుకోలేదు. కానీ ఆ పార్టీ బీహార్లో పోటీ చేసేలా మన యువనేత శాయశక్తులా కృషి చేసి ఒప్పించాడు. నిప్పు - ఉప్పులా వుండే బీజేపీని, ఆ పార్టీ మధ్య బీహార్ వరకు అంతర్గత సయోధ్య కుదిర్చాడు. యువనేత కృషి ఫలితంగా సదరు హైదరాబాద్ పార్టీ కూడా చివరి నిమిషంలో బీహార్ ఎన్నికల బరిలోకి దిగింది. ఈ పార్టీ బీహార్లో ఎన్నికల బరిలోకి దిగితే ఓట్లు చీలి బీజేపీకి మేలు జరుగుతుందని ఆ పార్టీ నాయకత్వానికి చెప్పి ఒప్పించాడు. బీహార్లో పోటీ చేస్తే మీ పార్టీ మరో స్టేట్లో అడుగు పెట్టినట్టు వుంటుందని, బీజేపీ నుంచి లోపాయకారీ మద్దతు కూడా లభిస్తుందని చెప్పి ఈ హైదరాబాద్ పార్టీని ఒప్పించాడు. సదరు పార్టీ బీహార్ ఎన్నికలలో పోటీ చేయడానికి అయ్యే ఖర్చు మొత్తం తానే భరించాడని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
ఇలా బీహార్ ఎన్నికలలో బీజేపీకి బోలెడంత ఉపయోగపడ్డానని కలరింగ్ ఇచ్చుకోవడానికి సదరు యువనేత చాలా ట్రై చేశాడు. బీహార్లో బీజేపీ గెలిస్తే ఆయనకు ఏమేరకు ప్రతిఫలం అందేదోగానీ, ఇప్పుడు బీజేపీ దారుణంగా ఓడిపోవడంతో పరిస్థితి తారుమారయ్యింది. కొన్ని స్థానాల్లో బీజేపీ ఓడిపోవడానికి ఎంఐఎం కూడా కారణమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. దాంతో యువనేత అనవసరంగా ఆ పార్టీని బీహార్ ఎన్నికలలో దింపినట్టు అయింది. అది సహజంగానే బీజేపీకి ఆగ్రహం తెప్పించే విషయంగా మారింది. తాను అనుకున్నది ఒకటి అయితే అయ్యింది మరొకటి కావడంతో తల పట్టుకోవడం యువనేత వంతు అయింది.