ఏపీ భవన్ విషయంలో ఏమి చేస్తారో మరి ?

 

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ సీఎం కాగానే హైదరాబాద్ లో ఆంధ్రా వాటాగా ఉన్న భవనాలను తెలంగాణాకి అప్పగించేశారు. ఎపీకి రావాల్సిన వాటి గురించి కనీసం చర్చ కూడా జరపకుండా వాటి గురించి పెద్దగా పట్టించుకోని తెలంగాణాకి అప్పగించడంపై విమర్శలు చెలరేగాయి. ఇప్పుడు ఏకంగా ఆంధ్రాకు అసలు తెలంగాణ నుంచి రావాల్సింది ఏమి లేదని ఆ రాష్ట్ర అధికారులు తేల్చి చెప్పారు. తెలుగు రాష్ట్రాల విభజన అంశాలకు సంబంధించి కీలక సమావేశం జరిగింది. అధికారుల స్థాయిలో పరిష్కారమయ్యే వాటిపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఇందులో నిర్ణయించారు. 

దాదాపు మూడు గంటలపాటు సాగిన ఈ సుదీర్ఘ భేటీలో ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల పంపిణీ, ఢిల్లీలోని ఏపీ భవన్‌ విభజనపై ప్రధానంగా చర్చ జరిగింది. దేశ రాజధాని ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌ నుంచి ఏపీ భవన్‌ ప్రాంగణంలోని గోదావరి బ్లాక్‌ వరకూ తమకే చెందుతుందని, నిజాం వారసత్వ ఆస్తిని తాము వదులుకునే ప్రసక్తే లేదని తెలంగాణ తేల్చి చెబుతోంది. నిజాం నవాబుకు చెందిన ఆ స్థలంలో ఒక్క గజం కూడా ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వబోమని గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. 

మరోపక్క ఏపీ మాత్రం పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏపీభవన్‌ ఆస్తులనూ విభజించాలని వాదిస్తోంది. హైదరాబాద్‌లో శనివారం అధికారుల మధ్య జరిగిన చర్చల్లోనూ ఈ అంశం మరోసారి ప్రస్తావనకు వచ్చింది. ఏపీ భవన్‌ లో హైదరాబాద్‌ హౌజ్‌ వైపు ఉన్న భవనాలను తాము తీసుకుంటామని, మిగతావి ఏపీ తీసుకోవాలని తెలంగాణ అధికారులు సూచించారు. కానీ ఏపీ అధికారులు అందుకు ఒప్పుకోలేదు. సమస్యలను సానుకూలంగా, పరిష్కరించుకోవాలని ఇరు రాష్ట్రాల సీఎం లూ నిర్ణయించిన నేపథ్యంలో ఈ ఏపీ భవన్ ఎవరికీ  చెందుతుందో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.