మాజీ సర్పంచ్ కి కేసీఆర్ ఫోన్.. మళ్ళీ హరీష్ ని పక్కన పెట్టారా?

 

సీఎంలు సాధారణ వ్యక్తులకు ఫోన్‌ చేసి మాట్లాడటం చాలా అరుదు. అయితే ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ రూటే సెపరేటు. ఆ మధ్యన సోషల్ మీడియాలో ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన శరత్‌ అనే రైతు ఆవేదనను చూసిన కేసీఆర్.. సదరు రైతుకు నేరుగా ఫోన్ చేసి మాట్లాడిన సంగతి తెలిసిందే. తాజాగా మళ్ళీ అలాంటి సంఘటనే చోటు చేసుకుంది. రహదారి విషయమై సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్‌ మాజీ సర్పంచి వెంకటేష్ గౌడ్‌ కు కేసీఆర్ నేరుగా ఫోన్ చేసి మాట్లాడారు.

ప్రస్తుతం మర్కూక్‌, జగదేవపూర్‌ మండలాలకు చెందిన ప్రజలు హైదరాబాద్‌ వెళ్లాలంటే గౌరారం, ములుగు మీదుగా రాజీవ్‌ రహదారి చేరుకుని అక్కడి నుంచి వెళ్తున్నారు. ఇది వారికి చాలా దూరం అవుతుంది. ఆ దూరం తగ్గించాలని భావించిన కేసీఆర్.. ఒంటిమామిడి నుంచి క్షీరసాగర్‌, కమలాబాద్‌, నర్సంపల్లి, అలియాబాద్‌, అల్లీనగర్‌ మీదుగా పాండురంగ ఆశ్రమం వరకు రహదారి నిర్మించాలని అనుకుంటున్నట్లు వెంకటేష్ తో ఫోన్‌లో చెప్పినట్లు తెలుస్తోంది. రహదారి నిర్మిస్తే ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని, హైదరాబాద్‌ చేరుకునేందుకు ఎంతో సులువు అవడంతో పాటు ఆయా గ్రామాల రైతుల భూములకు విలువ పెరుగుతుందన్నారని సమాచారం. ఈ రహదారి వేయటానికి అవసరమైన భూమిని ఆయా గ్రామాల రైతులు ఇస్తారా? అని అడిగిన కేసీఆర్.. రహదారి నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని, రైతులు భూములు ఇచ్చేలా మాట్లాడాలని మాజీ సర్పంచికి కేసీఆర్ సూచించారని సమాచారం.

సీఎం ఓ మాజీ సర్పంచ్ కి ఫోన్ చేసి మాట్లాడటం చర్చనీయాంశమైంది. అయితే ఈ విషయంలో కొందరి లాజిక్ లు మరోలా ఉన్నాయి. సిద్దిపేట అనగానే ముందుగా హరీష్ రావు పేరు గుర్తొకొస్తుంది. గతంలో ఎన్నో బాధ్యతలను మేనల్లుడు హరీష్ కి అప్పగించిన కేసీఆర్.. ఇప్పుడు ఈ రహదారి విషయంలో హరీష్ ని రంగంలోకి దింపకుండా.. నేరుగా తానే రంగంలోకి దిగి, ఓ మాజీ సర్పంచ్ కి ఫోన్ చేసి భూములు ఇచ్చేలా చూడాలని అడగడం ఏంటి?. హరీష్ కి ఇప్పుడు సొంత జిల్లాలో పనులు కూడా అప్పగించట్లేదా? కావాలనే పక్కన పెడుతున్నారా? అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సరే ఎవరి అనుమానాలు ఎలా ఉన్నా సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి సామాన్యులకి ఫోన్ చేయడం గొప్ప విషయమనే చెప్పాలి.