ఇంటర్ బోర్డ్ వివాదంతో కేసీఆర్ ని ఇరుకున పెట్టనున్న అమిత్ షా!!

 

కొద్దిరోజుల క్రితం తెలంగాణలో ఇంటర్ బోర్డు వివాదం సంచలమైన సంగతి తెలిసిందే. ఫలితాల్లో అవతవకల వల్ల ఎందరో విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఇంటర్ బోర్డు మీద, కేసీఆర్ సర్కార్ మీద తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన కేసీఆర్.. రీవాల్యూయేషన్ చేసి మళ్ళీ ఫలితాలు విడుదల చేయాలని ఆదేశించారు, అదేవిధంగా ఈ అవతవకలకు కారణమైన వారి మీద చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసారు. ఆ తరువాత ఇంటర్ బోర్డు వివాదం మెల్లమెల్లగా చల్లారుతూ వచ్చింది. ఇప్పుడు దాదాపు అందరూ ఈ విషయం గురించి మర్చిపోయారు. అయితే ఇప్పుడు బీజేపీ మళ్ళీ ఈ వివాదాన్ని తెరమీదకు తీసుకురావాలని చూస్తోందట.

ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకున్న బీజేపీ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పార్టీ బలోపేతం కోసం అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో తెలంగాణ బీజేపీ కోర్ క‌మిటీ స‌భ్యులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో పార్టీ విస్త‌ర‌ణ‌కు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై చ‌ర్చించారు. తెలంగాణ‌లో గ‌తం కంటే 40 శాతం అధికంగా స‌భ్య‌త్వ న‌మోదు జ‌ర‌గాల‌నే ల‌క్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ఈ చ‌ర్చ‌ల్లోనే తెలంగాణ ఇంట‌ర్ బోర్డు వివాదాన్ని అమిత్ షా దృష్టికి రాష్ట్ర నేత‌లు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇంట‌ర్ బోర్డు అవ‌క‌త‌వ‌క‌ల‌కి కార‌ణ‌మైన వారిపై ఇంత‌వ‌ర‌కూ సీఎం కేసీఆర్ చ‌ర్య‌లు తీసుకోలేద‌ని, విద్యార్థుల మ‌ర‌ణానికి కార‌ణ‌మైన అంశాన్ని మెల్ల‌గా మ‌రుగున ప‌డేశారని రాష్ట్ర నేత‌లు చెప్పారట. దీనిపై అమిత్ షా స్పందిస్తూ.. ఇంట‌ర్ బోర్డు వ్య‌వ‌హారంపై కేంద్రం దృష్టి సారిస్తుంద‌ని, దీనికి సంబంధించి పూర్తి నివేదిక‌ను త్వ‌ర‌లోనే రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి కోర‌తామ‌ని, ఆ త‌రువాత కార్యాచ‌ర‌ణ ఏంట‌నేది చూద్దామ‌ని అన్నట్లు సమాచారం.

ఇంట‌ర్ బోర్డు వివాదంపై కేంద్రం దృష్టి సారిస్తే, అది మ‌రోసారి రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చ‌ర్చ‌కు దారి తీసే అవ‌కాశం ఉంది. మొత్తానికి బీజేపీ ఓ పక్క పార్టీ బలోపేతం మీద దృష్టి పెడుతూనే.. మ‌రోప‌క్క టీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో పెట్టే అంశాల‌పై కూడా దృష్టి పెడుతోందని తెలుస్తోంది.