కావూరిపై కారాలు నూరుతున్న పోలవరం కాగ్రెస్‌

ఇటీవల పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోవటం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉప ఎన్నికల సందర్భంగా పార్టీలో ఏర్పడిన వర్గ విభేదాల ఫలితంగా కాంగ్రెస్‌ పార్టీకి ఈ దుస్దితి ఏర్పడినట్లు పలువురు బహిరంగ విమర్శలు చేస్తున్నారు. పశ్చిమ ఏజన్సీ మెట్టప్రాంత మండలాల్లో కంచుకోటగా ఉండే కాంగ్రెస్‌ పార్టీలో అధినాయకుల ఆధిపత్య పోరులో పోలవరం ఉప ఎన్నిక కాంగ్రెస్‌ పార్టీ ఉనికికి ప్రశ్నార్ధకంగా మారింది. గతంలో రాష్ట్రంలోని అనక ప్రాంతాల్లో పార్టీలో ఎక్కువ శాతం ద్వితీయశ్రేణి నాయకుల్లో ఏర్పడే వర్గ విభేదాలను అధిష్టానం ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు, ఎంపిలు, అమాత్యులు వెళ్ళి అక్కడ సమసయలను పరిష్కరించి, పార్టీ కేడర్‌లో విభేదాలు లేకుండా పరిష్కరించే పరిస్ధితులు ఉండేవి. అయితే ప్రధమ శ్రేణి నాయకుల్లోనే యిలాంటి వర్గ విభేదాలు ఏర్పడి ఆధిపత్య పోరుతో పార్టీ ఉనికికి నష్టం కలిగించే విధంగా రాజకీయాలు చేయటం, పోలవరం ఉప ఎన్నికల్లో ఘోరంగా విఫలమవ్వటం, డిపాజిట్లు కూడా దక్కకుండా మిగిలిన రాజకీయ పార్టీలకు చులకన కావటం లాంటి పరిస్ధితులను పరిశీలిస్తే పోలవరం నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్‌ పార్టీలో ఏర్పడ్డ వర్గ విభేదాలు ఏ స్ధాయిలో నెలకొని ఉన్నాయో అవగతమవుతుంది.

 

గత మూడు దశాబ్ధాల రాజకీయ చరిత్రలో జరిగిన పలు ఎన్నికల సందర్భంగా అభ్యర్ధిని ఎంపిక చేసి, ఒంటిచేత్తో కాంగ్రెస్‌ పార్టీకి విజయావకాశం కల్పించిన ఏజన్సీ టైగర్‌ కరాటం రాంబాబును పక్కనపెట్టి ఈ ఉప ఎన్నికల్లో అధిష్టానం పోలవరం అభ్యర్ధి ఎంపికలో అత్యుత్సాహాన్ని ప్రదర్శించటంతో ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయినట్లు రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్ధి ఎంపికలో ఏలూరు ఎంపి కావూరి జోక్యాన్ని అధిష్టానం సమర్ధించటం, ఉప ఎన్నిక సందర్భంగా కరాటం ఎంపిక చేసిన అభ్యర్ధిని కాదని, కావూరి ఎంపిక చేసిన మహిళా అభ్యర్ధికి ప్రాధాన్యత ఇవ్వటంతో పశ్చిమ ఏజన్సీ కాంగ్రెస్‌ పార్టీలో ఇరువురి అధినాయకుల మధ్య ఏర్పడ్డ వర్గ విభేదాలకు అధిష్టానం చర్యలు మరింత ఆజ్యంపోసినట్లయ్యింది. ఈ సందర్భంగా కినుకు వహించిన కరాటం కార్యకర్తలు నిరుత్సాహానికి గురికావటం, అధినాయకులు వచ్చి కావూరిని సమర్ధిస్తూ కరాటాన్ని ఎంత బుజ్జగించినా, అధిష్టానం చర్యలను విభేదించిన కరాటం అనునాయకులు, కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు చర్యల ఫలితంగానే కాంగ్రెస్‌ పార్టీ ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కకుండా ఓడిపోవటానికి మరో కారణంగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అధిష్టానం మరియు మంత్రివర్గం బుజ్జగింపుల అనంతరం కాంగ్రెస్‌ అభ్యర్ధి విజయం కృషి చేస్తామని కరాటం హామీ ఇచ్చినా, కార్యకర్తలు కొమ్ముకాయకపోవటమే ఈ అపజయానికి మరో కారణంగా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

 

కరాటం మరియు కావూరి మధ్య ఏర్పడిన అభిప్రాయ భేదాలను తొలగించి, పోలవరం కాంగ్రెస్‌ అభ్యర్ధి నూపా పార్వతి విజయం కోసం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షులు బొత్స సత్యనారాయణ, మంత్రులు వట్టి, పితానిలు కూడా పలు సందర్భాల్లో కరాటం రాంబాబును బుజ్జగించే ప్రయత్నాలు చేసినా, పోలవరం కాంగ్రెస్‌ అభ్యర్ధి గెలుపు విషయంలో న్యాయం జరగకపోవటాన్ని పరిశీలిస్తే ఏజన్సీ మెట్ట ప్రాంతంలో కాంగ్రెస్‌ పార్టీలో ముదిరిన వర్గ విభేదాలు దర్పణం పడుతున్నాయి. నాయకుల్లోనే ఐక్యత లోపిస్తే కార్యకర్తలు ఆ పార్టీ విజయం కోసం ఏ విధంగా కృషి చేస్తారంటూ రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఒకప్పుడు పశ్చిమ ఏజన్సీ మెట్ట ప్రాంతంలో కంచుకోటా ఉండే కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుత రాజకీయ భౌతిక పరిస్ధితుల ద్వారా ఈ ఉప ఎన్నికల్లో 16 వేలు ఓట్లు గెలుచుకోవటం దురదృష్టకర పరిణామంగా కాంగ్రెస్‌ కార్యకర్తలే వ్యాఖ్యానిస్తున్నారు. పశ్చిమ ఏజన్సీలో పట్టున్న కరాటాన్ని పక్కన పెట్టి ఎంపి కావూరికి ఉప ఎన్నికల నిర్వహణా, అలాగే అభ్యర్ధి ఎంపికతో పాటు విజయాన్ని చేకూర్చే బాధ్యతలను అప్పగించటమే అధిష్టానం చేసిన తప్పిదంగా పలువురు కాంగ్రెస్‌ నాయకులు విమిర్శిస్తున్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకుల్లో ఆయన పట్ల వ్యతిరేకత నానాటికి పెరుగుతోంది.