ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాజీనామా.. ముఖ్యమంత్రి రేసులో ఎవరున్నారంటే?

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి మంగళవారం (సెప్టెంబర్ 17) రాజీనామా చేయనున్నారు. మధ్యాహ్నం 4.30 గంటలకు ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ అప్పాయింట్ మెంట్ తీసుకున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టై ఆరు నెలలు జైలులో ఉన్న కేజ్రీవాల్ బెయిలుపై బయటకు వచ్చిన వెంటనే తాను రాజీనామా చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. మద్యం కుంభకోణం కేసు ఇప్పుడప్పుడే తేలే పరిస్థితి లేదనీ, అందుకే తాను నిర్దోషినని నిరూపించుకోవడానికి ఫ్రెష్ మేండేట్ కోరాలని కేజ్రీవాల్ భావిస్తున్నారు. అందుకే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ప్రజా తీర్పు తరువాతే మళ్లీ సీఎం కుర్చీలో కూర్చుంటాననీ ఆయన ప్రకటించారు. ఢిల్లీ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. మహారాష్ట్రతో పాటే ఢిల్లీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరపాలని ఆయన కోరుతున్నారు. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరిలో జరుగుతాయి. 

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు సంధించారు. మద్యం కుంభకోణం, మనీలాండరింగ్ వంటి లేనిపోని ఆరోపణలు చేశారు. అయితే వాటిలో ఒక్కటీ నిరూపితం కాలేదు. పైపెచ్చు ఈ కేసు విచారణ ఇప్పట్లో పూర్తయ్యేలా లేదని సాక్షాత్తూ సుప్రీం కోర్టే వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ప్రజాక్షేత్రంలో కేజ్రీవాల్ పలుకుబడి పెరిగిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆధారరహిత ఆరోపణలతో కేంద్రంలోని బీజేపీ సర్కారే దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి కేజ్రీవాల్ ను అరెస్టు చేయించిందన్న భావన అత్యధికుల్లో వ్యక్తం అవుతోంది.   ఈ నేపథ్యంలో తన నిర్ణయంతో కేజ్రీవాల్ బీజేపీకి గట్టి షాక్ ఇచ్చినట్లే చెప్పవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ కు ప్రజలు ఓటేస్తే వారు కేజ్రీవాల్ ను నిర్దోషిగా నమ్మినట్లే అవుతుంది. ఇక తన రాజీనామా ప్రకటన ద్వారా ప్రజల నుంచి సానుభూతి లభిస్తుంది. తన రాజీనామా ప్రకటనతో కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా మూడో సారి ప్రజా మద్దతుతో పదవీ బాధ్యతలు చేపట్టేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని పరిశీలకులు అంటున్నారు. కొంత కాలం పాటు సీఎం పదవికి దూరంగా ఉన్నప్పటికీ, రాజకీయ కుట్రలో భాగంగానే  బీజేపీ తనను మద్యం కుంభకోణం కేసులో ఇరికించిందన్న సందేశాన్ని తన రాజీనామాద్వారా ప్రజలలోకి బలంగా పంపించారని చెప్పొచ్చు.

అదలా ఉండగా కేజ్రీవాల్ రాజీనామాతో ఢిల్లీ తదుపరి సీఎం ఎవరన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సీఎం రేసులో కేజ్రీవాల్ భార్య సహా కొందరు ఆప్ మంత్రులు ఉన్నారు.  కాగా ఢిల్లీ తదుపరి సీఎం ఎవరన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

ఈ ఐటెం తప్పకుండా చదవండి...కేజ్రీవాల్ రాజీనామా.. ముందస్తు తథ్యం!?