వణికిస్తున్న కొత్త వైరస్ ఎంపాక్స్!

వైరస్ అనే పేరు వింటేనే జనం భయంతో వణికి పోతున్న పరిస్థితి.  కరోనా వైరస్ సృష్టించిన విలయం, గాయం నుంచి బయటపడిన ప్రజలు వైరస్ అనే పదం వింటేనే వణికి పోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ మరో వైరస్ విజృంభిస్తోందంటూ హెచ్చరిక చేసింది. ఎంపాక్స్ అనే వైరస్ ప్రపంచ దేశాలను చుట్టేసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆ వైరస్ ఎంపాక్స్ ఇండియాలోకి కూడా ప్రవేశించిందని ప్రకటించింది.  విదేశాల నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిలో ఎంపాక్స్‌ లక్షణాలు కనిపించడంతో  కేంద్రం అప్రమత్తం అయింది.   ఎంపాక్స్‌ అనే ఈ వైరస్‌ లక్షణాలు కనిపించిన ఈ ప్రయాణికుడిని ఐసోలేషన్ లో ఉంచి చికిత్స చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెళ్లడించింది. అయితే ఆ ప్రయాణీకుడి పేరు, ఏ దేశం నుంచి వచ్చాడు అన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు.   

ఎంపాక్స్‌ వైరస్‌ అనేక ఆఫ్రికా దేశాల్లో ఇప్పటికే వ్యాపిస్తున్నందువల్ల గత నెల ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయడం జరిగింది. ప్రజారోగ్యానికి సంబంధించిన అత్యవసర స్థితిని కూడా ప్రకటించింది. ఈ ఎంపాక్స్‌ వైరస్‌ గాలి నుంచి, నీటి నుంచి సంక్రమించే మహమ్మారి కాదు. ఇది శారీరక సంబంధాల వల్ల, సన్నిహితంగా మెలగడం వల్ల వ్యాప్తి చెందడం జరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఆఫ్రికా దేశాల్లో పుట్టి పెరిగి, చుట్టుపక్కల అనేక దేశాలకు వ్యాపించిన ఎంపాక్స్ ఇటీవల ఐరోపా దేశాలకూ వ్యాపించింది. వాస్తవానికి ఎంపాక్స్ కట్టడిలో అగ్రరాజ్యాలు క్షంతవ్యం కాని నిర్లక్ష్యాన్ని ప్రదర్శించాయి. కేవలం ఆఫ్రికా దేశాలకు, అదీ పేద దేశాలకు మాత్రమే ఎంపాక్స్ పరిమితం అని భావించి, దీని నివారణకు వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నా కూడా దానికి ఆఫ్రికాకు పంపించేందుకు చొరవ చూపలేదు. ఇప్పుడీ వైరస్ ఐరోపాకు వ్యాప్తి చెందడంతో  ఎంపాక్స్ వ్యాక్సిన్ ను ఆ దేశాలకు  రవాణా చేస్తున్నాయి. అది పక్కన పెడితే  ప్రపంచ దేశాల మధ్య రాకపోకల కారణంగా  వైరస్ లు వేగంగా విస్తరించే అవకాశాలు ఎక్కువ అవుతున్నాయి.  వీటిని మొగ్గలోనే తుంచేయాలి. నిర్లక్ష్యం వహిస్తే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.   2022 జనవరి, 2024 ఆగస్టులకు మధ్య 120 దేశాల్లో లక్ష మందికి పైగా   ఎంపాక్స్‌ సోకినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వెల్లడించింది.  

ఇక ఇండియా విషయానికి వస్తే   వైరస్‌ లకు సంబంధించిన చరిత్ర ఉన్న దేశాల నుంచి  వచ్చే ప్రయాణికులందరి మీదా నిఘా  ఉంచాలి. ముఖ్యంగా విమానాశ్రయాలు, నౌకాశ్రయాల్లో పూర్తి స్థాయిలో పర్య వేక్షణ ఉండాలి.  ఎంపాక్స్‌ లక్షణాలు కనిపించినా, ఈ లక్షణాలున్నట్టు అనుమానం కలిగినా అటువంటి వ్యక్తులను వెంటనే  ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందించాల్సి ఉంటుంది.