పశ్చిమలో మసకబారుతున్న పసుపుశోభ

ఒకే సామాజిక వర్గానికి కొమ్ముకాస్తున్న అధినేత దివంగత మహానేత ఎన్టీఆర్‌ ఆత్మగౌరవ నినాదంతో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీకి ఆది నుండి కంచుకోటగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో పసుపుశోభ మసకబారుతున్నట్లు అవగతమవుతుంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఆ పార్టీకి ఊపిరిని, ఉత్తేజాన్ని యిచ్చిన పశ్చిమ గోదావరి జిల్లాలో పార్టీలో నెలకొన్న వర్గ విభేదాలు, నాయకత్వలేమి, ఆధిపత్య పోరు ఫలితంగా ప్రజల విశ్వసనీయతను కోల్పోయింది. ఎన్టీఆర్‌ హయాంలో జిల్లాలోని ప్రజలంతా ముక్తకంఠంతో జైకొట్టిన తెలుగుదేశం పార్టీ, ప్రస్తుతం గ్రూపు రాజకీయాల నేపధ్యంలో ప్రజాభిమానం కోల్పోయింది.

 

ప్రజాస్వామ్య వ్యవస్ధలో ప్రజలు తమ సమస్యలను ఎలా పరిష్కరించు కోవాలో? విషయ పరిజ్ఞానంతో పనులు జాప్యం పట్ల అధికారులను సైతం ఎలా నిలదీయాలో? మొదలైన విషయాలపై దేశం పార్టీ హయాంలో తెలుసుకున్న ప్రజలు ఆ పార్టీ పట్ల అప్పట్లో అభిమానాన్ని పెంచుకున్నారు. అంతేకాకుండా దేశం పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలు కూడా ప్రజలను ఎంతో ఆకట్టుకున్నాయి. పార్టీ పట్ల మెక్కవోని అభిమానంతో ఎన్టీఆర్‌ హయాం అనంతరం కూడా ఆ పార్టీ జెండాను ప్రజలు విడిచిపెట్టలేదు. అలాగే పరిపాలనాధక్షుడుగా చంద్రబాబుకు కూడా ప్రజలు నీరాజనాలు పలికారు. 1983, 1985 సంవత్సరాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దేశం పార్టీ ప్రభంజనంతో కాంగ్రెస్‌ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. దేశం పార్టీకి రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేదనుకున్న తరుణంలో జిల్లాలో ఏర్పడిన రాజకీయ సమీకరణాల ఫలితంగా కాంగ్రెస్‌ పార్టీ కొంత పుంజుకున్నా,

 

1989 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టిడిపికే మెజారిటీ స్ధానాలు దక్కాయి. అలాగే 1994 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జిల్లాలోని 16 స్ధానాల్లో 15 స్ధానాలు టిడిపి కైవశం చేసుకోగా, ఒక స్ధానం అత్తిలి నుండి కనుమూరి బాపిరాజు దక్కించుకున్నారు. అలాగే 1999 సంవత్సరంలో టిడిపి హావా కొనసాగింది. అప్పుడు కూడా కొవ్వూరు స్ధానాన్ని మాత్రమే కాంగ్రెస్‌ అభ్యర్ధి జి.ఎస్‌.రావు దక్కించుకోగా, మిగిలిన స్ధానాలన్ని టిడిపి కైవశం చేసుకుంది. ఆ సందర్భంలో కాంగ్రెస్‌ పార్టీ పట్ల వ్యతిరేకతను జీర్ణించుకున్న కోటగిరి విద్యాధరరావు చింతలపూడి అసెంబ్లీ స్ధానానికి స్వతంత్య్ర అభ్యర్ధిగా పోటీచేసి ఎన్టీఆర్‌ ప్రభంజనంలోనే విజయం సాధించారు. కొవ్వూరుకు చెందిన ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు గ్రూపును చంద్రబాబు ప్రోత్సహించారని అపోహలతో కోటగిరి, కృష్ణబాబులకు మధ్య కొనసాగిన కోల్డ్‌వార్‌ అప్పట్లో జిల్లాలోని టిడిపిని క్షేత్రస్ధాయిలో దెబ్బతీసింది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులను వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ఏకతాటిపై తెచ్చి ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తే, దేశం పార్టీలో గ్రూపులను సరిదిద్ధకుండా చంద్రబాబు అందుకు భిన్నంగా వ్యవహరించటంతో ఎన్నికల్లో టిడిపి ఘోరంగా విఫలమయ్యింది.

 

2004 ఎన్నికల్లో కొవ్వూరు నుండి కృష్ణబాబు, పాలకొల్లు నుండి డాక్టర్‌ బాబ్జి, నరసాపురం నుండి కొత్తపల్లి సుబ్బారాయుడు మాత్రమే దేశం పార్టీలో విజయం సాధించి పరువు దక్కిందనిపించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పిఆర్‌పి ఆవిర్బవంతో కొనసాగిన కుల , సామాజిక రాజకీయాలు దాదాపు నాలుగైదు స్ధానాలలో తెలుగుదేశం పార్టీకి తీవ్ర నష్టం కలిగించాయి. 9 స్ధానాల్లో కాంగ్రెస్‌ ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటే, 5 స్దానాలు టిడిపి విజయం సాధించింది. పార్టీ నిర్మాణంలో మూలస్తంభాలైన సీనియర్ల సేవలను పక్కకు పెట్టడం, యువతను ప్రోత్సహించటంలో నిర్లక్ష్యం చేయటం, కష్టపడి పనిచేసే కార్యకర్తలను అలక్ష్యం చేయటంతో 2009 ఎన్నికల్లో టిడిపి కి ఎదురు దెబ్బలు తగిలాయి. ప్రజల్లో ఓట్లు వేయించగలిగిన నాయకులను పక్కన పెట్టి, కులం, ధనం ప్రాతిపదికన నాయకులకు పగ్గాలు అప్పగించే అధినేత ఆలోచనలు దేశం పార్టీని దెబ్బతీస్తున్నాయనే విమర్శలు కూడా లేకపోలేదు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్‌ హయాంలో మాదిరిగా అన్ని సామాజిక వర్గాల ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయాణం చేయటం లేదని, ఒక సామాజిక వర్గానికి మాత్రమే కొమ్ముకాస్తూ ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీలను విస్మరిస్తుందని, అందుకే గడచిన అసెంబ్లీ ఎన్నికల్లోను, ప్రస్తుత ఉప ఎన్నికల్లోను ప్రజలు దేశం పార్టీకి విజయాన్ని చేకూర్చలేదని పలు సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు, నాయకులు విమర్శిస్తున్నారు.