సీబీఐకి ఏపీ ప్రజల లేఖ...
posted on Apr 2, 2015 12:34PM
సీబీఐ అధికారులకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాసుకుంటున్న లేఖ. ఈమధ్యే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయింది. తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా వెలుగుతూ వుండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేదరాష్ట్రంగా మిగిలింది. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆపదల నుంచి గట్టెంక్కించగల నాయకుడనే సంపూర్ణ నమ్మకంతో తెలుగుదేశం పార్టీకి మేం అధికారం అప్పగించాం. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెంక్కించడానికి, రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడానికి నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ఆయన శ్రమను చూస్తుంటే అతి కొద్దికాలంలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందన్న నమ్మకం పెరుగుతోంది. ఇలాంటి శ్రామికుడికి అధికారం అప్పగించినందుకు మమ్మల్ని మేమే అభినందించుకుంటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మా రాష్ట్రంలోని ఒక వ్యక్తి తీరు మమ్మల్ని ఎంతో బాధిస్తోంది. ఆ బాధతోనే మేం మీకు ఈ లేఖ రాసుకుంటున్నాం.
పేరు చెబితే ఏడిచి చస్తాడని మేం ఆ వ్యక్తి పేరు చెప్పడం లేదు. ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుసు, అతనికి తెలుసు, దేశం మొత్తానికీ తెలుసు. ఇప్పటికీ ఆ వ్యక్తి ఎవరో కొంతమందికి తెలియకపోతే ఈ లేఖ మొత్తం చదివినతర్వాత వారికి కూడా ఆ వ్యక్తి ఎవరో స్పష్టంగా అర్థమైపోతుంది. రాష్ట్రాభివృద్ధి బాధ్యత ఆ వ్యక్తి భుజాల మీద కూడా వుంది. రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రితో సహకరించాల్సిన కనీస ధర్మం అతనికి వుండాలి. అయితే అతను సహకరించకపోగా సాధ్యమైనంత న్యూసెన్స్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. రైతుల రుణమాఫీకి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంటే, ఆ అంశం మీద నానా యాగీ చేశాడు. చివరకి ఫెయిలైపోయి నోరు మూసుకున్నాడు. ప్రపంచం అబ్బురపడే రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం భూ సమీకరణ చేస్తుంటే దానికి ఆ మహానుభావుడు ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేశాడో మాటల్లో చెప్పలేం. రాజధాని గ్రామాల్లో వాతావరణం ప్రశాంతంగా వుంటే కావాలని కొంతమంది రైతులను రెచ్చగొట్టడం, తన విష పుత్రికల్లో ఘోరంగా రాతలు రాయడం. కూతలు కూయడం. తన స్వార్థం కోసం కొంతమంది రైతుల్ని పావుల్లా వాడుకోవడం... ఇదే అతని పని. చివరికి రాజధాని రైతులు అతన్ని దూరంగా పెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తున్నారు.
రాజధాని విషయంలో ఫెయిల్ అయిపోయిన ఆ వ్యక్తి ఇప్పుడు పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల మీద న్యూసెన్స్ చేస్తున్నాడు. ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణం జరగడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడటం ఆ గ్రహానికి ఎంతమాత్రం ఇష్టం లేనట్టుంది. అందుకే రకరకాల పావులు కదుపుతూ, ఇతర రాష్ట్రాల వారికి లేనిపోని ఐడియాలు ఇస్తూ నాశనం దిశగా అడుగులు వేస్తున్నాడు. ఇలాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌కి చెందినవాడు కావడం మమ్మల్ని సిగ్గుపడేలా చేస్తోంది. ఇక అతను ఇక్కడ వుండటానికి ఎంతమాత్రం అనర్హుడు. అందుకే మీకు ఈ లేఖ రాస్తున్నాం. సాధ్యమైనంత త్వరగా అతన్ని ఓ ఇరవై, పాతికేళ్ళపాటు లోపల వేసే విధంగా చర్యలు తీసుకోండి. ప్లీజ్... అతను బయటే వుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇక బాగుపడినట్టే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ఆ ఒక్కడు చాలు. అందుకే నాలుగు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండాలంటే ఆ ఒక్కడు లోపల వుండాలి. అది మీ చేతుల్లోనే వుంది. అంచేత సీబీఐ అధికారులూ... కాస్త ఆయన సంగతి త్వరగా తేల్చండి.. మా తెలుగు ప్రజలందరూ మీకు రుణపడి వుంటారు.