మాట నెగ్గించుకున్న జగన్... 3 రాజధానుల బిల్లు ఆమోదం...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాననుకున్న మాటే నెగ్గించుకున్నారు. నెల రోజులకు పైగా అమరావతి రైతులు ఆందోళనలు చేస్తున్నా, విపక్షాలు వద్దంటున్నా వినిపించుకోకుండా... మూడు రాజధానుల బిల్లును ఏపీ శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించుకున్నారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్... అమరావతిలో శాసన రాజధాని... కర్నూలులో జ్యుడీషియల్ కేపిటల్... ఏర్పాటు చేస్తూ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి-పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం తెలిపింది. మూడు రాజధానుల ఏర్పాటుపై అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశపర్చిన జగన్ ప్రభుత్వం... శాసనసభలో సుదీర్ఘంగా చర్చించింది. రాత్రి 11గంటల వరవకు శాసనసభను నిర్వహించిన ప్రభుత్వం.... సుదీర్ఘ చర్చల తర్వాత ఏపీ అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ, అలాగే సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లులకు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో సహా అధికార పార్టీ సభ్యుల హర్షధ్వానాల మధ్య ఈ బిల్లులు ఆమోదం పొందాయి. స్పీకర్‌ తమ్మినేని సీతారాం కూడా చారిత్రాత్మక బిల్లులంటూ కొనియాడారు. రాష్ట్ర చరిత్రలో చారిత్రాత్మకమైన బిల్లును ప్రవేశపెట్టి సభకు పరిచయం చేసే అవకాశం దక్కడం తన అదృష్టమన్నారు.