ఇవండీ అసలు సిసలు ‘నవరత్నాలు’!

పదవి ఊడబోతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నవరత్నాల పేరుతో ఏవేవో పథకాలు అనౌన్స్ చేసి 2019లో జనాన్ని మాయలో పడేశారు. ఈ ఐదేళ్ళ పరిపాలనలో ఆయన చెప్పిన నవరత్నాల అమలు ఎలా వున్నా, ఆయన అమలు చేసిన అసలు సిసలు నవరత్నాలు వేరే వున్నాయి. అవేమిటో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకాశం జిల్లా దర్శిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో తెలియజేశారు.

1. ఇసుక మాఫియా: గతంలో తక్కువ ధరకు, కొన్ని సందర్భాల్లో ఉచితంగా కూడా లభించే ఇసుకను బంగారం చేసేశారు. ఇసుక చుట్టూ రాష్ట్రవ్యాప్తంగా మాఫియాని క్రియేట్ చేశారు. సామాన్యులు ఇసుక కొనుక్కోలేని పరిస్థితి తెచ్చారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో కొంతమంది రైతులకు ఇసుక భూములు వుంటాయి. వారి భూమిలోని ఇసుక వారి సొంత ఇంటి నిర్మాణానికి కూడా వాడుకోలేని పరిస్థితి తెచ్చారు. ఇష్టారాజ్యంగా ఇసుకను అమ్ముకున్నారు. అదేమిటని ప్రశ్నించిన వారిని అడ్డు తొలగించుకుని, ఆ ఇసుకలోనే పూడ్చేశారు.

2. జే బ్రాండ్ మద్యం: జగన్ ప్రభుత్వం పంపిణీ చేసిన దాన్ని ఆల్కహాల్ అనడం కంటే హాలాహలం అనడం బెటర్. దేశమంతటా అమ్మే బ్రాండ్స్.ని పక్కన పెట్టి తన సొంత మనుషులు క్రియేట్ చేసిన వింత బ్రాండ్స్.ని జనం గొంతులో పోశారు. మద్యం రేట్లను మూడింతలు పెంచేశారు. రేటు పెంచితే పెంచారు.. నాణ్యమైన మద్యం అయినా అమ్మారా? కాలకూట విషాన్ని అమ్మారు. జే బ్రాండ్ మద్యం పేరుకే మద్యం అని.. అందులో ప్రాణాలు తీసే కెమికల్స్ తప్ప ఆల్కహాల్ లేదని లాబ్ రిపోర్టు కూడా ప్రూవ్ చేశాయి. సంపూర్ణ మద్యనిషేధం చేస్తామని అధికారంలోకి వచ్చి, కల్తీ మద్యం ద్వారా లక్షల కోట్లు దండుకున్నారు.

3. భూ మాఫియా: ఏదైనా స్థలం మీద వైసీపీ నాయకుల కన్ను పడిందంటే సొంతం చేసుకోవడం ఖాయమంతే. మొదట ఏ వివాదమూ లేని స్థలాన్ని వివాదంలోకి లాగుతారు. ఆ తర్వాత రాయలసీమ బ్యాచ్‌ని రంగంలోకి దించుతారు. వీళ్ళు చెప్పిన ధరకు ఇచ్చేసి అసలు ఓనర్ బతుకుజీవుడా అని పారిపోయేలా చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు లెక్కపెట్టడానికి వీల్లేనని చేశారు.

4. మైనింగ్ మాఫియా: వైసీపీ నాయకుల మైన్స్.లో మాత్రమే ఏమాత్రం ఇబ్బంది లేకుండా తవ్వకాలు జరుగుతాయి. వైసీపీ నాయకుల డిమాండ్స్ తీర్చని, ప్రతిపక్ష నాయకులకు చెందిన మైనింగ్ యజమానులను ముప్పుతిప్పలు పెట్టి వాళ్ళ మైన్స్ మూసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఇక సొంత మైనింగ్ అయితే అనుమతి తీసుకునేది గోరంత... తవ్వుకునేది కొండంత.. అడ్డు చెబితే ఏమవుతుందో తెలుసు కదా..

5. హత్యా రాజకీయాలు: జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఐదేళ్ళలో ఎన్నో వందల మంది తెలుగుదేశం కార్యకర్తలను వైసీపీ నాయకులు పొట్టన పెట్టుకున్నారు. 

6. ప్రజల ఆస్తుల కబ్జా: రాష్ట్రంలో ఎక్కడ చూసినా వైసీపీ నాయకుల అరాచకాలే. ప్రజల ఆస్తులను కబ్జా చేసిన ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా కోకొల్లలు.

7. ఎర్రచందనం, గంజాయి: మూడు రాజధానుల సంగతేమోగానీ, ఆంధ్రప్రదేశ్‌ని గంజాయి రాజధానిని చేసిన ఘనత జగన్‌కే దక్కుతుంది. చాలామంది వైసీపీ నాయకులు గంజాయి వ్యాపారులుగా మారారు. ఇక ఎర్రచందనం  విషయానికి వస్తే, గతంలో ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసేవారు.. ఇప్పుడు అలాంటి అరెస్టులేవీ లేవు.. అంటే ఎర్రచందనం స్మగ్లింగ్ ఆగిపోయిందని కాదు.. ఎర్రచందనం స్మగ్లర్లు అస్మదీయులు కాబట్టి..

8. దాడులు, అక్రమకేసులు: తమ మాట వినకపోతే దాడులు.. తమను వ్యతిరేకిస్తే అక్రమ కేసులు.. అనధికారికంగా, అధికారికంగా ప్రజల మీద ఉక్కుపాదం మోపారు. చివరికి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు మీద కూడా అక్రమ కేసు పెట్టి జైలుకు పంపించారు. 

9. శవ రాజకీయాలు: జగన్ పరిపాలనలో ఎన్ని హత్యలు జరిగాయో చెప్పడానికి నోట మాట కూడా రాదు.. హత్యలు చేసి శవాలను డోర్ డెలివరీ చేయడంలో వైసీపీ నాయకులు స్పెషలిస్టులుగా మారారు. ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా దాన్ని ప్రతిపక్షం అకౌంట్లో వేసి శవాల మీద మరమరాలు ఏరుకునే పని జగన్ ఆశీస్సులతో వైసీపీ నాయకులు చేశారు.