17 మంది హత్య... 700 ఏళ్ళ జైలు శిక్ష!

అమెరికాలో నర్సుగా పనిచేసిన 41 ఏళ్ళ హీథర్ ప్రెస్డీ అనే మహిళకు కోర్టు 7 వందల సంవత్సరాల జైలు శిక్ష విధించింది. తాను పనిచేసే ఆస్పత్రిలోని రోగులకు ఎక్కువ మోతాదులో ఇన్సులిన్ ఇచ్చి 17 మందిని హత్య చేసినందుకు ప్రెస్డీకి కోర్టు ఈ శిక్ష విధించింది. 2020-2023 మధ్యకాలంలో అమెరికాలోని పెన్సిల్వేనియా ప్రాంతంలో ఈ నర్సు వివిధ ఆస్పత్రుల్లో పనిచేసింది. ఈ సమయంలో తాను పనిచేసే ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చే పేషెంట్లకు ఈమె ఎక్కువ మొత్తంలో ఇన్సులిన్ ఇంజక్ట్ చేసేది. ఈమె అలా మొత్తం 22 మందికి చేసింది. దాని వల్ల 17 మంది మరణించారు. ఇన్సులిన్ ఎక్కువగా ఇవ్వడం వల్ల హైపోగ్లైసీమియాకి దారి తీస్తుంది. దానివల్ల గుండె కొట్టుకోవడం పెరుగుతుంది. గుండె పోటు వస్తుంది. ఈ హత్యలు చేసినట్టు నిందితురాలు ఒప్పుకుంది. ఎక్కువ ఇన్సులిన్ ఇచ్చి ఇద్దరిని హత్య చేసినట్టుగా ఈమె మీద గతంలో కేసు నమోదైంది. అయితే పోలీసుల విచారణలో ఈమె చంపింది ఇద్దర్ని కాదు పదిహేడు మందిని అని తేలింది. ప్రెస్డీ రోగులతో, వారి బంధువులతో చాలా దురుసుగా ప్రవర్తించేదని, ఆమె తన తల్లికి ఫోన్లో మెసేజ్‌లు పెడుతూ, తన చుట్టూ వున్న పేషెంట్లు తనకు ఎంతమాత్రం నచ్చడం లేదని, వాళ్ళందర్నీ చంపేయాలని అనిపిస్తోందని పేర్కొనేదని పోలీసులు తెలిపారు. ఆమె మానసికంగా బాగానే వుందని, ఉద్దేశపూర్వకంగా ఈ హత్యాకాండ చేసిందని పోలీసులు వెల్లడించారు.