చేతులెత్తి వేడుకుంటున్నా... అమరావతిని మార్చొద్దు....

మూడు రాజధానుల బిల్లును టీడీపీ అధినేత, అపోజిషన్ లీడర్ చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించారు. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ సీఎం జగన్ కు చేతులెత్తి వేడుకున్నారు. ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాజధానిని మార్చుకుంటూ వెళితే రాష్ట్రానికి మంచిది కాదని సూచించారు. అయితే, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుపై సీఎం జగన్ మాట్లాడుతుండగా ప్రసంగానికి ఆటంకం కలిగించిన టీడీపీ సభ్యులపై స్పీకర్ సస్పెన్షన్ వేటేశారు. దాంతో, చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేలంతా నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదొక చీకటి రోజంటూ మండిపడ్డారు.

అయితే, అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో గాయపడ్డ అమరావతి రైతులను పరామర్శించేందుకు ప్రయత్నించిన టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైతులకు సంఘీభావంగా పాదయాత్రగా వెళ్తున్న చంద్రబాబును అదుపులోకి తీసుకుని పీఎస్ కి తరలించారు. దాంతో, అర్ధరాత్రి కూడా అమరావతి గ్రామాల్లో అలజడి కొనసాగింది.

అమరావతి పోరాటం ఇంతటితో ఆగదని చంద్రబాబు అన్నారు. ఏపీని కాపాడుకోవడం కోసం సేవ్ ఆంధ్రప్రదేశ్-సేవ్ అమరావతి ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. టీడీపీ నేతలు, అమరావతి రైతులపై పోలీసుల దౌర్జన్యంపై తీవ్రస్థాయిలో మండిపడ్డ చంద్రబాబు... అక్రమ కేసులతో హింసిస్తున్నారని ఆరోపించారు.