ప్రపంచ వింత: పూజారుల ఆశీస్సులు తీసుకున్న అసద్!

ఇది ప్రపంచ వింతల్లో ఎన్నో నంబర్ అవుతుందో తెలియదుగానీ, ఇది నిజంగానే ప్రపంచ వింతే! మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ, ప్రస్తుత ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హిందూ పూజారుల ఆశీస్సులు తీసుకున్నారు. పూజారి చేత మెడలో దండ వేయించుకున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని మూసారాంబాగ్‌లో శనివారం నాడు అసదుద్దీన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అక్కడే వున్న ఒక హనుమాన్ గుడి దగ్గరకి వెళ్ళిన మజ్లిస్ కార్యకర్తలు తమ నాయకుడిని ఆశీర్వదించాలని అక్కడే వున్న పూజారిని కోరారు. పూజారి అసదుద్దీన్‌ని ఆశీర్వదించి, మెడలో దండ వేసి, శాలువా కప్పారు. సాధారణంగా హిందూ నాయకులు చర్చికి వెళ్తారు, మసీదులకు, దర్గాలకు టోపీ పెట్టుకుంటారు. కానీ ముస్లిం నాయకులు హిందూ సంప్రదాయాలను కొద్దిసేపైనా పాటించింది చాలా తక్కువ. అది కూడా కరడుగట్టిన ముస్లిం నాయకుడు అసదుద్దీన్ హనుమాన్ గుడి పూజారి చేత ఆశీస్సులు తీసుకోవడం నిజంగా వెరైటీనే. 

అసదుద్దీన్ ఇటీవల వేరే ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయనతో పాటు ముగ్గురు పూజారులు కూడా పాల్గొన్నారట. ఈసారి ఎన్నికలలో బీజేపీ తరఫున మాధవీలత హెదరాబాద్ పార్లమెంట్ బరిలో నిలిచారు. హిందూ ఓట్లు ఆమెకే పడతాయి. ముస్లిం మహిళల ఓట్లను కూడా ఆకర్షించే విధంగా ఆమె ప్రచారం చేస్తున్నారు. గతంలో ఏనాడూ ఇప్పుడున్న స్థాయిలో అసదుద్దీన్ ప్రచారం చేసిన దాఖలాలు లేవని, మాధవీలతకు భయపడే ప్రచారం జోరు పెంచారని, హిందూ పూజారుల చేత ఆశీస్సులు తీసుకుంటున్నారని బీజేపీ నాయకులు కామెంట్ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం తిప్పల్లో భాగంగా అసదుద్దీన్ తాను ప్రచారం చేస్తున్న సమయంలో తెలుగు పాటలను కూడా వినిపిస్తున్నారు. హిందూ ఓటర్లను ఆకట్టుకోవడానికి అసద్ చేస్తున్న మరో ప్రయత్నమిదని పరిశీలకులు అంటున్నారు.