అనంత‌లో జేసీ ముస‌లం.. టీడీపీలో ర‌చ్చ రంభోలా..

జేసీ ఫ్యామిలీ. అనంత‌లో బ‌ల‌మైన రాజ‌కీయ కుటుంబం. జేసీ బ్ర‌ద‌ర్స్ ఏ పార్టీలో ఉన్నా వారిదే హ‌వా. అయితే, మిగ‌తా నాయ‌కుల‌ను క‌లుపుకొని పోర‌నే విమ‌ర్శ వారిపై ఉంది. త‌మ సొంతంగా రాజకీయం చేస్తార‌ని.. పార్టీని పెద్ద‌గా ప‌ట్టించుకోరంటారు. ప్ర‌త్య‌ర్థి పార్టీ నేత‌ల‌ను ఎదుర్కొంటూనే.. సొంత పార్టీతోనూ స‌ఖ్య‌తగా ఉండ‌క‌పోవ‌డం వారి నైజం. ఏకంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబుపైనే సెటైర్లు వేసేంత చొర‌వ జేసీ దివాక‌ర్‌రెడ్డిది. ఇక ఆయ‌న త‌మ్ముడు జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి జిల్లా పాలిటిక్స్‌లో త‌న‌దైన స్టైల్‌లో దూసుకుపోతుంటారు. ఇటీవ‌ల జ‌రిగిన మున్సిప‌ల్ ఎల‌క్ష‌న్ల‌లో ఏపీవ్యాప్తంగా ఫ్యాను గాలి వీచినా.. తాడిప‌త్రి గ‌డ్డ‌పై మాత్రం టీడీపీ జెండా ఎగ‌రేసిన స‌త్తా ఆయ‌న‌ది. అలాంటి స్ట్రాంగ్ లీడ‌ర్ జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి.. ఇటీవ‌ల సొంత‌పార్టీ నేత‌లే టార్గెట్‌గా విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆ సౌండ్‌కు ఇప్పుడు అదే స్థాయిలో రీసౌండ్ వ‌స్తోంది. అనంత టీడీపీ నేత‌లు వ‌రుస‌బెట్టి జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి వ్యాఖ్య‌ల‌పై విరుచుకుప‌డుతున్నారు. అనంత‌ టీడీపీలో ముదురుతున్న ఈ ముస‌లం ఎక్క‌డికి దారి తీస్తుందోన‌నే టెన్ష‌న్ పార్టీ వ‌ర్గాల‌ను వేధిస్తోంది. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే....

‘టీడీపీకి చెందిన ఏ ఒక్క నాయకుడూ కార్యకర్తలను పట్టించుకోవడం లేదు. చంద్రబాబుగారూ ఇకనైనా మేల్కోండి’’ అని జేసీ ప్రభాకర్‌‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు టీడీపీలో కలకలం రేపాయి. రాయలసీమ ప్రాజెక్టుల భవిష్యత్తుపై అనంతపురంలో మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు అధ్యక్షతన సీమ టీడీపీ ముఖ్య నేతల సదస్సు జరిగింది. ఈ సదస్సులో జేసీ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘కార్యకర్తలకు అన్యాయం జరుగుతోంది. వారిని లోపలేస్తుంటే ఎవరు అండగా నిలబడ్డారో చెప్పాలి. ఆ ఇద్దరు నేతల కనుసన్నల్లోనే వ్యవహారం నడుస్తోంది. వారితోనే పార్టీకి నష్టం వాటిల్లుతోంది’’ అంటూ కాల్వ శ్రీనివాసులు, ప‌ల్లె ర‌ఘునాథ్‌రెడ్డి టార్గెట్‌గా కాంట్ర‌వ‌ర్సీ స్టేట్‌మెంట్స్ చేశారు జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి. ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై టీడీపీ నేత‌లు సైతం అదే రేంజ్‌లో కౌంట‌ర్ ఇవ్వ‌డంతో పొలిటిక‌ల్ హీట్ పెరిగింది. 

తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి తన పట్ల తీవ్రమైన వ్యక్తిగత ఆరోపణలు చేశారని మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన డ్రెస్సింగ్ గురించి హేళనగా మాట్లాడారని మండిపడ్డారు. ‘‘మాకు కార్యకర్తలే ధైవం.. తాడిపత్రిలో కూర్చుని అదే రాజ్యం అనుకుంటున్నావ్? 2015 ముందు వరకు ఎంత మంది టీడీపీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయాయి. అప్పుడు కార్యకర్తలు గుర్తుకు రాలేదా? ఒకసారి జగన్మోహన్ రెడ్డి మరోసారి రాజశేఖర్ రెడ్డిని పొగుడుతావ్. టీడీపీ కార్యకర్తలను ఇది అవమానించడం కాదా? నోటి దురద..లూజ్ టంగ్ వున్న వాళ్లు రాజకీయాల్లో బాగు పడిన దాఖలాలు లేవు. కాల్వ శ్రీనివాసులు మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. మీరు పార్టీలో ఉన్నప్పుడు కన్నా లేనప్పుడే జిల్లాలో అత్యధిక సీట్లు గెలిచాం. జడ్పీ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాం. పార్టీకి నష్టం కలిగించేలా తోటి నాయకులను హేళన చేసి మాట్లాడడం బాధాకరం. మా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఓట్లు వేస్తే జగన్మోహన్ రెడ్డి వల్ల మున్సిపల్ చైర్మన్ అయ్యానని అన్నావు.. అంటూ జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డిపై మండిప‌డ్డారు ప‌ల్లె ర‌ఘునాథ్‌రెడ్డి.  

జేసీ కుటుంబమే టీడీపీకి సమస్య అంటూ సంచ‌ల‌న కామెంట్ చేశారు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి. కాంగ్రెస్ పార్టీలో జేసీ చేసిన దౌర్జన్యాలకు వ్యతిరేకంగా జిల్లాలో పోరాటాలు చేశామని గుర్తు చేశారు. వ్యక్తిగతంగా కార్యకర్తలు లేరని చెప్పడం జేసీ అహంకారానికి నిదర్శనమన్నారు. మాజీమంత్రి కాలువ శ్రీనివాసులు వివాద రహితుడని చెప్పారు. 

పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడిన వ్యక్తి కాల్వ శ్రీనివాసులని, అలాంటి వ్యక్తిని ఉద్ధేశించి మాట్లాడటం చాలా బాధాకరమన్నారు మాజీ మంత్రి ప‌రిటాల సునీల‌. 24 గంటలు పార్టీ కోసం పని చేసే వ్యక్తి కాల్వ శ్రీనివాసులన్నారు. ఆ స‌మావేశంలో అనంతపురం జిల్లాకు జరుగుతున్న అన్యాయంపై ప్రభాకర్ రెడ్డి మాట్లాడి ఉంటే బాగుండేదని సూచించారు సునీత‌.