రోడ్లకు డబ్బుల్లేవ్.. సీఎం జగన్‌కు వైసీపీ ఎమ్మెల్యే షాక్..
posted on Sep 12, 2021 6:47PM
ఏపీలో ఎవరినడిగినా చెబుతారు. ఏ సామాన్యుడిని కదిలించినా ఏకరువు పెడతారు. రాష్ట్ర ఖజానాను సీఎం జగన్ ఊడ్చేస్తున్నారని. అప్పు చేసి మరీ పప్పు-బెల్లాలు పంచేస్తున్నారని. ఏపీకి రూపాయి పెట్టుబడి కూడా రావట్లేదు. మద్యం మినహా మరే ఆదాయమూ లేదు. అందుకే, ఏకంగా మద్యం రాబడిని ష్యూరిటీగా పెట్టి.. భారీగా అప్పు చేస్తోంది జగన్ ప్రభుత్వం. అయినా, దమ్మిడి రాక లేక.. ఉద్యోగులకు సమయానికి జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి. ఆ ఫలితమే సంక్షేమ పథకాలకు కోత పెట్టే ప్రయత్నం. ఎడాపెడా రూల్స్ పెట్టేసి.. పెన్షన్లనూ కోతేస్తోంది వైసీపీ సర్కారు. వచ్చింది.. తెచ్చింది.. అంతా నవరత్నాలకే సరిపోకపోవడంతో.. ఆ నవరత్నాలు కాస్తా నవరంధ్రాలుగా మారి.. రత్నాలు రాలిపోయే పరిస్థితి వచ్చిందంటూ వైసీపీ ఎంపీ రఘురామలాంటి వారు విమర్శిస్తున్నారు. తాజాగా, ఎంపీ బాటలోనే మరో వైసీపీ ఎమ్మెల్యే సైతం తమ ప్రభుత్వం దగ్గరున్న డబ్బులన్నీ పంచడానికే సరిపోతున్నాయంటూ సంచలన కామెంట్లు చేశారు.
ఏపీలో రోడ్ల దుస్థితి దారుణంగా ఉంది. గజానికో గుంతతో ప్రజలు నరకం చూస్తున్నారు. అధ్వాహ్నపు రోడ్లపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నాయి. సీఎం జగన్ సైతం స్వయంగా రోడ్ల దుస్థితిపై సమీక్ష నిర్వహించినా.. వాటిని బాగు చేద్దామంటే ఖజానాలో పైసా కూడా లేకపాయే. అందుకే, సమీక్షతోనే సరిపెట్టేసి.. రోడ్లు వేసే పనిని పక్కనపెట్టేసింది ప్రభుత్వం. తాజాగా, యలమంచలి నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి బాగోలేదని, రోడ్లు వేయించాలని ఓ వ్యక్తి స్వయంగా ఎమ్మెల్యేకు ఫోన్ చేశారు. అతనికి వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబురాజు ఇచ్చిన సమాధానం విని అంతా షాక్. ఆ ఫోన్ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఎమ్మెల్యే కన్నబాబు ఏమన్నారంటే....
‘‘అన్ని డబ్బులన్ని పంచడానికే సరిపోతున్నాయి. రోడ్లు వేయడానికి డబ్బుల్లేవు. అయినా అన్నీ వేయించడానికి దేవుడ్నా’’ అంటూ ఫోన్ చేసిన వ్యక్తికే ఎదురు ప్రశ్న వేశారు ఎమ్మెల్యే. స్వయంగా వైసీపీ ఎమ్మెల్యేనే డబ్బులన్నీ పంచడానికే సరిపోతున్నాయని.. రోడ్లు వేయడానికి డబ్బుల్లేవని చెప్పడం.. అయినా అన్నీ వేయించడానికి తానేమైనా దేవుడినా అంటూ ఎదురు ప్రశ్నించడంతో ఎమ్మెల్యే కన్నబాబురాజుపై సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో సెటైర్లు పడుతున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే ఈ విధంగా మాట్లాడటం.. ఏపీ ప్రభుత్వ ఆర్థిక దుస్థితికి నిదర్శనం అంటున్నారు.