టీటీడీ సామూహిక వివాహాలు క్యాన్సిల్?
posted on Aug 7, 2022 9:43AM
తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్భాటంగా ప్రచారం చేసిన సామూహిక వివాహాల కర్యక్రమం క్యాన్సిల్ అయిపోయిందా? ఆగస్టు (7) ఆదివారం పెద్ద ఎత్తున సామూహిక వివాహాలు జరిపిస్తామని ప్రకటించిన టీటీడీ ఆ విషయంపై నోరెత్తడం లేదు. పెళ్లి ఖర్చు భరించే స్తోమత లేని పేదల కోసం సామూహిక వివాహాలు జరిపిస్తామనీ, తాళి బొట్టు సహా అన్ని ఖర్చులూ తామే పెట్టుకుంటామని టీటీడీ దరఖాస్తులకు ఆహ్వానించింది.
సామూహిక వివాహాలకు ముహూర్తం సైతం ఫిక్స్ చేసింది. ఈ నెల 7(ఆదివారం)న డేట్ ఫిక్స్ చేసింది. అంతే ఆ తరువాత మౌనం వహించింది. కారణాలు వెల్లడించకుండా ( ప్రభుత్వ అనుమతి రాలేదని చెప్పిందనుకోండి) చివరి నిముషంలో వాయిదా వేసింది. అసలు ఈ వివాహాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఎలాంటి ఏర్పాట్లూ చేయలేదు.
శ్రావణ మాసంలో కలియుగ దైవం వేంకటేశ్వరుడి సన్నిధిలో వివాహం అన్న ఆనందంలో ఉన్న వేల జంటలకు టీటీడీ తన నిర్వాకంతో నిరాశను మిగిల్చింది. టీటీడీ అలా ప్రకటించకుండా ఉండి ఉంటే శ్రావణ మాసంలో ఏదో విధంగా తాము వివాహాలు చేసుకునే వారమనీ, అయితే టీటీడీ తమ వివాహాలు చేస్తుందన్న నమ్మకంతో తాము సొంతంగా పెళ్లి ఏర్పాట్లు చేసుకోలేదని ఆ జంటలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
టీటీడీ నిర్వాకంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భక్తుల మనోభావాలతో ఈ ఆటలేమిటని నిలదీస్తున్నాయి. చివరి నిముషం వరకూ మౌనంగా ఉండి ఇప్పుడు వాయిదా అంటూ ప్రకటించడమేమిటని ప్రశ్నిస్తున్నాయి. సామూహిక వివాహాలకు ప్రభుత్వ అనుమతి లేకుండానే ‘కల్యాణమస్తు’ను ఎలా ప్రకటించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దైవసన్నిధిలో దేవుని సేవలో ఉన్న టీటీడీ ఇలా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.