సర్వమతాల అధ్యయన స్వరూపం పరమహంస!!

భారతీయ ఆధ్యాత్మిక గురువుల చిట్టా విప్పితే అందులో రామకృష్ణ పరమహంస తప్పక ఉంటారు. రామకృష్ణ మిషన్ ద్వారానూ, ఆయన ఆధ్యాత్మిక భోధనల ద్వారానూ ఆదిశంకరాచార్యుల తరువాత ఆధ్యాత్మికతను, హిందూ మతంలో ఉన్న విశిష్టతను ముస్లిం మరియు క్రైస్తవ మతాలకు ధీటుగా నిలబెట్టిన వారు రామకృష్ణ పరమహంసనే.


బాల్యంలో…..


1836 ఫిబ్రవరి 18 న పశ్చిమబెంగాల్ లోని హుగ్లీ జిల్లాలోని కామార్పుకూర్ అనే చిన్న గ్రామంలో జన్మించారు ఈయన. ఈయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు గదాధరుడు. పేదబ్రాహ్మణ కుటుంబానికి చెందిన వీళ్ళు ఎంతో విశాలమైన హృదయం కలిగినవాళ్ళు. 


ఈయనలో  సృజనాత్మకత ఎక్కువ. చదువు మీద ఆసక్తి తక్కువ. అందుకే పెద్దగా చదువుకోలేదు. ఎంతోమంది సాధువులు వీళ్ళ గ్రామం మీదుగా పూరీ జగన్నాథుడి దర్శనానికి వెళ్ళేవాళ్ళు. అలా వెల్తూ వీళ్ళ గ్రామంలో ఆగినప్పుడు ఆ గ్రామంలో ప్రజలకు హిందూ మతం గురించి, హిందూ దేవుళ్ళ గురించి ఎంతో గొప్పగా ప్రవచనాలు చెప్పేవాళ్ళు. వాటిని ఎంతో ఆసక్తిగా వినేవారు. అలా ఈయనకు భారతీయ ఆధ్యాత్మికత మీద ఒకానొక ఆసక్తి ఏర్పడింది.


వృత్తిలో అన్వేషణ!!


రామకృష్ణుల వారి అన్న ఒక అమ్మవారి గుడిలో పనిచేసేవారు. ఆయన చనిపోయిన తరువాత కుటుంబం కగడవడం కోసం రామకృష్ణులు ఆ గుడిలో పూజరిగా చేరారు. అమ్మవారి విగ్రహంతో మాట్లాడేవారు. అమ్మవారు తనతో మాట్లాడాలని ఎంతో అడిగేవారు. అడవిలోకి వెళ్లి ఒంటరిగా కూర్చుని ప్రశ్నలు వేసుకునేవారు. ఎప్పుడూ అమ్మవారి ఆలోచనల్లో మునిగిపోయి ఉండేవారు. ఫలితంగా ఒకసారి అమ్మవారి ప్రత్యక్ష దర్శనం పొందారు. అప్పటి నుండి తరచుగా అమ్మవారితో మాట్లాడుతూ ఉండేవారు ఈయన. 


అంతేకాదు మిగిలిన మతాలు ఎందుకున్నాయి?? వాటి ప్రత్యేకత ఏమిటి అని విషయం తెలుసుకోవడానికి ముస్లిం మరియు క్రైస్తవ మతాలను అందులో నియమాలను కూడా స్వయంగా ఆచరించి ఆ మతాలను కూడా అధ్యయనం చేసాడు రామకృష్ణులు. ఆ అన్వేషణ ఫలితంగా ఆయన చెప్పింది ఒక్కటే.


మతం అనేది ఆ దేవుడిని తెలుసుకోవడానికి చేరుకోవడానికి మార్గం మాత్రమే అని. అది మనుషుల మధ్య హింసాత్మక విభేదాలు సృష్టించడానికి కాదని నొక్కి వక్కాణించారు.


వివాహం ఆధ్యాత్మిక బంధం!!


ఈయన పెళ్లి చేసుకున్నప్పుడు శారదాదేవి గారి వయసు కేవలం అయిదు సంవత్సరాలు మాత్రమే. కానీ రామకృష్ణుల వారు తనకు తెలిసిన ఆధ్యాత్మిక విషయాలను అన్నిటినీ ఆమెకు నేర్పించారు. నిజానికి ఆయన మొదటి శిష్యురాలు కూడా ఆయన భార్యే. శారదాదేవి గారు ఎంతో బాగా సులువుగా అర్థం చేసుకునేవారు. అందుకని ఆమెను త్రిపురసుందరీ దేవి ప్రతిరూపంగా భావించి ఆమెను ఎంతో భక్తిగా పూజించేవాడు. ఇలా వాళ్ళిద్దరిమధ్య ఆధ్యాత్మిక బంధమే కొనసాగింది.


గురుశిష్యుల ప్రయాణం!!


రామకృష్ణుల వారి శిష్యులలో ప్రసిద్ధి చెందినవాడు స్వామి వివేకానంద. ఈయన ఎందరో గురువులను ఆశ్రయించి విఫలమై చివరికి  రామకృష్ణులను చేరి సార్థకత పొందాడు. రామకృష్ణుల ఉపన్యాసాలను విదేశాలకు వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా యువతను ఆకర్షించాడు. విదేశాలలో హిందూధర్మం గురించి దైర్యంగానూ గొప్పగానూ చాటి చెప్పాడు.


రామకృష్ణుల వారి శిష్యులు అందరూ కూడా ఎంతో ఉన్నత విద్యావంతులు. వీళ్ళు ఎవరూ దేన్నీ ఆధారం లేకుండా కారణం లేకుండా సమ్మతించేవారు కాదు. ఆ విధంగా రామకృష్ణులు చెపినా విషయాలు ఎంతో వాస్తవికతను నిండుకుని ఉన్నవే  అయ్యాయి.


అంతిమ దశ!!


ఎందరో గురువులను చూస్తే ఆఖరి దశలో తమ శరీరాన్ని ఏదో మొండి రోగానికి అర్పించి మరణించిన ఆనవాళ్లు కనబడతాయి. రామకృష్ణుల విషయంలోనూ అదే జరిగింది. ఈయన కాన్సర్ బారిన పడి, ఆరోగ్యపరంగా ఎంతో నలిగినా మానసికంగా ఎంతో దృఢచిత్తంతో ఉండేవారు. తనలో ఉన్న ఆధ్యాత్మిక సంపదను మొత్తం స్వామి వివేకానందకు ధారపోసి 1886 ఆగష్టు 16 వ తేదీన మహాసమాధిని పొందాడు.


ఈయన హిందూసంప్రదయంలో పేరుకుపోయిన మూఢనమ్మకాలు తొలగించడంలో కృషి చేసారు. ఈయనవల్లనే అరభిందో ప్రభావితం అయ్యారు. అలాగే భక్తి ఉద్యమం కూడా ప్రభావితమయ్యింది.


సృష్టిలో ఏకత్వాన్ని, జీవులలో దైవత్వాన్ని, అన్ని మతాలలో ఉన్న మార్గ ముఖ్య ఉద్దేశం దేవుడిని తెలుసుకోవడం చేరడం, మతాలు ఆ మార్గాలు మాత్రమే అనేది ఈయన చెప్పిన గొప్ప సత్యం.

Related Segment News