మీ చూపుకు ఒక పరీక్ష!!

చూపుకు ఏముంది అక్షరాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి, పనులన్నీ చక్కగా చేసుకుంటున్నాం, అయినా చూపుకు పరీక్ష ఏమిటి డాక్టర్ దగ్గరకు పోతే సరిపోతుంది కదా దానికోసం. టైం వేస్ట్ పనులు కాకపోతే!! బహుశా చాలామందికి ఇలా అనిపించి  ఉంటుంది.  కానీ కాసింత ఇందులోని అంతరార్థం ఏమిటో అనే ఆలోచన చాలా తక్కువ మందికే వచ్చి ఉంటుంది.  ఇక విషయానికి వస్తే చూపు అంటే కంటి చూపు కాదండి, ఏదైనా ఒక విషయాన్ని చూసే విధానం అని, అంటే పాజిటివ్, నెగిటివ్ కోణాలు అని సింపుల్ గా చెప్పవచ్చు. ఏదైనా చేయాలని అనుకున్నప్పుడు, ఏదైనా ఎవరైనా చెప్పినప్పుడు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నాం అని అర్థం. కొందరు ఏదైనా చెబితే వెంటనే దాన్ని చాలా తేలికగా తీసుకుంటాం. కొన్నిరోజుల తరువాత  అదే విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాగే ఇలాటి ఆలోచనలతోనే  అపార్థాలు, మనస్పర్థలు ఏర్పడుతుంటాయి. మనుషుల మధ్య బంధాలు చాలా సులువుగా తెగిపోతుంటాయి.

ఇక ఈ పాజిటివ్, నెగిటివ్ కోణాలకు సంబంధించి ఒక చిన్న కథ:

ఒకసారి భీష్ముడు దుర్యోధనుడిని పిలిచి మంచివాళ్లను వెతికి తీసుకునిరా అని చెప్పి పంపించాడు. అలాగే అంటూ ధుర్యోధనుడు మంచి వాళ్లను వెతకడానికి వెళ్ళాడు. ఆ తరువాత భీష్ముడు ధర్మరాజును పిలిచి, కొంతమంది చెడ్డవాళ్లను తీసుకునిరా అని చెప్పాడు. సరేనంటూ ధర్మరాజు కూడా చెడ్డ వాళ్ళను వెతుక్కుంటూ వెళ్ళాడు. సమయం గడిచింది, సాయంత్రం అయిపోయింది. మొదట వెళ్లిన ధుర్యోధనుడు ఒంటరిగా, బాగా అలసిపోయి భీష్ముడి దగ్గరకు వెళ్ళాడు. "ఎక్కడున్నారు నువ్వు తీసుకొచ్చిన మంచివాళ్ళు??" అని అడిగాడు భీష్ముడు, దుర్యోధనుడితో. "రాజ్యం అంతా వెతికాను కానీ ఒక్కడు కూడా మంచి వాడు కనబడలేదు, అందరూ చెడ్డవాళ్లే ఉన్నారు" అని బదులిచ్చాడు ధుర్యోధనుడు. 

ఆ తరువాత కొద్దిసేపటికే ధర్మరాజు కూడా ఒంటరిగానే వచ్చాడు. "నువ్వు తీసుకొచ్చిన చెడ్డవాళ్ళు ఎక్కడ?? కనిపించడం లేదు ఏమిటి??" అని అడిగాడు. ధర్మరాజు కూడా ధుర్యోధనుడు చెప్పినట్టు "రాజ్యం అంతా వెతికాను కానీ ఎక్కడా చెడ్డవాళ్ళు కనిపించలేదు. అందరూ మంచివాళ్లే ఉన్నారు" అని చెప్పాడు. దీనిని బట్టి తెలిసేది ఏమిటంటే చెడు ఆలోచనలు కలిగి ఉన్న దుర్యోధనుడికి అందరూ చెడ్డవాళ్లే కనిపించారు. అందరిలోనూ చెడు గుణాలే కనిపించాయి. ఆయన అందరినీ చూసే విధానం, ఆయన దృష్టి కోణం అలాగే ఉంది. ఇక ధర్మరాజు ఎప్పుడూ నలుగురి మంచి కోరేవాడు, నలుగురి సహాయం చేసేవాడు కాబట్టి ఆయనకు ఇతరుల్లో చెడు కంటే మంచే కనిపించింది. అందుకే ఆయనకు అందరూ మంచివాళ్లుగానే కనిపించారు.  

కాబట్టి ఏదైనా సరే మనం చేసే చూపును బట్టే అందులో మనకు మంచి, చెడులు కనబడతాయి. అలాగని చెడును కూడా మంచిగా అనుకోమని కాదు ఈ మాటల ఉద్దేశ్యం. ఈ జీవితం మనది, మన జీవిత నిర్ణయాలు మనవి, అన్ని మన చేతుల్లోనే ఉన్నపుడు ఇతరులతో మనం కేవలం మంచిని చూసి చెడును వారికే వదిలేస్తే మనకు ప్రశాంతత, అనవసర విషయాల కోసం సమయం వృథా కాదు ఇంకా బోలెడు మంచి కూడా మనకే. కాబట్టి మీ చూపు ఇప్పుడు ఎట్లా ఉందొ ఒకసారి మీరే ఆలోచించుకోండి.

◆ వెంకటేష్ పువ్వాడ