అంతర్యుద్ధం చేస్తున్నారా?? 

ప్రతి మనిషికి జీవితంలో సమస్యలు సాధారణం. ఆ సమస్యల వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతూ వుంటారు. వాటిని అధిగమించేందుకు యుద్ధం చేస్తూ ఉంటారు కూడా. ఇదంతా సాధారణమే. అయితే ఇది కాకుండా అందరూ చేసే ఒకానొక నిశ్శబ్ద యుద్ధముంది. తమలో తాము, మానసికంగా చేసే యుద్ధమది. బయటకు కనిపించని, మనిషిని అంతర్లీనంగా క్రుంగదీసి, ఒత్తిడిలోకి నెట్టి జీవితాన్ని కూడా ప్రశ్నార్థకం చేయగల పెనుభూతమే సంఘర్షణ. దీన్నే మానసిక ఒత్తిడి, ఇంకా ఇప్పటి అందరికి అర్థమయ్యేట్టు చెప్పాలంటే డిప్రెషన్ అని కూడా అంటారు.  తమలో తాము సమస్యల పట్ల సమస్యల తాలూకూ ప్రభావానికి తలోంచి, వైఫల్యాలను, తలచుకుంటూ, జీవిత చట్రంలో బోల్తా పడి ఇక ఏమి మిగల్లేదనుకుని ఆఖరి క్షణాలను తమకు తామే ఆహ్వానిస్తుంటారు.  

ఎందుకు ఈ అంతర్యుద్ధం??

ఇలా తమలో తాము ఏదో విషయానికి సంఘర్షణ పడే ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది ఒకటే. ఎందుకు సంఘర్షణ పడుతున్నాం అని. జీవితం అన్నాక వైఫల్యాలు కూడా ఉంటాయి. కానీ ఇలాంటి వాళ్లకు మాత్రం కేవలం ఆ వైఫల్యాలు మాత్రమే కనబడుతుంటాయి. ఇంకా చెప్పాలంటే నడిచొచ్చిన ఎన్నో అద్భుతమైన అడుగులన్ని కూడా వారి మెదడు మీద చెరిగిపోయి కేవలం ఎక్కడో పడిన చిన్నపాటి గాయాలే ఇంతింత పెద్ద ఆకారంలో కనిపిస్తూ జీవితమంతా అదే ఉన్నట్టు బుర్రను తొలిచేస్తాయి. అందుకే ఈ అంతర్యుద్ధం జరుగుతూ ఉంటుంది.

బయటపడటం ఎలా??

ఇంట్లో నుండి తలుపులు తీసుకుని బయటకు వెళ్లిపోయినంత సులువు కాదు ఈ అంతర్యుద్ధం నుండి బయట పడటం. కేవలం సాధ్యాసాధ్యాలు, జరిగిన విషయాలను వదిలి జరగబోయే విషయాల మీద దృష్టి సారించడం, తప్పొప్పుల విచక్షణ, ముఖ్యంగా స్పోర్టివ్నెస్, అన్నిటికి మించి భయాలు, నిరాశ, పిరికితనం వదిలిపెట్టడం ఎంతో అవసరం. ఇవన్నీ వదిలేసి చూస్తే సమస్యలు ఏమి పెద్ద భూతాల్లా కనిపించవు. సంఘర్షణలు అన్ని కూడా మేఘాల్లా అలా తేలిపోతూ ఉఫ్.. అని ఊదగానే దూదిలాగా చెల్లాచెదురైపోతాయి

అందరికీ కావాలోక ఆశావహదృక్పథం!!

నిజమే కదా మనిషిని బతికించేది ఆశ. నిన్న ఏదో జరిగింది. అది అలా అయిపోయింది దానికి ఏమి చేయగలం?? గతం గతః. ఇక ఈరోజు చేతిలో ఉంది, రన్నింగ్ రేస్ లో ఉంది. దాన్ని సమర్థవంతంగా మన శక్తి కొలది ఉత్తమంగా మలచుకోవడం, దాన్ని అంతే హుందాగా తీర్చిద్దుకోవడం అందరి చేతుల్లోనూ ఉంది. అలాంటప్పుడు ఈ అంతర్యుద్ధాలు ఎందుకంటా??

మీతో మీరు… మీకోసం మీరు.

చాలామంది తాము చేసే తప్పుల కంటే, తమ వైఫల్యాల కంటే ఇతరుల వల్ల  బాధపడటమే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇతరులు తమను అవాయిడ్ చేస్తున్నారనో లేక ఏదో అన్నారనో అదీ కాకుండా తమ జీవిత విషయాలను ఇతరులు నిర్ణయించేస్తున్నారనో, తమ నిర్ణయాలు తమకు ఇవ్వకుండా తమ జీవితాన్ని తమది కాకుండా చేస్తున్నారనో ఇలా బోలెడు కారణాలు ఉంటాయి. వీటన్నిటికీ పరిష్కారం ఏమిటని ఆలోచిస్తే సింపుల్ గా మీతో మీరు ఉండాలి, మీకోసం మీరు ఉండాలి. ఇతరుల చేతుల్లో పెట్టడానికి ఇదేమి ఆట కాదు, అంతకు మించి ఏదో భాగం ఇచ్చే ఆస్తి కూడా కాదు కదా!! అందుకే మీ నిర్ణయం మీరు తీసుకోవడానికి ఎప్పుడూ ముందుండాలి. దానికి ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి.

ఎప్పుడైతే ఏమి తెలియని తనం చుట్టుముడుతుందో అప్పుడు అందరూ మీ జీవితంలో విషయాలను చేతుల్లోకి తీసేసుకుంటారు. అలా మీలో చేతకాని తనం కూడా అంతర్యుద్ధానికి దారి తీస్తుంది.  కాబట్టి మీలో అంతర్యుద్ధాన్ని ఆపాలంటే మీ జీవితాన్ని మీ చేతుల్లో ఉంచుకోవాలి. మీ నిర్ణయాలు మీరు తీసుకోవాలి. మీ తప్పొప్పులను స్పోర్టివ్ గా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. 

◆ వెంకటేష్ పువ్వాడ