దైవం మానుష్య రూపేణా!!

  దేవుడు ఎక్కడో కాదు, మనిషి రూపంలో మన చుట్టూనే ఉంటాడు అనేది దీని భావం. నిజంగానే ఎంతో గొప్ప మనసు, సహాయం చేసే గుణం, స్వార్థం లేకుండా ఉండటం, జాలి, దయ, కరుణ, మానవత్వం నిండిన వాళ్ళు అక్కడక్కడా కనబడుతూనే ఉంటారు. వీళ్ళనే మనుషుల్లో దేవుళ్ళు అని, దేవుడే మనిషి రూపంలో ఇలా వచ్చాడు అని అంటూ ఉంటారు కూడా. కానీ ఇంత సేపు ఇలా ఒకరిని అనడం, ఒకరి గురించి చెప్పుకోవడమేనా?? కలికాలం. మనుషులను కూటికి, గుడ్డకు, నిలువ నీడకు ముప్పుతిప్పలు పెట్టి, వేధిస్తున్న కాలం. ఈ ప్రపంచంలో సరైన ఆహారం, కట్టుకోవడానికి బట్టలు, ఇవన్నీ ఎలాగోలా అమరినా ఉండటానికి కాసింత జాగా మాత్రం కలలాగే మిగిలిపోతుంది. ఫలితంగానే ఊరి పొలిమేరల్లో మురుగు ప్రాంతాలలో వెలిసే గుడిసెలు. ఇలాంటివన్నీ చూసి మనం ఏమి చేయగలం అనుకుంటాం.

అంతే కానీ మనం ఏమి చేయలేమా??

అని మాత్రం చాలామంది ప్రశ్నించుకోరు. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, మరెన్నో సేవా ప్రణాళికలతో నిత్యం ఏదో ఒక విధముగా ఇలాంటి వాళ్ళ కోసం పాటు పడుతూనే ఉంటాయి, ఉన్నాయి కూడా. అవాసాన్ని ఇవ్వలేకపోవచ్చు కానీ వాళ్లకు భవిష్యత్తును మాత్రం ఇవ్వగలమనే భరోసా ఆ సేవా సంస్థలలో, అందులో ఉన్న వ్యక్తులలో మెండుగా కనబడుతుంది.

ఈ ప్రపంచంలో మనిషి నిలబడాలంటే కాలవసింది చదువు. కానీ ఫీజులు, పుస్తకాల కోసం, దుస్తుల కోసం ఇట్లా ఎన్నో కారణాల వల్ల ఆ చదువుకు దూరంగా ఉంటున్న బాల్యాలు బోలెడు. ముఖ్యంగా చదువుకోవడానికి బడికి వెళితే వాళ్లకు కడుపుకు తిండి ఎలా?? ప్రభుత్వం అన్ని విధాలా వాళ్లకు అన్ని అవసరాలు అందించినా ఆ పిల్లలే పనులు చేయకుండా ఉంటే గడవడం ఎలా?? ఇలాంటి ఎన్నో సందిగ్ధమైన ప్రశ్నల వలయంలో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది ఆ బాల్యం.

మరేం చేయాలి??

చాలా కుటుంబాలకు తిండి, బట్ట, విద్య అనేవి పెద్ద సమస్య కాదు. అలాంటి కుటుంబాలలో ఉన్న పిల్లలకు వాటి ఆవశ్యకత గురించి తెలియజేయాలి. అలాగే చదువుకోవాలనే ఆసక్తి ఉండి, ఆర్థిక ఇబ్బందుల వల్ల వాటికి దూరమైన పిల్లలు ఎందరో ఉంటారు. తమ వంతుగా కనీసం సంవత్సరానికి ఒక పిల్లవాడి చదువుకు సహాయపడితే ఆ పిల్లవాడి భవిష్యత్తు ఎంతో ఆశాజనకంగా ఉంటుంది. అంతే కాదు చదువుకోవడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ముందుకు కదిలే వాళ్ళ తపన చూసి మీ మీ కుటుంబాలలో ఉన్న పిల్లలకు కూడా చదువు మీద ఒకానొక భక్తి ఏర్పడుతుంది.

చాలామందికి పుట్టినరోజులు అంటే ఎంతో సంబరమైన రోజులు, అయితే ఆర్థిక లేమితో బాధపడేవారు ఎవరూ లేని అనాథ పిల్లలు ఇలాంటి వేడుకలు ఏమి లేకుండా అన్ని రోజులను ఓకేవిధంగా గడిపేస్తూ ఉంటారు. మీ మీ కుటుంబాల్లో జరిగే వేడుకలు, సంబరాల హడావిడి కొద్దిగా తగ్గించుకుని ఆ మిగిలి డబ్బుతో ఇలాంటి పిల్లల పుట్టినరోజులు జరిపితే ఎంతో సంబరపడతారు.  ఇది ఒకటి అయితే మరొకటి వృద్ధుల సమస్యలు. వయసు ఉన్నన్నాళ్లు ఎంతో కష్టపడి, పని చేసి, డబ్బు సంపాదించి, పిల్లలకు పెట్టి, వయసయ్యాక ఎలాంటి ఆధరువు లేకుండా బిక్కు బిక్కుమనే పండుటాకులు ఎన్నో. వాళ్లకు కావాల్సింది పూటకు ఇంత తిండి, ఏదో ఒకరోజు కొద్దీ సమయం ఆప్యాయంగా పలకరించడం. ఇప్పుడు వెలసిన ఎన్నో వృద్ధాశ్రమాలలో, వీధులలోనూ, ఫూట్ పాత్ ల వెంటా ఎందరో వృద్ధులు ఆరిపోయే దీపాల్లా మెల్లగా సాగుతుంటారు.  సాధారణ మనిషి తన జీవితంలోని పుట్టినరోజుల్లోనూ, పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు ఇట్లా ఎన్నో సందర్భాలలో అయ్యే ఖర్చులో కాసింత తగ్గించికుని ఇలాంటి దిక్కులేని పిల్లల కోసం, పండుబారిన వృద్ధుల కోసం, ఆపన్న హస్తం కోసం ఎదురు చూసే వారికోసం ఖర్చు చేస్తే దైవం మానుష్య రూపేణా అనే మాటకు సార్థకం చేసినవారు మీరే అవుతారు.

◆ వెంకటేష్ పువ్వాడ