నాకు పీవీ సింధుతో పెళ్లి జరిపించండి.. 70 ఏళ్ల వృద్ధుడి వింత కోరిక
posted on Sep 17, 2019 5:22PM
'ముసలోడే కానీ మహానుభావుడు' అని అతడు సినిమాలో బ్రహ్మానందం ఓ డైలాగ్ చెప్తాడు. డెబ్భై ఏళ్ల ఓ వృద్ధుడు కోరిక తెలిస్తే ఇప్పుడు మనం కూడా అదే డైలాగ్ చెప్తాం. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీసింధుతో నాకు పెళ్లి జరిపించండి, లేదంటే నేనే కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుంటా అంటూ ఓ వృద్ధుడు ఏకంగా జిల్లా కలెక్టరుకే వినతి పత్రం ఇచ్చాడు.
తమిళనాడులోని రామనాథపురం జిల్లా కలెక్టర్ వీరరాఘవరావు ప్రజాదర్బార్ నిర్వహిస్తుండగా.. 70 ఏళ్ల మలైసామి అనే వృద్ధుడు కూడా వినతిపత్రంతో హాజరయ్యాడు. అందరూ సాయం చేయమని వినతి పత్రాలిస్తుంటే.. ఆయన మాత్రం వివాహం చేయమని వినతి పత్రం ఇచ్చాడు. తాను 2004లో జన్మించానని, తన వయసు 16 ఏళ్ళు అని, తాను దేవుడి ప్రత్యేక అవతారాన్నని, దుష్టశిక్షణ శిష్ట రక్షణ కోసం అవతరించానని అందులో పేర్కొన్నాడు. తనలాంటి కారణజన్ములు సాధారణ యువతులను పెళ్లి చేసుకోరాదని, అందుకే పీవీ సింధు వంటి పేరుప్రతిష్ఠలున్న అమ్మాయిని పెళ్లిచేసుకోవాలని భావిస్తున్నానని లేఖలో తెలిపాడు. పీవీ సింధును పెళ్లి చేసుకునేందుకు కలెక్టర్ సహకారం అందించాలని, లేదంటే కిడ్నాప్ చేసైనా ఆమెను పెళ్లాడతానని 16 ఏళ్ళ వృద్ధుడు వార్నింగ్ కూడా ఇచ్చాడు. సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది.
ఈ వినతిపత్రం చూసిన కలెక్టర్ కార్యాలయం సిబ్బంది పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నారు. అనంతరం కలెక్టర్ తోపాటు ఇతర సిబ్బంది అతనికి నచ్చజెప్పినా సింధుతో తన పెళ్లి చేయాల్సిందేనని పట్టుబట్టాడు. దీంతో ఆ వృద్దుడికి ఎలా నచ్చచెప్పాలో తెలియక కలెక్టర్ మరియు కార్యాలయ సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు.