కోడెలకు అడుగడుగునా నీరాజనం... కిక్కిరిసిపోయిన జాతీయ రహదారి
posted on Sep 18, 2019 11:31AM
కోడెలకు అడుగడుగునా తెలుగు తమ్ముళ్లు నీరాజనం పట్టారు. దాదాపు 400 కార్ల భారీ కాన్వాయ్ మధ్య కోడెల భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి గుంటూరు తరలించారు. కోదాడ, సూర్యాపేట, విజయవాడ మీదుగా సాగిన ఈ యాత్రలో టీడీపీ కార్యకర్తలు, కోడెల అభిమానులు రోడ్లపైకి పెద్దఎత్తున తరలివచ్చారు. కోడెల మృతదేహం వెంట తెలుగుదేశం అధినేత చంద్రబాబు రావడంతో, హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి పొడవునా టీడీపీ శ్రేణులు కోడెలకు నీరాజనం పడుతూ నివాళులర్పించారు. ఇక విజయవాడ-గుంటూరు మార్గంలో అయితే, గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయింది. పెద్దఎత్తున కార్యకర్తలు, అభిమానులు తరలిరావడంతో, జాతీయ రహదారి జనంతో కిక్కిరిసిపోయింది. ఇక, కెన్యా నుంచి హుటాహుటిన వచ్చిన కోడెల కుమారుడు శివరామ్.... ఇబ్రహీంపట్నం దగ్గర చంద్రబాబును కలిసి కన్నీటి పర్యంతమయ్యాడు. అనంతరం గుంటూరు టీడీపీ ఆఫీస్ కు కోడెల మృతదేహాన్ని తరలించి నివాళులర్పించారు. ఆ తర్వాత నర్సరావుపేటలోని కోడెల స్వగృహానికి పార్ధివదేహాన్ని తరలించారు. అధికార లాంఛనాలతో నర్సరావుపేటలో కోడెల అంత్యక్రియలు జరగనున్నాయి.
అయితే, కోడెల భౌతికకాయం నర్సరావుపేట చేరుకోవడంతో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నర్సరావుపేటలో 144 సెక్షన్ విధించారు. అడుగడుగునా బలగాలను మోహరించారు. అలాగే బందోబస్తు పర్యవేక్షణకు ఇద్దరు ఎస్పీలు, 10మంది డీఎస్పీలను నియమించారు.