సుందర చిరంజీవుడు హనుమంతుడు!!
posted on Apr 16, 2022 9:30AM
భారతదేశంలోనే కాక విదేశాలలో కూడా ఎక్కువగా పూజలు అందుకునే దైవం, చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఆయన పేరునే ఒక శక్తిగా భావించి తలచుకునే వైనం, ప్రతి హిందువు ఎంతో భక్తిగానూ, మరెంతో సన్నిహిత భావంతోనూ కొలిచే దేవుడు హనుమంతుడు.
అంజనాసుతుడు లేదా అంజనాపుత్రుడు, ఆంజనేయుడు, హనుమంతుడు, మారుతి, భజరంగబలి ఇలా పేర్లు ఎన్నైనా మహా బలసంపన్నుడు, గొప్ప శక్తిశాలి అయిన హనుమంతుడి గురించి తెలియని వాళ్ళు ఉండరు. రామాయణంలో రాముడు అందరికీ ఎంత బాగా తెలుసో, ఆంజనేయుడు కూడా అందరికి అంతేబాగా తెలుసు.
పిల్లలు భయపడితేనో, చీకట్లో నడవాల్సి వస్తేనో, కష్టాలు ఉన్నప్పుడో, మానసిక సమస్యలు వేధిస్తూ ఉన్నప్పుడో ఇలా ఒక్కటనేమి మనిషికి నిత్యజీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు "జై భజరంగబలి" అనే ఒక్క మంత్రం ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది.
హనుమంతుడి జననం!!
హనుమంతుడు ఆ ఈశ్వర పుత్రుడని అంటారు. ఈశ్వరుడి తేజస్సు అంజనాదేవి గర్భంలో పెరిగి వైశాఖ బహుళ దశమి నాడు జన్మించాడు. అంజనాదేవి గారాల పట్టిగా పెరిగాడు. ఈయనకు అంజనాదేవి మొదట పెట్టిన పేరు సుందర అని. సుందర అంటే అందమైన అని. నిజానికి ఈ సుందరుడు పుట్టినప్పుడు చందమామ లాగా అందంగా ఉన్నవాడే. కానీ అల్లరిచేష్ట వల్ల ముఖంలో అపశ్రుతి వచ్చిపడింది.
సుందరుడు హనుమంతుడు ఎలా అయ్యాడు??
అంజనాదేవి సుందరుడిని పడుకోబెట్టి పండ్లు తేవడానికి వెళ్ళింది. ఆమె వచ్చేలోపు నిద్రలేచి ఆకలి వేయడంతో ఆకాశంలో ఎరుపురంగులో ఉన్న సూర్యుడిని చూసి ఎర్రగా ఉన్న పండు అనుకుని ఎంతో వేగంతో ఆకాశంలోకి ఎగిరాడు, అది చూసిన సకల ప్రాణులు, దేవతా లోకలు ఆశ్చర్యపోయాయి. అప్పుడే ఇంద్రుడు ఐరావతం మీద వస్తుంటే ఐరావతం తెల్లని పండులాగా కనిపించింది. హనుమంతుడు అటువైపు తిరిగి ఐరావతం పట్టుకోబోయాడు, ఇంద్రుడికి కోపం వచ్చి వజ్రాయుధం ప్రయోగించాడు. అది హనుమంతుడికి తగిలి పడిపోయాడు. వాయుదేవుడు కోపించి గాలి స్తంభింపజేశాడు. సకలదేవతలు బ్రహ్మతో సహా వెళ్లి హనుమంతుడిని చిరాజీవిని చేసి, ఎన్నో వరాలు ఇచ్చారు. వజ్రాయుధం వల్ల గాయపడి హనుమన్తడు అయ్యాడు. కానీ హనుమంతుడు మునుల భార్యల చీరలు చింపేయడం, లారీ చేయడం వంటివి చేస్తుంటే ఇక ఆగలేని మునులు నీ శక్తి నీకే తెలియకుండాపోతుంది. ఒకరు గుర్తుచేస్తే తప్ప నీకు నీ శక్తి తెలియదు అని శాపం పెడతారు. అప్పటి నుండి హనుమంతుడు సాధారణ వానరుడిలాగే పెరిగాడు.
అమోఘమైన విద్యాభ్యాసం!!
ఈయన సూర్యుడి దగ్గర చదువుకున్నాడు. గొప్ప పండితుడిగా మారాడు. ఇంకా చెప్పాలంటే హనుమంతుడికి రాని విద్య లేదు. కానీ ఇంత తెలిసినా ఏమి తెలియనట్టే ఉండటం జ్ఞానుల లక్షణం అన్నట్టు. ఈయన కూడా అలాగే ఉండేవాడు.
సుందరకాండ!!
ఆంజనేయుడికి రాముడికి పరిచయం తరువాత సీతమ్మను వెతకడానికి సాగిన ఆంజనేయుడు ప్రయాణమే సుందరకాండగా పిలవబడుతుంది. ఇది మొత్తం ఎంతో అద్భుతంగా ఉంటుంది. సుందరకాండ చదివిన వాళ్లకు విన్న వాళ్లకు ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెబుతారు.
ఏమి చెబుతుంది హనుమంతుని జీవితం!!
హనుమంతుడు మహా బల సంపన్నుడు. గుర్తుచేస్తే తప్ప తన బలం తాను తెలుసుకోలేడు. చాలామంది సాధారణ మనుషులు కూడా ఇంతే. తమలో ఉన్న నైపుణ్యాన్ని తెలుసుకోలేరు.
హనుమంతుడు కార్యసాధకుడు. ఆయన ఎంత కష్టమైన పనిని అయినా చేసి తీరతాడు. అలాంటి గుణం మనుషుల్లో చాలా తక్కువ ఉంటుంది. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని దాన్ని పెంచుకోవాలి.
ఈయన గొప్ప వ్యాకరణ పండితుడు. వాచికం అద్భుతంగా ఉంటుంది. వాచికం అంటే మాట్లాడే గుణం, వ్యాకరణం అంటే భాషలో ఉన్న సకల విషయాలు అని అర్థం. అన్నిటి మీద ఈయనకు పట్టు ఉంది. ఎవరిదగ్గర ఎలా మాట్లాడాలి అనేది స్పష్టంగా తెలిసి ఉంటుంది. అలాంటివాడు కాకపోతే రావణాసురుడిని ఆకర్షించగలిగాడు. వాచికం గొప్పగా ఉన్నవాళ్లు ఎదుటివారిని తొందరగా ఆకర్షించగలుగుతారు. తమ మాటలతో ఎదుగువారిని ఒప్పించగలుగుతారు.
ఈయన గొప్ప బుద్ధిశాలి. చిన్నతనం అంతా అల్లరిగా సాగినా హనుమంతుడు ఎంతో గొప్ప మేధస్సు కలిగినవాడు. సుగ్రీవుడికి మంత్రిగా ఉంటూ తన కర్తవ్యం నిర్వహించాడు. అంతేకాదు సుందరకాండలో లంకలో ప్రవేశించినప్పుడు హనుమంతుడి ప్రతిభ అడుగడుగునా కనబడుతుంది.
ఈయన చిరంజీవిగా వర్ధిల్లడం వల్ల రాముని అవతారం తరువాత రామ జపం చేస్తూ తపస్సులో మునిగిపోయాడని అంటారు. మనిషికి ఒకదశలో ఇలాంటి స్థితి అవసరమని చెప్పకనే చెబుతాడు. అష్టసిద్ధులకు ఈయన అధిపతిగా ఉంటాడు. అష్టసిద్ధులకు తొమ్మిదిరకాల వ్యాకరణాలను ధారబోసేది ఈయనే.
ఈవిధంగా చూస్తే హనుమంతుడి గురించి చెప్పుకున్నది తక్కువే. కానీ నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. జై భజరంగబళి అని ఆయన్ను తలచుకుని కార్యరంగాలలోకి ఉరకడమే ఇక.
◆ వెంకటేష్ పువ్వాడ.