Fatty liver – A Disease of the Modern Age!

  Fatty liver is the disease of the new age its victims have enormously risen in the past decade, all raising the finger at the lifestyle changes. In a normal healthy individual there is some amount of fat, but it is labeled as fatty liver when more than 10%of the organ weight is due to fat deposits. There are two types of Fatty liver diseases:   Alcoholic Fatty Liver Disease (ALD): As the name suggests it is caused by heavy drinking. The symptoms may show up even due to Hepatitis C, over loading of Iron, obesity or the genes.   Non-Alcoholic Fatty Liver Disease (NALD): It is a tricky entity as there no explanations why some people suffer from fatty liver disease while others do not. The possible cause will be; the genetic factors, overweight, insulin resistance due to which the cells become hostile to the action of the hormone, high blood sugar or hyperglycemia indicating diabetes type 2 and abnormal lipid profile i.e. high cholesterol levels.   There is limited understanding of why some fatty livers develop inflammation that progresses to cirrhosis, scarring of the liver. Other rare conditions that cause fatty liver are: Malnutrition, autoimmune diseases, medications and crash diets.   The treatment is not well defined; well it is a multi-dimensional approach diet control and physical activity form the main pillars of the treatment. The additives include vaccination against Hepatitis A and Hepatitis B, in certain advanced conditions liver transplant is only hope!

read more
చాక్లెట్లు తినకుండా చేసే ఆట

  ‘నీకు ఇష్టమైన ఆహారం ఏమిటి?’ అని ఏ పిల్లవాడినైనా కదిపి చూడండి! ‘చాక్లెట్లు, కేకులు, ఐస్క్రీం, కోక్, పిజ్జా.....’ అంటూ మన మెదడు మొద్దుబారిపోయేలా చాంతాడంత జాబితా చెబుతారు. ఎప్పుడో అడపాదడపా ఇలాంటి చిరుతిళ్ల మీద మనసు పారేసుకోవడం తప్పుకాదు. కానీ ఇవి లేనిదే రోజు గడవని పరిస్థితి వస్తే మాత్రం నష్టపోయేది పిల్లలే! ఆ మాట వారికి చెప్పినా అర్థం చేసుకునే వయసు కాదు.   పిల్లలకీ, చిరుతిళ్లకీ ఉన్న అవినాభావ సంబంధం ఏ ఒక్క దేశానికో పరిమితం కాదు. ఇంగ్లండులోని పిల్లలు కూడా పళ్లు, కూరగాయలు పూర్తిగా పక్కనపెట్టేసి చిరుతిళ్ల మీద పడుతున్నారట. తినాల్సిన మోతాదుకంటే మూడురెట్లు ఎక్కువ తీపిని లాగించేస్తున్నారట. వీటితో ఊబకాయం, డయాబెటిస్ లాంటి సమస్యలు పెరిగిపోతున్నాయి. అందుకనే ఇంగ్లండులోని Exeter అనే విశ్వవిద్యాలయానికి చెందిన సైకాలజిస్టులు దీనికి ఒక పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేశారు. ఒక కంప్యూటర్ గేమ్ని రూపొందించి పిల్లల మీద ప్రయోగించారు.   చాక్లెట్లాంటి పదార్థాలు ఒక రకమైన వ్యసనాన్ని కలగచేస్తాయి. అందుకనే వీటిని చూడగానే... మెదడు ‘కొనేసెయ్, తినేసెయ్’ అంటూ రెచ్చగొడుతుంది. స్వీయనియంత్రణ (self- control) కోల్పోతారు. ఒక చిన్న గేమ్ ద్వారా ఈ స్వభావాన్ని మార్చాలనుకున్నారు సైకాలజిస్టులు. ఈ ఆటలో పిల్లవాడికి కంప్యూటర్ స్క్రీన్ మీద ఒకో ఆహారపదార్థమూ కనిపిస్తుంది. అది ఆరోగ్యానికి మంచిదైతే దాని పక్కన సంతోషంగా ఉండే బొమ్మ కనిపిస్తుంది. ఆరోగ్యానికి అంత మంచిది కాకపోతే విషాదంగా ఉన్న మొహం కనిపిస్తుంది. సంతోషకరమైన మొహాన్ని చూసినప్పుడు పిల్లలు బటన్ నొక్కాల్సి ఉంటుంది. ఆట ముగిసిన తర్వాత పిల్లల్ని వాళ్లకి కావల్సిన ఆహారపదార్థాలు కొనుక్కోమన్నారు. ఆశ్చర్యంగా పిల్లలు ఇదివరకులా కాకుండా మంచి ఆహారం వైపు ఎక్కువగా మొగ్గుచూపారట. అంటే వారు ఆడిన ఆట మెదడు మీద తెలియకుండానే సానుకూల ప్రభావం చూపిందన్నమాట. ఇదే మార్పుని పాఠాల ద్వారా, సెమినార్ల ద్వారా తీసుకురావాలంటే బోలెడు ఖర్చు, సమయం వృధా అవుతాయి. కానీ ఏడంటే ఏడు నిమిషాలలో ముగిసిపోయిన ఆటతో వారిలో అనూహ్యమైన మార్పుని సాధించారు పరిశోధకులు.   ఈ ప్రయోగం కోసం 4 నుంచి 11 ఏళ్ల వయసు ఉన్న 200 మంది పిల్లలను ఎంచుకున్నారు. వీరందరి మీదా ఆట ఒకే తీరున ప్రభావం చూపిందట. అంటే ఇలాంటి వీడియో గేమ్స్తో చిన్నా, పెద్దా... ఎవరి మీదైనా సానుకూల ప్రభావం చూపించవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ఆలోచనతో Dr Natalia Lawrence అనే శాస్త్రవేత్త పెద్దలలో చిరుతిళ్ల అలవాట్లు మార్చేందుకు, Food Trainer అనే యాప్ను రూపొందించారు. కావాలంటే గూగుల్ ప్లేలో ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని చూడండి. - నిర్జర.    

read more
ads
Online Jyotish
Tone Academy
KidsOne Telugu
తల్లి ప్రేమతో తెలివితేటలు పెరుగుతాయా!

  తల్లి ప్రేమకి హద్దులు ఉండవు. పోలికలూ దొరకవు. మరి ఆ ప్రభావం ఊరికనే పోతుందా! తల్లి ప్రేమతో మెదడే మారిపోతుందని కొన్ని పరిశోధనలు రుజువుచేస్తున్నాయి. తల్లి ప్రేమని పొందే విద్యార్థులు మిగతావారితో పోలిస్తే చదువులో చురుగ్గా ఉంటారనీ, పరిపక్వతతో వ్యవహరిస్తారనీ తెలుస్తోంది. తల్లి అనురాగాన్ని పొందే పిల్లల మెదడులో కూడా అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయని కూడా కొందరు పరిశోధకులు నిరూపించారు.   పిల్లల మెదడు మీద తల్లి ప్రభావాన్ని తేల్చేందుకు పరిశోధకులు ఓ 92 మంది పిల్లలను ఎన్నుకొన్నారు. వీరంతా కూడా 3 నుంచి 6 ఏళ్ల వయసులోపువారే! ప్రయోగంలో భాగంగా పిల్లవాడిని తల్లితో పాటు ఐదు నిమిషాల పాటు ఒక గదిలో ఉంచారు. ఆ సమయంలో ఏదో ఫారం పూర్తిచేయమని తల్లికి చెప్పారు. పిల్లవాడి కళ్ల ముందర ఓ ఆకర్షణీయమైన కాగితంలో చుట్టిన బహుమతిని ఉంచారు. తల్లి ఫారంని పూర్తిచేసేవారకూ కూడా పిల్లవాడు ఆ కాగితంలో తన కోసం ఏ బహుమతి ఉందో చూడ్డానికి లేదంటూ షరతు విధించారు.   సహజంగానే పిల్లవాడు తన ముందున్న ప్యాకెట్లో ఉన్న బహుమతిని తీసి చూడాలన్న తపనతో ఉంటాడు. ఆ సమయంలో తల్లి ఒక పక్క ఫారంని పూర్తిచేస్తూనే తన కొడుకుని ఏ విధంగా సముదాయించాల్సి వచ్చేది. ఈ సమయంలో వారిని గమనించేందుకు కొందరు సైకాలజిస్టులను నియమించారు. పిల్లవాడితో తల్లి ఎంత ప్రేమగా వ్యవహరిస్తోందో చూసి, దాని బట్టి వారిరువురి మధ్య బంధాన్ని అంచనా వేశారు.   ఓ నాలుగేళ్లు గడచిన తర్వాత ఆనాటి పిల్లలను మళ్లీ ల్యాబ్కు తీసుకువచ్చారు పరిశోధకులు. అక్కడ MRI స్కానింగ్ ద్వారా వారి మెదడులో వచ్చిన మార్పుని అంచనా వేశారు. ప్రేమగా చేసుకునే తల్లులు ఉన్న పిల్లల్లోని హిప్పోకేంపస్ అనే భాగంలో అనూహ్యమైన ఎదుగుదల వచ్చినట్లు గమనించారు. తల్లి అంత ప్రేమగా వ్యవహరించని పిల్లలకంటే వీరి హిప్పోకేంపస్ ఏకంగా పదిశాతం ఎక్కువగా ఎదిగింది. తల్లిప్రేమ పొందిన పిల్లలలో డిప్రెషన్ వంటి లక్షణాలు కూడా తక్కువగా ఉన్నట్లు ఈ ప్రయోగంలో తేలింది.   మనలో నేర్పు, జ్ఞాపకశక్తి, ఒత్తిడిని ఎదుర్కోవడం వంటి లక్షణాలన్నింటినీ హిప్పోకేంపస్ నియంత్రించగలదు. ఈ హిప్పోకేంపస్ బాగుంటే మనిషి అద్భుతాలు సాధించేందుకు సిద్ధంగా ఉంటాడన్న మాట! మరి ఆ అద్భుతాల వెనుక తల్లి ప్రేమ దాగుందన్న విషయం తేలిపోయిందిగా! - నిర్జర.  

read more
మెదడు బాగుండాలా? రెండు నిమిషాలు మౌనం పాటించండి!

నిశ్శబ్దానికి ఉన్న విలువ గురించి భారతీయులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. వేల సంవత్సరాల క్రితమే వారికి మౌనంలో దాగిన జ్ఞానం గురించి అవగాహన ఉంది. అందుకే మనసుని నిశ్చలంగా నిలిపి ఉంచే ధ్యానాన్ని కనిపెట్టారు. ‘ఊరికే అలా రాయిలాగా నిశ్చలంగా కూర్చుంటే ఏంటి ఉపయోగం? అంటూ ఒకప్పుడు గేలి చేసిన పాశ్చత్య ప్రపంచం కూడా ఇప్పుడు మౌనం వల్ల కలిగే అద్భుత ఫలితాల గురించి తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు. మెదడు మరింత చురుగ్గా! ఓ నాలుగు సంవత్సరాల క్రితం నిశ్శబ్దకరమైన వాతావరణంలో ఉంటే, మెదడుకి ఏమన్నా ఉపయోగం ఉందేమో కనుక్కోవాలన్న ఆలోచన వచ్చింది శాస్త్రవేత్తలకి. ఆలోచన వచ్చిందే తడువుగా కొన్ని ఎలుకల మీద ఓ ప్రయోగం చేశారు. రోజుకి రెండు గంటలపాటు ఎలుకలకి ఎలాంటి శబ్దమూ చేరకుండా, ప్రశాంతమైన వాతావరణంలో ఉండనిచ్చారు. దాంతో వాటి మెదడులోని హిప్పోకేంపస్ అనే భాగంలో కొత్త కణాలు ఏర్పడటం చూసి పరిశోధకులు బిత్తరపోయారు. మన జ్ఞాపకాలు, ఉద్వేగాలు, నైపుణ్యాలను నియంత్రించడంలో ఈ హిప్పోకేంపస్‌ది ముఖ్యపాత్ర! అంటే నిశ్శబ్దమైన వాతావరణంలో ఉండటం వల్ల మన మెదడు మరింత చురుగ్గా మారే అవకాశం ఉందన్నమాట. సమస్య మరింత తేలికగా!   నిశ్శబ్దంలో ఉండటం లేదా మనసుని నిశ్చలంగా ఉంచుకోవడం వల్ల... సమస్యలని పరిష్కరించడం కూడా తేలికగా మారిపోతుందని నిపుణులు చెబుతున్నారు. మెదడు అటూఇటూ పోకుండా నేరుగా సమస్య మీదే తన దృష్టిని కేంద్రీకరించేందుకు కావల్సిన స్వేచ్ఛ దొరుకుతుందట. సరికొత్తగా, సృజనాత్మకంగా ఆలోచించే అవకాశమూ దక్కుతుంది. మెదడుని అలా నిశ్చలంగా ఉంచే ప్రయత్నం చేస్తే, అసలు ఆలోచనలే ఉండవు కదా! అన్న అనుమానం రావచ్చు. మెదడు విశ్రాంతిగా ఉన్నప్పుడు కూడా, మనం ఏ సమస్యనైతే మెదడుకి అందించామో.... దాన్ని విశ్లేషిస్తూనే ఉంటుంది. శబ్దంతో ఒత్తిడి   ఇప్పటివరకూ నిశ్శబ్దం గురించి చెప్పుకొన్నాం కాబట్టి, ఇప్పుడు శబ్దం వల్ల ఏర్పడే ఫలితం కూడా ఓసారి చూద్దాం. చుట్టూ అదేపనిగా శబ్దాలు వినిపిస్తూ ఉంటే శరీరం, ఒత్తిడిని కలిగించే రసాయనాలను (stress hormones)ను విడుదల చేస్తుందని తేలింది. గాఢ నిద్రలో ఉన్నా కూడా పక్కనే వినిపించే శబ్దాలకు మెదడు కంగారుపడుతూనే ఉంటుందట. నిరంతరం రణగొణధ్వనుల మధ్య ఉండే పిల్లల్ని గమనించినప్పుడు.... ఆ శబ్దాలు వారి చదువు, ఎదుగుదల, తెలివితేటల మీద తీవ్రమైన ప్రభావం చూపుతున్నట్లు తేలింది. ఆ శబ్దాలకు అలవాటుపడిన పిల్లలు ఆఖరికి ఎదుటివారు ఏం మాట్లాడుతున్నారో కూడా విశ్లేషించే సామర్థ్యాన్ని కోల్పోతున్నారట!   ఏతావాతా... నిశ్శబ్దకరమైన వాతావరణంలో ఉండే ప్రయత్నం చేయడం, మనమూ మౌనంగా ఉండటం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయని తేలిపోయింది! అందుకే రెండు నిమిషాల పాటు మంచి సంగీతాన్ని విన్నప్పుడు కలిగే హాయికంటే, రెండు నిమిషాల పాటు మౌనంగా ఉన్నప్పుడ పొందే ప్రశాంతతే ఎక్కువని తేల్చారు పరిశోధకులు. - నిర్జర

read more
పిల్లల ఆహారంలో విషం

ఇంట్లో పిల్లవాడు ఉంటే గారాబంగా చూసుకుంటాం. వాడి చిన్ని పొట్ట ఆకలితో ఉందన్న అనుమానం రాగానే... కడుపు నిండా ఆహారం పెడతాము. కానీ ఆ ఆహారంలో విషం ఉందని తెలిస్తే! అవును! పిల్లలకి అందించే ఆహారంలో ఆర్సెనిక్ (పాషాణం) అనే ప్రాణాంతక రసాయనం ఉంటోందని చెబుతున్నారు ఐర్లాండ్ పరిశోధకులు.   ఓ అర్నెళ్లు వచ్చిన పిల్లలకి పాలతో పాటుగా ఘనాహారం కూడా పెడుతుంటాము. అందుకోసం గోధుమలు, బియ్యంతో చేసిన బేబీ ఫుడ్స్ దొరుకుతూ ఉంటాయి. ఈ తరహా ఆహారాన్ని ‘ఫార్ములా ఫుడ్స్’ అంటారు. అయితే ఈ ఫార్ములా ఫుడ్స్లో ప్రాణాంతమైన ఆర్సెనిక్ అనే రసాయనం ఉంటోందని ఎప్పటినుంచో ఆరోపణలు వస్తున్నాయి. అందుకే జనవరి 2016లో పిల్లల ఆహారంలో ఆర్సెనిక్ అదుపులో ఉండాలంటూ యూరోపియన్ యూనియన్ హెచ్చరించింది.   యూరోపియన్ యూనియన్ చేసిన హెచ్చరికలు ఎంతవరకు పనిచేస్తున్నాయో చూడాలనుకున్నారు పరిశోధకులు. ఇప్పటికీ ఓ 50 శాతం బేబీ ఫుడ్స్లో ఆర్సెనిక్ మోతాదుకి మించి ఉంటోందని తేలింది. బియ్యంతో చేసిన బేబీ ఫుడ్స్లో అయితే ఈ పరిస్థితి మరీ దారుణంగా కనిపించింది. బియ్యంతో చేసిన ఫార్ములా ఫుడ్స్లో దాదాపు 75 శాతం సందర్భాలలో విచ్చలవిడిగా ఆర్సెనిక్ కనిపించింది. బియ్యంతో చేసిన బేబీ ఫుడ్స్ సురక్షితం అని మన నమ్మకం. అవి పిల్లలకి సులభంగా జీర్ణమవుతాయనీ, ఎలాంటి అలెర్జీలూ రావని, పోషకాలు ఎక్కువగా ఉంటాయని నమ్ముతాము. కానీ అవే బియ్యపు ఆహారంలో ఆర్సెనిక్ శాతం ఎక్కువగా కనిపించడం బాధాకరం.   ఇంతకీ ఈ ఆర్సెనిక్ ఎక్కడి నుంచి వస్తోంది? అంటే స్పష్టమైన కారణం కనిపిస్తుంది. పంటని పండించేటప్పుడు చల్లే పురుగుమందులు, దాన్ని నిల్వ చేసేటప్పుడు వాడే క్రిమిసంహారక మందులు... అన్నింటిలోనూ ఆర్సెనిక్ పుష్కలంగా ఉండే అవకాశం ఉంది. ఇక భూమి, నీరు, గాలి కాలుష్యం కావడం వల్ల కూడా ధాన్యపుకంకుల్లోకి ఆర్సెనిక్ చేరే ప్రమాదం ఉంది.   ఎంతటివారికైనా ఆర్సెనిక్ ప్రమాదకరమే! ఇక పసిపిల్లలకైతే ఇది విషంతో సమానం. ఆర్సెనిక్ వల్ల పిల్లల్లో ఎదుగుదల లోపాలు, తెలివి మందగించడం, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, నరాల బలహీనత.... వంటి సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది. వారి శరీరంలో భాగాలన్నీ చురుగ్గా ఎదుగుతున్న సందర్భంలో ఆర్సెనిక్ శాపంగా మారవచ్చు. పెద్దల బరువుతో పోల్చుకుంటే పిల్లలు, తాము తినాల్సినదానికంటే ఎక్కువ ఆహారాన్నే తింటారు. కాబట్టి వారి శరీరంలో ఆర్సెనిక్ కూడా ఎక్కువగా చేరుతుందన్నమాట.   దురదృష్టం ఏమిటంటే... బేబీ ఫుడ్స్ని ఉత్పత్తి చేసే సమయంలో చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే, వీటిలోని ఆర్సెనిక్ 85 శాతం తగ్గిపోయే అవకాశం ఉందట. దీన్నిబట్టి బేబీఫుడ్స్ కంపెనీలు ఎంత నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నాయో అర్థమవుతోంది. అందుకని ఇక మీదట హెచ్చరికలు చేసి ఉపయోగం లేదనీ... ప్రతి బేబీఫుడ్ ప్యాకెట్ మీదా అందులో ఆర్సెనిక్ శాతం ఎంత ఉందో తెలిపేలా ఒక చట్టం చేయాలని పరిశోధకులు కోరుతున్నారు. దీనివల్ల వినియోగదారులే జాగ్రత్తపడే అవకాశం ఉంటుంది. - నిర్జర.    

read more
వైన్ తాగితే మెదడుకి మంచిదా!

  దాదాపు పదివేల సంవత్సరాల నుంచి మనిషి వైన్ పుచ్చుకుంటూనే ఉన్నాడు. హద్దులు దాటకుండా వైన్ తాగితే ఆరోగ్యానికి మంచిదన్న వాదనలూ ఉన్నాయి. గుండెజబ్బులు, డయాబెటిస్, పక్షవాతం, పేగు కేన్సర్- ఇలా చాలా సమస్యలు రాకుండా, వచ్చినా ప్రాణాంతకం కాకుండా వైన్ కాపాడుతుందట. ఇప్పుడు వైన్ తాగడం వల్ల ఏకంగా మెదడులోని న్యూరాన్లు ఆరోగ్యంగా ఉంటాయని చెబుతున్నారు పరిశోధకులు.   స్పెయిన్కు చెందిన Institute of Food Science Research పరిశోధకులు మెదడు మీద వైన్ ప్రభావాన్ని అంచనా వేసే ప్రయత్నం చేశారు. ప్రతి ఆహారమూ మన శరీరంలో కొన్ని ప్రత్యేక రసాయనాలను విడుదల చేస్తుంది. అలాగే వైన్ వల్ల కూడా కొన్ని రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. వీటిని wine-derived human gut metabolites అంటారు. వైన్ పుచ్చుకునేవారి జీర్ణాశయం నుంచి పరిశోధకులు ఈ metabolitesను సేకరించారు.   వైన్ తాగేవారి metabolites ప్రభావం న్యూరాన్ల మీద ఎలా పనిచేస్తుందో గమనించే ప్రయత్నం చేశారు. అనారోగ్యం, వృద్ధాప్యం, ఒత్తిడి వంటి పరిస్థితుల్లో ఈ న్యూరాన్లు సరిగా పనిచేయవు. న్యూరాన్ల పనితీరు సవ్యంగా లేకపోతే మెదడు పనితీరు కూడా మందగిస్తుంది. అది మతిమరపు, పార్కిన్సన్స్, అల్జీమర్స్ వంటి వ్యాధులకు దారితీస్తుంది.   వైన్ పుచ్చుకున్నవారిలోని metabolites, న్యూరాన్లని రక్షించే ప్రయత్నం చేయడం చూసి శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. వైన్ నుంచి వెలువడిన రసాయనాలు న్యూరాన్లు నిర్జీవం కాకుండా కాపాడుతున్నాయని గమనించారు. అయితే మోతాదు మించకుండా వైన్ పుచ్చుకుంటేనే ఈ ఉపయోగం ఉంటుందనీ.... హద్దు దాటితే అసలుకే మోసం వస్తుందనీ హెచ్చరిస్తున్నారు. ఒక అంచనా ప్రకారం ఆడవారైతే ఒక గ్లాసు, మగవారు రెండు గ్లాసులను మించకుండా తాగితే మోతాదులో తాగినట్లు లెక్క! మరి అ లెక్కకు మించకుండా చుక్క వేసుకుంటారా లేదా అన్నది అనుమానమే! - నిర్జర.

read more
ఎండాకాలం చల్లటి బీరు తాగితే!

  ఎండాకాలం వస్తే చాలు బార్లన్నీ కిటకిటలాడిపోతాయి. చల్లటి బీరుతో గొంతు తడుపుకోవాలని జనాలంతా ఉత్సాహపడిపోతుంటారు. బీరులో నీటి శాతం ఎక్కువ, ఆల్కహాల్‌ శాతమేమో తక్కువ. కాబట్టి వేసవి తాపాన్ని తీర్చుకునేందుకు బీరుని మించిన దారి లేదని చాలామంది అభిప్రాయం. ఇదెంత వరకు నిజం!   బీర్‌ని పుచ్చుకోవడం జనాలకి కొత్తేమీ కాదు. వేల ఏళ్ల నుంచి ఈ అలవాటు వస్తున్నదే! అయితే ఒకప్పుడు బీర్‌ పుచ్చుకునే ఉద్దేశం వేరు. మంచినీటిలో ఉండే సూక్ష్మజీవులని చంపేందుకు అందులో ఓ నాలుగు చుక్కలు ఆల్కహాల్‌ వేసేవారట. అందులో మహా అయితే .5 శాతం మాత్రమే ఆల్కహాల్ ఉండేది. కానీ ఇప్పడు పరిస్థితి మారిపోయింది. కనీసం 4 నుంచి 5 శాతమన్నా ఆల్కహాల్‌ లేనిదే బీరు తయారవ్వడం లేదు. బీరు తాగే అలవాటు మాత్రం తగ్గలేదు సరికదా... మంచినీళ్లు, టీ తర్వాత మనుషులు ఎక్కువగా తాగేది బీరే!   బీరులో ఉండే ఆల్కహాల్‌ వల్ల లివర్ దెబ్బతింటుందన్న విషయం తెలిసిందే! ఇందులో ఆల్కహాల్ శాతం తక్కువే అయినప్పటికీ, గుండెజబ్బుల వంటి సమస్యలు ఉన్నవారికి ఇది తప్పకుండా చేటు చేస్తుందని చెబుతున్నారు. ఇక ఎండాకాలం బీర్‌ తీసుకోవడం వల్ల డీహేడ్రేషన్‌ రాదన్నది కూడా ఉత్త మాటే!   మన శరీరంలో anti-diuretic (ADH) అనే హార్మోను ఉంటుంది. మనం తీసుకునే నీరు వీలైనంతవరకూ శరీరంలోనే ఉండేలా ఈ హార్మోను రక్షిస్తుంది. బీరు తాగినప్పుడు ఈ ADH పనితీరు దెబ్బతింటుంది. అందుకే ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. ఇదంతా బీరులో ఉన్న నీరు వల్ల అనుకుంటారు. కానీ ADH హార్మోను పనితీరు మందగించడం వల్ల అని గమనించలేరు. 200 ఎం.ఎల్‌ బీరు తాగితే 320 ఎం.ఎల్‌ నీరు శరీరంలోంచి పోతుందని ఓ అంచనా! అంటే శరీరంలోకి వెళ్లే నీటికంటే, బయటకి వచ్చే నీరే ఎక్కువన్నమాట!   ఎండాకాలం చల్లటి బీరుతో మరో ఇబ్బంది కూడా ఉంది. మన శరీరం ఎప్పుడూ ఒకే తరహా ఉష్ణోగ్రతలో ఉండే ప్రయత్నం చేస్తుంది. ఈ body temperature కంటే దిగువన ఉండే చల్లటి పదార్థాలు శరీరంలోకి చేరినప్పుడు, డీహైడ్రేషన్‌ సమస్య మరింతగా పెరుగుతుంది. ఇక జలుబులాంటి ఇతరత్రా సమస్యలు సరేసరి!   ఇక మీదట దాహం తీర్చుకోవాలి అనుకున్నప్పుడు ఏ మంచినీరో, కొబ్బరినీరో పుచ్చుకోవాలి కానీ మద్యం జోలికి పోవద్దన్నది నిపుణుల మాట. కాదూ కూడదూ అంటే అందుకు తగినంత ఆహారం, నీరు తీసుకోమని సూచిస్తున్నారు.   - నిర్జర.

read more
వయసుని మోసం చేయవచ్చు...!

    ప్రతి జీవికి ప్రకృతి ‘ఇంత వయసు వరకూ బతకవచ్చంటూ’ హామీ ఇస్తుంది. అలాగే మనిషికి కూడా నిండు నూరేళ్లు బతకమని దీవించింది. కానీ మనిషి మాత్రం అస్తవ్యస్తమైన జీవనశైలితో తన ఆయుష్షుని తుంచేసుకుంటున్నాడు. కాస్త జాగ్రత్త పడితే ఆ తప్పుని సరిదిద్దుకోవచ్చుననీ సూచిస్తున్నారు పరిశోధకులు.   బ్రిటన్లోని Babraham Instituteకి చెందిన పరిశోధనకులు వయసుని నియంత్రించే ఓ వ్యవస్థను కనుగొన్నారు. DNA methylation అని పేర్కొనే ఈ వ్యవస్థ, జన్యువుల పనితీరుని ప్రభావితం చేస్తుందని తేలింది. ఈ వ్యవస్థ మరీ వేగంగా పనిచేస్తుంటే వృద్ధాప్యం త్వరగా కమ్మేస్తోందని గమనించారు. ఉదాహరణకు- ఫ్యాటీలివర్‌ వంటి సమస్యలు ఉన్నవారిలో ఈ గడియారం త్వరత్వరగా పరిగెడుతోందట. మరోవైపు, సుదీర్ఘమైన ఆయుష్షు కలిగినవారిలో ఇది నిదానంగా పనిచేస్తోందట!   వృద్ధాప్యాన్ని నియంత్రించే గడియారాన్ని కనుగొన్నారు సరే! మరి మన ఆహారపు అలవాట్లు సదరు గడియారం మీద ప్రభావం చూపుతాయా అన్న అనుమానం కలిగింది పరిశోధకులుకి. అనుమానం వచ్చిందే తడవుగా కొన్ని ఎలుకల మీద తమ ప్రయోగాన్ని సాగించారు. సదరు ఎలుకలకి కొవ్వు పదార్థాలని అధికంగా అందించినప్పుడు, ఈ గడియారం వేగం పుంజుకుంటున్నట్లు తేలింది.   ఈ ఆవిష్కరణ తరువాత మనిషి జీవితాన్నీ, ఆయుష్షునీ ప్రభావితం చేసే మరిన్ని పరిశోధనలు జరగనున్నాయి. మనిషిలోని ఈ గడియారం తీరుని గమనించడం ద్వారా రాబోయే ప్రమాదాలను ముందుగానే పసిగట్టవచ్చు. ఈ గడియారాన్ని ప్రభావితం చేస్తున్న రసాయనాలను కనుక ఛేదించగలిగితే, వృద్ధాప్యాన్నే నిలువరించవచ్చు. ఇంకా మాట్లాడితే వృద్ధాప్యాన్ని సైతం వెనక్కి మళ్లించి తిరిగి యవ్వనాన్ని కూడా సాధించవచ్చు. ఆయుష్షునీ పెంచవచ్చు. ఇవన్నీ వినడానికి ఇప్పుడు అతిశయోక్తులుగా తోస్తాయి కానీ, భవిష్యత్తులో తప్పకుండా సాకారం అవుతాయని ఆశిస్తున్నారు శాస్త్రవేత్తలు.   - నిర్జర.  

read more
ఉప్పు తింటే... తింటూ ఉండాల్సిందే!

  ఉప్పు లేని జీవితాన్ని ఊహించడం కష్టం. ఒంట్లో ముఖ్యమైన జీవక్రియలు జరగాలంటే ఉప్పు లోపలకి చేరాల్సిందే. కానీ అవసరం కోసం తినాల్సిన ఉప్పుని మోతాదుకి మించి తీసుకోవడం ఎక్కువైంది. ఫలితం.. ఒంట్లో నానా సమస్యలు మొదలవుతున్నాయి. ఈ సమస్యలన్నీ ఒక ఎత్తయితే... అసలు ఉప్పు తింటే మరింత ఆహారం తీసుకోవాల్సి వస్తుందని తేలడం మరో విచిత్రం!   జర్మనీలోని ఒక సంస్థ, అంతరిక్షంలో ఉండే వ్యోమగాముల శరీరం మీద ఉప్పు ప్రభావం ఎలా ఉంటుందో పరిశీలించే ప్రయత్నం చేసింది. ‘ఉప్పు ఎక్కువ తినడం వల్ల వీలైనన్నిసార్లు మూత్రానికి వెళ్లక తప్పద’న్నది  ఇప్పటివరకూ ఉన్న అభిప్రాయం. శరీరానికి ఎక్కువైన ఉప్పుని బయటకు పంపేందుకు ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సి వస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు. అంతరిక్షంలో ఇలాంటి పరిస్థితి ఇబ్బంది కలిగిస్తుంది కదా! పైగా అక్కడ నీటి సమస్య కూడా ఉంటుందయ్యే! అందుకే వ్యోమగాములు తినే ఉప్పుకీ, వారి శరీరంలో జరుగుతున్న ప్రక్రియలకీ మధ్య ఉండే సంబంధాన్ని కనుగొనే ప్రయత్నం చేశారు.   పరిశోధనలో భాగంగా ఓ పదిమంది అభ్యర్థులను, వ్యోమనౌకలో ఉండే వాతావరణంలో ఉంచారు. వీరిలో కొందరిని 105 రోజులపాటు, మరికొందరిని 205 రోజులపాటు ఆ తరహా వాతావరణంలో ఉంచారు. వీరికి ఇచ్చే ఆహారంలో ఉప్పు మోతాదుని రెండుమూడు రకాలుగా మార్చిచూశారు. ఆశ్చర్యం! ఉప్పు ఎక్కువగా తినడం వల్ల నీరు ఎక్కువకాదు... తక్కువ తీసుకుంటున్నారని తేలింది. మరో వింత ఏమిటంటే... ఉప్పు ఎక్కువగా తినేవారు తమకు విపరీతంగా ఆకలి వేస్తోందంటూ తెగ తిన్నారట!   ఎక్కువ ఉప్పు తీసుకుంటే తక్కువ మూత్రం రావడం ఏమిటి? విపరీతంగా ఆకలి వేయడం ఏమిటి? అంటూ తలలు పట్టుకున్నారు శాస్త్రవేత్తలు. ఈ విషయాన్ని తేల్చుకునేందుకు ఇదే తరహా పరిశోధనను ఎలుకల మీద చేసి చూశారు. అప్పుడు బయటపడింది రహస్యం! శరీరంలో అధికంగా ఉన్న ఉప్పు మూత్రం ద్వారా బయటకు పోతున్న మాట వాస్తవమే. కానీ నీరు మాత్రం బయటకు వెళ్లకుండా తిరిగి కిడ్నీలలోకి చేరుకుంటోందట. ఒంట్లోని పనికిమాలిన ఉప్పుని ఎప్పటికప్పుడు సేకరించి బయటకు పంపేందుకు... శరీరం వీలైనంత నీటిని దాచుకుంటోంది!   ఉప్పుకీ, నీటికీ మధ్య సంబంధం తేలిపోయింది. మరి ఆకలి ఎక్కువగా వేయడానికి కారణం ఏమిటి? దీనికి ‘యూరియా’నే కారణం అని తేలింది. ఒంట్లోని నీరు మూత్రం ద్వారా బయటకు పోకుండా కిడ్నీలలోనే ఉండిపోయేందుకు యూరియా అవసరం అవుతుందట. ఈ యూరియాని ఉపయోగించుకోవాలంటే చాలా శక్తి అవసరం అవుతుంది. ఇందుకోసం ఎక్కువ తినాల్సి వస్తుంది!   ఉప్పు తింటే నీరు తక్కువగా తాగుతామనీ, తిండి ఎక్కువగా తింటామనీ.... ఈ పరిశోధనతో తేలిపోయింది. ఈ రెండూ కూడా ఒంటికి ఏమంత మంచిది కాదు కదా!!! - నిర్జర.      

read more
చిరుతిళ్ల రహస్యం తెలిసిపోయింది

  పిజ్జా, బర్గర్, శాండ్విచ్... ఇవన్నీ ఒకప్పుటి తరానికి తెలియవు. ఇప్పటి తరానికి మాత్రం ఇవి లేనిదే రోజు గడవదు. కొందరు అడపాదడపా వీటిని రుచిచూసేందుకు సిద్ధపడితే, మరికొందరేమో ఇవి లేకుండా జీవితం వృధా అన్నంత వ్యసనంతో బతికేస్తుంటారు. జంక్ఫుడ్స్ పట్ల కొందరు ఎందుకంత కోరిక పెంచుకుంటారు? ఈ విషయం మీదే షికాగోలోని ఓ విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణులు పరిశోధన నిర్వహించారు.   జంక్ఫుడ్స్కీ నిద్రలేమికీ మధ్య సంబంధం ఉందేమో అన్న అనుమానం చాలా రోజుల నుంచీ పరిశోధకులను వేధిస్తోంది. ఈ విషయాన్నే నిరూపించేందుకు నిపుణులు నడుం కట్టారు. ఇందుకోసం వారు ఓ బృందాన్ని ఎన్నుకొన్నారు. వీరిలో కొందరిని రోజులో కేవలం నాలుగు గంటలు మాత్రమే పడుకోమని చెప్పారు. మరికొందరేమో నిరభ్యంతరంగా ఎనిమిదేసి గంటలు పడుకోవచ్చునని సూచించారు. ఇలా నిద్రపోయి లేచిన తరువాత, వారందరికీ రకరకాల వాసనలు చూపించారు. ఆశ్చర్యకరంగా తక్కువసేపు నిద్రపోయిన లేచినవారు... ఘాటైన వాసనలకు త్వరగా ప్రతిస్పందిస్తున్నట్లు తేలింది. కస్టమర్లను ఆకర్షించేందుకు జంక్ఫుడ్స్ని రకరకాల మసాలాలతో ముంచెత్తేస్తారన్న విషయం తెలిసిందే కదా!   నిద్రలేమికీ, జంక్ఫుడ్స్ పట్ల కోరికకీ మధ్య ఉన్న సంబంధం ఈ పరిశోధనతో తేలిపోయింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసేవారు ఈ తరహా ఆహారాన్ని ఇష్టపడేందుకు బహుశా ఇదే కారణం కావచ్చు. ఎటూకాని పనివేళలు, సరిగా నిద్రపోనీయని ఒత్తిడి కారణంగా వీరు జంక్ఫుడ్స్ పట్ల మొగ్గు చూపుతారేమో!   నిద్రలేమి వల్ల పనికిమాలిన తిండికి అలవాటు పడటం ఒక ప్రమాదమైతే... అసలు మనం తీసుకునే కొన్ని రకాల ఆహారం ఆ నిద్రలేమికి కారణం కావడం మరో విచిత్రం. కొవ్వు, మాంసకృత్తులు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల సరిగా నిద్రపట్టదని నిపుణులూ హెచ్చరిస్తూ ఉంటారు. కానీ మనం రాత్రిపూట ఇలాంటి ఆహారాన్నే తీసుకోవడం గమనార్హం. అంటే తగిన ఆహారం తీసుకోకపోవడం వల్ల నిద్రపట్టకపోవడం, అలా నిద్రపట్టకపోవడం వల్ల మళ్లీ జంక్ ఫుడ్స్కి మొగ్గుచూపడం... ఇదంతా ఒక విషవలయంలాగా మారిపోతోందన్నమాట!   జంక్ ఫుడ్స్ వల్ల ఊబకాయం, రక్తపోటు, డయాబెటిస్, కొలెస్ట్రాల్, డిప్రెషన్, మలబద్ధకం... వంటి నానారకాల సమస్యలూ తలెత్తుతాయన్న విషయం తెలిసిందే! మరి జిహ్వచాపల్యానికి లొంగిపోయి ఇన్నేసి రోగాలను కోరితెచ్చుకోవడమో, ఆయుష్షు కోసం ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవడమో మన చేతుల్లోనే ఉంది. - నిర్జర.    

read more
పెంపుడు జంతువులతో రోగనిరోధకశక్తి పెరుగుతుంది

  ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే ఆ మానసిక ప్రశాంతతే వేరు! కానీ ఇప్పడు పరిస్థితులు అందుకు అనుకూలిస్తున్నట్లు కనిపించడం లేదు. ఒక పక్క ఇరుకు అపార్టుమెంట్లలో జీవనం, మరోపక్క ఉరుకులపరుగుల జీవితం.... వీటితో పెంపుడు జంతువులకి చోటు లేకుండా పోతోంది. ఇక పెంపుడు జంతువుల మీద ఉండే పరాన్నజీవులు, వాటి ధూళితో నానారకాల ఆరోగ్య సమస్యలూ వస్తాయని వినిపిస్తున్న హెచ్చరికలు సరేసరి! కానీ ఇందుకు విరుద్ధమైన పరిశోధన ఒకటి వెలుగులోకి వచ్చింది...   కెనడాకు చెందిన Anita Kozyrskyj అనే పరిశోధకురాలు తన బృందంతో కలిసి పిల్లల రోగనిరోధకశక్తి మీద పెంపుడు జంతువుల ప్రభావాన్ని అంచనా వేశారు. పిల్లలు తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచీ, ఈ లోకంలోకి వచ్చిన మూడు నెలల వరకూ... వారి ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే చాలా ఉపయోగమని గ్రహించారు. ఇలాంటి పిల్లలలో మున్ముందు ఆస్తమా వంటి అలెర్జీ సమస్యలు చాలా తక్కువగా నమోదయ్యాయట.   పెంపుడు జంతువులు ఇంట్లో ఉంటే Ruminococcus and Oscillospira అనే రెండు రకాల ఉపయోగకర సూక్ష్మజీవులు పిల్లలలో పెరగడాన్ని గమనించారు. ఈ రెండు సూక్ష్మజీవులూ కూడా శరీరంలో అలెర్జీలను, ఊబకాయాన్నీ నివారిస్తాయని తేలింది. బహుశా పెంపుడు జంతువుల ఒంటి మీద ఉండే క్రిములని ఎదుర్కొనే సందర్భంలో పిల్లల శరీరం ఇలాంటి సూక్ష్మజీవులను ఉత్పత్తి చేస్తూ ఉండవచ్చని భావిస్తున్నారు.   పసిపిల్లలు ఈ లోకంలోకి వచ్చాక పెంపుడు జంతువుల ప్రభావం ఉండవచ్చుగాక! కడుపులో ఉండగానే అవి ప్రభావం చూపడం ఏమిటి? అన్న అనుమానం రాకమానదు. ఆ సమయంలో తల్లి శరీరంలో ఉత్పత్తి అయ్యే క్రిములు వారి కడుపులో ఉన్న పిల్లలకు కూడా చేరడమే ఇందుకు కారణమని తేల్చారు. సిజేరియన్ ద్వారా బిడ్డ జన్మించినా, పిల్లలకు తల్లిపాలు పట్టకపోయినా కూడా ఈ తరహా రోగనిరోధకశక్తిలో ఎలాంటి మార్పూ కనిపించలేదు.   ఇంతకుముందు తరంలో పిల్లలు పెంపుడు జంతువులతో ఆడుకునేవారు, మట్టిలో దొర్లేవారు, ఏది పడితే అది కడుపు నిండా తినేవారు. కానీ ఇప్పుడు వారికి ఆ అవకాశమే లేదు. ఒకవేళ ఉన్నా... అది ప్రమాదం, ఇది మంచిది కాదు అంటూ నిరంతరం ఏవో ఒక హెచ్చరికలు అడ్డుకొంటూనే ఉన్నాయి. ఫలితం! వారి జీవితం ప్రకృతికి దూరంగా కృత్రిమంగా తయారైపోతోంది. శరీరం తనకు తానుగా రక్షించుకునే శక్తిని కోల్పోతోంది. ఇప్పుడు మళ్లీ ఒకో పరిశోధనా ఆ పాత రోజులే మంచివని గుర్తుచేస్తున్నాయి. కానీ ఈలోగా ఎన్ని విలువైన జీవితాలు వృధాగా మారిపోతున్నాయో కదా! - నిర్జర.  

read more
మందుని అందులో కలిపి తాగితే... ప్రమాదమే!

మద్యపానం ఆరోగ్యానికి హానికరం! అన్న హెచ్చరిక అన్నిచోట్లా కనిపిస్తూనే ఉంటుంది. ఆ హెచ్చరికను ఖాతరు చేయకుండా జనం పీపాల కొద్దీ మద్యాన్ని పట్టిస్తూనే ఉన్నారు. మన హీరోలు సైతం పనిగట్టుకుని ప్రతి సినిమాలోనూ మందు సన్నివేశంలో నటిస్తూనే ఉన్నారు. తాగితే తాగారు... కనీసం మోతాదుని పాటించమనీ, అందులో కలిపే పానీయాల విషయంలో జాగ్రత్త వహించమనీ సూచిస్తున్నారు నిపుణులు.   నీరు, సోడా వంటివాటితో కలిపి మద్యాన్ని పుచ్చుకోవడానికీ... కెఫిన్‌ అధికంగా ఉండే శీతలపానీయాలతో కలిపి పుచ్చుకోవడానికీ చాలా తేడా ఉందంటున్నారు. ఈ విషయంలో నిజానిజాలని నిరూపించేందుకు కెనడాకు చెందిన కొందరు శాస్త్రవేత్తలు నడుం కట్టారు. ఇందుకోసం వారు 1981 నుంచి 2016 వరకు జరిగిన ఓ 13 పరిశోధనల ఫలితాలను పరిశీలించారు.   మద్యం, కెఫిన్‌ రెండూ విరుద్ధమైన ఫలితాలని ఇస్తాయన్న విషయం తెలిసిందే! ఆల్కహాల్‌ మెదడుని మత్తులో ముంచితే, కెఫిన్‌ మనిషిని ఉత్తేజపరుస్తుంది. కానీ ఈమధ్యకాలంలో కెఫిన్‌ అధికంగా ఉండే ‘రెడ్‌బుల్‌’ వంటి ఎనర్జీ డ్రింక్స్ కలిపి మద్యం పుచ్చుకునే అలవాటు ఎక్కువవుతోంది. ఇక మౌంటెన్ డ్యూ వంటి శీతల పానీయాలలోనూ కెఫిన్‌ అధికంగానే ఉంటుంది. కెఫిన్‌కి తోడు వీటిలో చక్కెరలూ అధికంగానే ఉంటాయి. వీటిని మద్యంలో కలిపి తాగడం వల్ల, మనిషి మద్యం మోతాదుని దాటేస్తాడని కెనడా పరిశోధకులు తేల్చారు. ఒక పక్క శరీరం తూగుతున్నా, నిద్రపోకుండానే గడిపేస్తాడట. ఇలాంటి పరిస్థితి వల్ల తాగి గొడవపడటం, వాహనాలని నడపలేకపోవడం... వంటి పరిస్థితులూ తలెత్తే ప్రమాదం ఉంది.   మామూలుగానే కెఫిన్‌ను అధికంగా తీసుకోవద్దని నిపుణులు సూచిస్తుంటారు. కెఫిన్‌ పానీయాల వల్ల ఉద్వేగం ఎక్కువవుతుందనీ, రక్తపోటు పెరిగిపోతుందనీ, గుండె వేగం హెచ్చుతుందనీ హెచ్చరిస్తుంటారు. చిన్నపిల్లలు, గర్భవతులు, పిల్లలకు పాలిచ్చే తల్లులు కెఫిన్‌కి వీలైనంత దూరంగా ఉండాలని చెబుతారు. అలాంటిది కెఫిన్, చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలతో కలిపి మద్యాన్ని పుచ్చుకుంటే...   - నిర్జర. 

read more
వేసవితో మనసు చెడిపోతుంది

  వేసవికాలంతో రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలుసు. డీహైడ్రేషన్ వంటి సందర్భాలలో ఈ సమస్యలు మెదడు మీద కూడా ప్రభావం కలిగిస్తాయన్న విషయమూ తెలుసు. కానీ ఎండాకాలం క్రుంగుబాటు, మతిభ్రమణం వంటి మానసిక సమస్యలు తీవ్రతరం అవుతాయని ఎప్పుడన్నా విన్నారా!   వియత్నాంలో మానసిక రుగ్మతలకు చికిత్సను అందించే  Hanoi అనే ఆసుపత్రి ఉంది. ఈ ఆసుపత్రిలో చేరే రోగుల సంఖ్యకీ ఎండలకీ మధ్య ఏమన్నా సంబంధం ఉందేమో అన్న అనుమానం వచ్చింది ఓ పరిశోధకునికి. దాంతో 2008 నుంచి 2012 వరకు ఓ ఐదేళ్ల పాటు అక్కడ చేరిన రోగుల వివరాలను సేకరించాడు. వీటిని విశ్లేషించగా ఆశ్చర్యకరమైన ఫలితాలు తేలాయి. - వేసవిలోని ఒక మూడు నుంచి ఏడు రోజుల వరకూ అధికంగా ఉష్ణోగ్రతలు నమోదైతే... మానసిక సమస్యలతో ఆసుపత్రిలో చేరే రోగుల సంఖ్య కూడా పెరిగిందట. - చలికాలంతో పోలిస్తే వేసవికాలంలో ఆసుపత్రిలో చేరే రోగుల సంఖ్య 24 శాతం ఎక్కువగా ఉంది. - సాధారణంకంటే ఒక్క శాతం ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నా కూడా ఆసుపత్రిలో రెండు శాతం ఎక్కువ రోగులు చేరుతున్నారు. - మూడురోజులకు మించి వడగాలులు వీచినప్పటికంటే వారంపాటు విడవకుండా వడగాలి వీచినప్పుడు రెట్టింపు రోగులు మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. - వృద్ధులు, నగరాలలో ఉండేవారు వేసవితో త్వరగా అనారోగ్యం పాలవుతున్నట్లు తేలింది.   వాతావరణంలోని అధిక ఉష్ణోగ్రతల మన మెదడు మీద ఇంతగా ప్రభావం చూపుతాయని ఎవరూ ఊహించి ఉండరు. కానీ తాజా పరిశోధనతో వేసవిలో కాస్త జాగ్రత్తగా ఉండాలన్న సూచన వినిపిస్తోంది. అంతేకాదు! గ్లోబల్‌ వార్మింగ్‌ వల్ల ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయనీ... వీటి ప్రభావం మన మెదడు మీద ఉండే అవకాశం ఉందని కూడా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.   ఈ పరిశోధన వియత్నాంలో జరిగినప్పటికీ మన దేశంలో ఇంతకంటే దారుణమైన ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వియత్నాంలో వేసవికాలం పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకి మించవు. మరి మన దగ్గరేమో 40కి తగ్గవు. ఇక వడగాడ్పుల గురించి చెప్పేదేముంది!   - నిర్జర.

read more
బి విటమిన్‌తో కాలుష్యం నుంచి రక్షణ

వాయుకాలుష్యం గురించి మళ్లీ చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది. పరిశ్రమలు, వాహనాల కారణంగా గాల్లోకి విపరీతంగా ధూళికణాలు చేరుకుంటున్న విషయం అందరూ మొత్తుకొంటున్నదే! మొహానికి మాస్క్‌ వేసుకోవడం తప్ప ఈ కాలుష్యం నుంచి తప్పించుకునేందుకు మరో మార్గం లేదని అందరూ నమ్మేవారు. కానీ బి విటమిన్‌తో, కాలుష్యం కలిగించే హాని నుంచి తప్పించుకోవచ్చునని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది.   ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం దాదాపు 90 శాతం మంది ప్రజలు పరిమితి మించిన కాలుష్యం ఉన్న ప్రాంతాలలో నివసిస్తున్నారు. ఈ కాలుష్యంలో ఉండే ధూళికణాలని P.M అనే పరిమాణంలో లెక్క వేస్తారు. ఒక ప్రాంతంలోని ధూళి కణాలు 2.5 P.M కంటే తక్కువ ఉంటే... అక్కడి ప్రజలు మృత్యువుతో కలిసి జీవిస్తున్నట్లే! మన వెంట్రుకలో 30వ వంతు ఉండే ఈ ధూళి కణాలు నేరుగా మన ఊపిరితిత్తులలోకి చేరిపోతాయి.   ఊపిరితిత్తులలోకి చేరిన ధూళికణాలు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులకు దారితీస్తాయి. పసిపిల్లల పాలిట అయితే ప్రాణాంతకంగా మారతాయి. ఈ ధూళికణాలు నేరుగా మెదడులోకి కూడా చేరతాయనే ఈమధ్యే మరో పరిశోధన తేల్చింది. దీంతో మెదడులో ఊహించన మార్పులు జరుగుతాయనీ... మన ఆలోచనా సామర్థ్యం, జ్ఞాపకశక్తి మీద తీవ్ర ప్రభావం చూపుతాయనీ చెబుతున్నారు. ఇక శరీరంలోని చేరిన ధూళికణాలు ఏకంగా మన జన్యువుల పనితీరునే మార్చివేస్తాయన్నది మరో విశ్లేషణ. దీనివల్ల మన రోగనిరోధక శక్తి తీవ్రంగా దెబ్బతిని ఏకంగా కేన్సర్‌ వంటి వ్యాధులు దాడిచేసే ప్రమాదం ఉంది.   ఇదంతా కూడా వాయుకాలుష్యం వల్ల జరిగే అనర్థం. రోజూ పొట్ట చేతపట్టుకుని తిరిగేవారు ఈ అనర్థాల నుంచి తప్పించుకోవడం అసాధ్యం. అయితే బి విటమిన్‌ సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల కాలుష్య కోరల నుంచి తప్పించుకోవచ్చునని ఓ పరిశోధన నిరూపిస్తోంది. ఈ విషయాన్నే నిరూపించేందుకు అమెరికాలోని పరిశోధకులు కొంతమందికి ఫోలిక్‌ యాసిడ్‌, B6, B12 ఉన్న మందులను అందించారు. ఆ తరువాత వీరిని 2.5P.M ధూళికణాలు ఉన్న వాతావరణంలోకి పంపించారు. ఆశ్చర్యకరంగా వీరి జన్యువుల మీద ఈ ధూళికణాల ప్రభావం దాదాపు 76 శాతం తగ్గిపోయినట్లు తేలింది.   కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు బీ విటమిన్‌ తోడ్పడుతుందని తేలడం ఇదే తొలిసారి. కాబట్టి ఈ విషయమై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంటుంది. ఏది ఏమైనా బీ విటమిన్‌ వంటి పోషకాలు అధికంగా ఉండే దంపుడు బియ్యం, పాలు, గుడ్లు, కాయగూరలని తరచూ తీసుకోవడం వల్ల అపరిమితమైన ఆరోగ్యం దక్కుతుందని వేరే చెప్పనవసరం లేదు. ఇక వాటిలోని పోషకాలు ఏకంగా కాలుష్యపు కోరల నుంచి రక్షిస్తాయంటే ఇక చెప్పేదేముంది.   - నిర్జర.

read more
యాంటీబయాటిక్స్ ప్రాణాంతకమా!

యాంటీబయాటిక్స్ ప్రపంచానికి చేసిన మేలు అంతాఇంతా కాదు. అవే కనుక లేకపోతే చిన్నపాటి చెవిపోటు కూడా ప్రాణాంతకంగా మారిపోయే అవకాశం ఉంది. కానీ రోజులు గడుస్తున్నా కొద్దీ- యాంటీబయాటిక్స్ను విచ్చలవిడిగా వాడేస్తున్నారనే అపవాదు మొదలవుతోంది. దీని వల్ల సూక్ష్మజీవులు మొండిబారిపోవడమే కాకుండా, జీర్ణాశయంలోని ఉపయోగపడే బ్యాక్టీరియా కూడా నాశనం అయిపోతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇది నిజమేనని సూచించే పరిశోధన ఒకటి వెలుగులోకి వచ్చింది.   టెక్సాస్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తేనెటీగల మీద యాంటీబయాటిక్స్ ప్రభావం ఎలా ఉంటుందో చూడాలనుకున్నారు. అందుకోసం విశ్వవిద్యాలయం పైన ఉన్న తేనెపట్టులలోంచి కొన్ని తేనెటీగలను ల్యాబొరేటరీలోకి తీసుకువచ్చారు. వాటిలో కొన్నింటికి సాధారణ పంచదార నీళ్లు తాగించారు. వీటికి ఆకుపచ్చ రంగు చుక్కని అంటించారు. మరికొన్నింటికి టెట్రాసైక్లిన్ అనే సాధారణ యాంటీబయాటిక్ కలిపిన నీరు తాగించారు. వీటికి గులాబీ రంగు చుక్కని అంటించారు. ఇలా చేసిన తరువాత తిరిగి ఆ తేనెటీగలన్నింటినీ కూడా వాటి పట్టు దగ్గర వదిలిపెట్టేశారు.     కొన్ని రోజుల తరువాత తేనెపట్టు దగ్గరకి వెళ్లి పరిశీలిస్తే... యాంటీబయాటిక్స్ స్వీకరించిన తేనెటీగలలో మూడోవంతు మాత్రమే బతికి ఉన్నాయి. సాధారణ పంచదార నీళ్లు తాగిన తేనెటీగలు మాత్రం ఎక్కువశాతం ఆరోగ్యంగానే ఉన్నాయి. తేనెటీగలలో యాంటీబయాటిక్స్ వాడటం వల్ల వాటి జీర్ణవ్యవస్థలోని మంచి బ్యాక్టీరియా నాశనం అయిపోయినట్లు గ్రహించారు. ఈ కారణంగా ‘సెరాటియా’ అనే హానికారక సూక్ష్మజీవి వాటి మీద దాడి చేసే అవకాశం చిక్కింది.   యాంటీబయాటిక్స్ వాడకం వల్ల తేనెటీగలలో కనిపించిన ఫలితమే మనుషులకి అన్వయిస్తుందని ఖచ్చితంగా చెప్పలేకపోవచ్చు. కానీ రెండు జీవులకీ మధ్య చాలా పోలికలు ఉన్నాయి. తేనటీగలకి మల్లే మనుషుల జీర్ణాశయంలో కూడా ‘గట్ బ్యాక్టీరియా’ అనే మంచి బ్యాక్టీరియా నివసిస్తుంది. ఈ గట్ బ్యాక్టీరియా దెబ్బతిన్నప్పుడు ‘సెరాటియా’ అనే హానికారక జీవి మనిషిని కూడా నాశనం చేస్తుంది.   తేనెటీగల పెంపకంలో కూడా యాంటీబయాటిక్స్ వాడకం విపరీతంగా ఉంటుంది. వాటిలోని ‘foulbrood’ అనే వ్యాధిని నివారించేందుకు యాంటీబయాటిక్స్ను వాడుతుంటారు. ఈమధ్యకాలంలో తేనెపట్టులో ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా మాయమైపోతుండటం వాటి పెంపకందారులు గమనించారు. దానికి కారణం ఏమిటో తెలియక తలలు పట్టుకునేవారు. కానీ యాంటీబయాటిక్స్ వాడటం వల్లే వాటి జనాభా నశించిపోతోందని ఈ పరిశోధన రుజువుచేస్తోంది. ఇక మీదట పెంపకందారులు యాంటీబయాటిక్స్ వాడకంలో కాస్త విచక్షణ చూపించాలని కోరుతున్నారు పరిశోధకులు. అంతేకాదు! మున్ముందు మనుషులు కూడా అత్యవసర పరిస్థితులలోన యాంటీబయాటిక్స్ వాడాలని సూచిస్తున్నారు. యాంటీబయాటిక్ రెండువైపులా పదును ఉన్న కత్తిలాంటి ఆయుధమని గుర్తుచేస్తున్నారు. - నిర్జర.  

read more
పిల్లలు అన్యాయంగా చనిపోతున్నారు

ఈ లోకంలో పిల్లల్ని మించిన ఆస్తి మరేముంటుంది. ప్రపంచం ఎంత అభివృద్ధి సాధించినా, ఎటు దూసుకు పోతున్నా... అందులో పిల్లలు సంతోషంగా లేకపోతే ఉపయోగం ఏముంటుంది. కానీ ఇప్పుడు ఆ పిల్లలనే మనం చేజేతులారా దూరం చేసుకుంటున్నామని తెలుస్తోంది.   - ఐదేళ్లలోపు పిల్లలలో ఏటా దాదాపు 17 లక్షల మంది నిష్కారణంగా చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చెబుతోంది. వాయు కాలుష్యం, ఇతరులు తాగే సిగిరెట్ పొగని పీల్చడం (second hand smoke), వాతావరణ కాలుష్యం, ఆహారంలో రసాయనాలు చేరడం, అపరిశుభ్రమైన నీరు... ఇలా రకరకాల నిర్లక్ష్య ధోరణుల మధ్య వారు చనిపోతున్నారని అంచనా వేస్తున్నారు. - పిల్లలలో రోగనిరోధకశక్తి చాలా బలహీనంగా ఉంటుంది. వారి అవయవాలేమో చిన్నగా, అల్పంగా ఉంటాయి. దాని వల్ల చిన్నతనంలోనే నిమోనియా, ఆస్తమా వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతూ ఉంటారు. - గాలి సంగతి అలా ఉంచితే తాగే నీరు కలుషితం కావడం వల్ల కూడా లక్షలాదిమంది పిల్లుల డయేరియా బారిన పడుతున్నట్లు చెబుతోంది WHO. 2012లో ఇలా డయేరియా ద్వారా 3,61,000 మంది పిల్లలు చనిపోయారట. నీరు కలుషితం కావడం వల్ల దోమల ద్వారా వ్యాపించే రోగాలు కూడా అదుపుతప్పుతున్నాయి. మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులను తట్టుకోవడం పిల్లల వల్ల కావడం లేదు. - గాలి, నీరే కాదు. పిల్లలకు పరిశుభ్రమైన ఆహారం కూడా అందడం లేదన్నది WHO విశ్లేషణ. క్రిమిసంహారక మందులు, ప్లాస్టిక్‌ వంటి పదార్థాలలోని హానికారకమైన రసాయనాలు ఆహారంలోకి చేరిపోతున్నాయట. ఇలా ఆర్సెనిక్‌, లెడ్‌, ఫ్లోరైడ్‌, పాదరసం వంటివన్నీ ఆహారం ద్వారా పిల్లల శరీరంలోకి చేరుతున్నాయి. వీటిలో కొన్ని రసాయనాలు పిల్లల్లోని ఎండోక్రైన్‌ వ్యవస్థను దెబ్బతీస్తాయి. దీంతో లివర్, థైరాయిడ్‌, నరాలు దెబ్బతినిపోతాయి. - వాహనాల నుంచి వచ్చే కాలుష్యం, పెద్దవారు పొగ తాగుతున్నప్పుడు పీల్చాల్సి రావడం... ఆఖరికి ఇంటి నాలుగుగోడల మధ్యా పేరుకుపోతున్న దుమ్ము కూడా పిల్లల్లో ఆస్తమా రావడానికీ కారణం అవుతోందట. - గ్లోబల్‌ వార్మింగ్‌ కూడా పిల్లల జీవితాల మీద తీవ్రమైన ప్రభావం చూపుతోందని WHO చెబుతోంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల వాతావరణంలోని కార్బన్‌ వాయువులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వీటి వల్ల పూలల్లో పుప్పొడి ఎక్కువగా పెరుగుతుందట. ఈ పుప్పొడి కారణంగా పిల్లల్లో ఆస్తమా శృతి మించుతోంది. అంతేకాదు! ఉష్ణోగ్రతలలో వచ్చే అసాధారణమైన మార్పుల వల్ల అంటువ్యాధులు కూడా త్వరగా ప్రబలే ప్రమాదం ఉంది. - పైన పేర్కొన్నవన్నీ మనం తరచూ వింటున్న ప్రమాదాలే! కానీ ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల వల్ల కూడా పిల్లల జీవితాలు కడదేరిపోతున్నాయని చెబుతోంది WHO. ఎప్పటికప్పుడు కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నా electronic wastage వల్ల పిల్లలలో ఊపిరితిత్తులు దెబ్బతినడం దగ్గర నుంచీ కేన్సర్‌ వరకూ ప్రాణాంతక వ్యాధులు కమ్ముకుంటున్నాయని హెచ్చరిస్తోంది. ఇంతకాలమూ కాలుష్యం అనేది కేవలం పర్యావరణానికి సంబంధించినదో లేకపోతే పెద్దవారికి సంబంధించినదో అని భావించేవారు. కానీ మన కంటిముందే ఆ కాలుష్యం పసిపిల్లల జీవితాలని చిదిమేస్తోందని హెచ్చరికలు అందుతున్నాయి. మరి ఈ హెచ్చరికలని ప్రభుత్వాలు పట్టించుకుంటాయా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. అప్పటివరకూ మన చిన్నారులని మనమే ఎలాగొలా కాలుష్యం నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.   - నిర్జర.

read more
గోధుమరొట్టెలతో అసలుకే మోసం!

  ఆరోగ్యం గురించి బోలెడు విషయాలు తెలుసు అని మనలో ప్రతి ఒక్కరి నమ్మకం. అందుకే ఎవరన్నా ఏదన్నా సమస్యని చెప్పగానే ఓ వైద్యుడిలాగా మారిపోయి తెగ సలహాలు ఇచ్చేస్తుంటాం. కానీ ఇలాంటి అరకొర నమ్మకాలతోనే మన జీవితాలు పాడైపోతున్నాయని నిపుణులు తలబాదుకుంటున్నారు. అలాంటి ఓ పే...ద్ద నమ్మకమే - గోధుమ రొట్టెలు తినడం చాలా మంచిది అనే మాట!   ఊదరగొట్టేశారు   ఎవరన్నా తమ ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధగా ఉంచేందుకు చేసే మొదటి ప్రయత్నం రాత్రివేళల్లో గోధుమ రొట్టెలని తినడం. ముఖ్యంగా డయాబెటిస్ రోగులు లేదా వయసు మీద పడినవారు ఇప్పుడు రాత్రియితే అన్నం ముట్టుకోకుండా చపాతీలనే తింటున్నారు. ఇదంతా ఈ మధ్యకాలంలో కనిపిస్తున్న మార్పు మాత్రమే. ఈ మార్పు వెనుక ఆరోగ్య కారణాల కంటే వ్యాపార సంస్థలు చేసిన ప్రకటనలే ప్రభావం చూపాయంటున్నారు నిపుణులు.   సమస్యలు ఎక్కువే!   బియ్యంతో పోలిస్తే గోధుమలని అరాయించుకోవడంలో చాలా సమస్యలు ఉంటాయి. Celiac Disease, Wheat Allergy, Gluten Sensitivity వంటి ఇబ్బందులతో మన శరీరం తెగ సతమతం అయిపోతుంది. వీటివల్ల తలనొప్పి దగ్గర్నుంచీ విరేచనాల వరకూ నానారకాల సమస్యలు తలెత్తుతాయి. దురదృష్టవశాత్తూ ఈ సమస్యల వెనుక కారణం గోధుమలతో చేసిన ఆహారం అన్న విషయం చాలామందికి తెలియదు. అసలు 90 శాతానికి పైగా జనానికి, తమకి గోధుమలు పడవు అన్న విషయమే తెలియదట.   ఒకవేళ సరిపడినా!   గోధుమలు ఒకవేళ మన ఒంటికి సరిపడతాయే అనుకుందాం. అప్పుడు కూడా అవేమంత ఆరోగ్యకరం కాదంటున్నారు. గోధుమలలో gluten, gliadin అనే ప్రొటీన్లు ఉంటాయి. గోధుమ బంకగా ఉండటానికి gluten కారణమవుతుంది. ఇది మన పేగులకు అంటుకుని ఓ పట్టాన జీర్ణం కాదట. తరచూ ఇలా గ్లుటెన్తో మన పేగులకి పరీక్ష పెట్టడం వల్ల నిదానంగా వాటి శక్తి క్షీణించిపోతుందని హెచ్చరిస్తున్నారు. దీని వలన జీర్ణశక్తి మందగించడమే కాకుండా, శరీరానికి అవసరమయ్యే పోషకాలను శోషించుకునే గుణాన్ని కూడా పేగులు కోల్పోతాయి. ఇక గోధుమలు ఒక వ్యసనంలా మారే ప్రమాదం ఉందన్న హెచ్చరికలూ వినిపిస్తున్నాయి. వీటిలో ఉన్న gliadin అనే ప్రొటీన్ వల్ల రోజూ గోధుమలని తినాలని శరీరానికి అనిపిస్తూ ఉంటుందట.   షుగర్ కూడా హుళుక్కే!   గోధుమ రొట్టెలని తినడం వల్ల షుగర్ అదుపులో ఉంటుదన్నది ఓ ప్రధానమైన నమ్మకం. కానీ ఇందులో కూడా వాస్తవం లేదంటున్నారు. గోధుమలు తిన్న వెంటనే వాటిలోని చక్కెర ఒక్కసారిగా రక్తంలోకి చేరిపోతుందట. ముఖ్యంగా బ్రెడ్, రిఫైన్డ్ గోధుమలతో మనలోని చక్కెన నిల్వలు అకస్మాత్తుగా పెరిగిపోతాయి. ఇది డయాబెటిస్కు దారితీస్తుంది. ఆహారం తిన్న తరువాత అందులోని చక్కెర మన రక్తంలోకి చేరుకునే విధానాన్ని కొలిచేందుకు ‘glycemic index’ అంటారు. ఇది బియ్యంతో పోలిస్తే గోధుమ పదార్థాలలో పెద్ద తేడాగా ఏమీ కనిపించదు.   హైబ్రీడు విత్తనాలు - రిఫైన్డ్ పిండి   ఇప్పుడు మనకి లభిస్తున్న గోధుమపిండి మరో ముఖ్య సమస్య. ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందనో, పిండి మెత్తగా ఉంటుందనో... కారణం ఏదైతేనేం, ఇప్పుడంతా హైబ్రీడు గోధుమ విత్తనాలను వాడుతున్నారు. వీటివల్ల శరీరంలోని రోగనిరోధక శక్తిని దెబ్బతీసేలా ఆటోఇమ్యూన్ వ్యాధులు వచ్చే ప్రమాదం లేకపోలేదు. ఇక రొట్టెలు రుచిగా, మృదువుగా ఉండేందుకు వీటిని వీలైనంత రిఫైన్ చేస్తున్నారు. ఇలాంటి గోధుమ రొట్టెలు ఎంతవరకు ఆరోగ్యమో ప్రత్యేకించి చెప్పేదేముంది!!!   అదన్నమాట సంగతి! అంచేతా గోధుమ రొట్టెలో గోధుమ రొట్టెలో అని తెగ తపించిపోకుండా... వేరే ప్రత్యామ్నాయాల ద్వారా తగినంత పోషకాలను సాధిస్తూ ఆరోగ్యాన్ని అదుపులో ఉంచుకోమని సూచిస్తున్నారు. ముతక బియ్యం, తాజా కూరగాయలు, కాలానికి అనుగుణంగా దొరికే పండ్లు తీసుకుంటూ తగినంత వ్యాయామం చేయమన్నది నిపుణులు మాట. - నిర్జర.    

read more