చిరుతిళ్ల రహస్యం తెలిసిపోయింది

  పిజ్జా, బర్గర్, శాండ్విచ్... ఇవన్నీ ఒకప్పుటి తరానికి తెలియవు. ఇప్పటి తరానికి మాత్రం ఇవి లేనిదే రోజు గడవదు. కొందరు అడపాదడపా వీటిని రుచిచూసేందుకు సిద్ధపడితే, మరికొందరేమో ఇవి లేకుండా జీవితం వృధా అన్నంత వ్యసనంతో బతికేస్తుంటారు. జంక్ఫుడ్స్ పట్ల కొందరు ఎందుకంత కోరిక పెంచుకుంటారు? ఈ విషయం మీదే షికాగోలోని ఓ విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణులు పరిశోధన నిర్వహించారు.   జంక్ఫుడ్స్కీ నిద్రలేమికీ మధ్య సంబంధం ఉందేమో అన్న అనుమానం చాలా రోజుల నుంచీ పరిశోధకులను వేధిస్తోంది. ఈ విషయాన్నే నిరూపించేందుకు నిపుణులు నడుం కట్టారు. ఇందుకోసం వారు ఓ బృందాన్ని ఎన్నుకొన్నారు. వీరిలో కొందరిని రోజులో కేవలం నాలుగు గంటలు మాత్రమే పడుకోమని చెప్పారు. మరికొందరేమో నిరభ్యంతరంగా ఎనిమిదేసి గంటలు పడుకోవచ్చునని సూచించారు. ఇలా నిద్రపోయి లేచిన తరువాత, వారందరికీ రకరకాల వాసనలు చూపించారు. ఆశ్చర్యకరంగా తక్కువసేపు నిద్రపోయిన లేచినవారు... ఘాటైన వాసనలకు త్వరగా ప్రతిస్పందిస్తున్నట్లు తేలింది. కస్టమర్లను ఆకర్షించేందుకు జంక్ఫుడ్స్ని రకరకాల మసాలాలతో ముంచెత్తేస్తారన్న విషయం తెలిసిందే కదా!   నిద్రలేమికీ, జంక్ఫుడ్స్ పట్ల కోరికకీ మధ్య ఉన్న సంబంధం ఈ పరిశోధనతో తేలిపోయింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసేవారు ఈ తరహా ఆహారాన్ని ఇష్టపడేందుకు బహుశా ఇదే కారణం కావచ్చు. ఎటూకాని పనివేళలు, సరిగా నిద్రపోనీయని ఒత్తిడి కారణంగా వీరు జంక్ఫుడ్స్ పట్ల మొగ్గు చూపుతారేమో!   నిద్రలేమి వల్ల పనికిమాలిన తిండికి అలవాటు పడటం ఒక ప్రమాదమైతే... అసలు మనం తీసుకునే కొన్ని రకాల ఆహారం ఆ నిద్రలేమికి కారణం కావడం మరో విచిత్రం. కొవ్వు, మాంసకృత్తులు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల సరిగా నిద్రపట్టదని నిపుణులూ హెచ్చరిస్తూ ఉంటారు. కానీ మనం రాత్రిపూట ఇలాంటి ఆహారాన్నే తీసుకోవడం గమనార్హం. అంటే తగిన ఆహారం తీసుకోకపోవడం వల్ల నిద్రపట్టకపోవడం, అలా నిద్రపట్టకపోవడం వల్ల మళ్లీ జంక్ ఫుడ్స్కి మొగ్గుచూపడం... ఇదంతా ఒక విషవలయంలాగా మారిపోతోందన్నమాట!   జంక్ ఫుడ్స్ వల్ల ఊబకాయం, రక్తపోటు, డయాబెటిస్, కొలెస్ట్రాల్, డిప్రెషన్, మలబద్ధకం... వంటి నానారకాల సమస్యలూ తలెత్తుతాయన్న విషయం తెలిసిందే! మరి జిహ్వచాపల్యానికి లొంగిపోయి ఇన్నేసి రోగాలను కోరితెచ్చుకోవడమో, ఆయుష్షు కోసం ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవడమో మన చేతుల్లోనే ఉంది. - నిర్జర.    

read more
పెంపుడు జంతువులతో రోగనిరోధకశక్తి పెరుగుతుంది

  ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే ఆ మానసిక ప్రశాంతతే వేరు! కానీ ఇప్పడు పరిస్థితులు అందుకు అనుకూలిస్తున్నట్లు కనిపించడం లేదు. ఒక పక్క ఇరుకు అపార్టుమెంట్లలో జీవనం, మరోపక్క ఉరుకులపరుగుల జీవితం.... వీటితో పెంపుడు జంతువులకి చోటు లేకుండా పోతోంది. ఇక పెంపుడు జంతువుల మీద ఉండే పరాన్నజీవులు, వాటి ధూళితో నానారకాల ఆరోగ్య సమస్యలూ వస్తాయని వినిపిస్తున్న హెచ్చరికలు సరేసరి! కానీ ఇందుకు విరుద్ధమైన పరిశోధన ఒకటి వెలుగులోకి వచ్చింది...   కెనడాకు చెందిన Anita Kozyrskyj అనే పరిశోధకురాలు తన బృందంతో కలిసి పిల్లల రోగనిరోధకశక్తి మీద పెంపుడు జంతువుల ప్రభావాన్ని అంచనా వేశారు. పిల్లలు తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచీ, ఈ లోకంలోకి వచ్చిన మూడు నెలల వరకూ... వారి ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే చాలా ఉపయోగమని గ్రహించారు. ఇలాంటి పిల్లలలో మున్ముందు ఆస్తమా వంటి అలెర్జీ సమస్యలు చాలా తక్కువగా నమోదయ్యాయట.   పెంపుడు జంతువులు ఇంట్లో ఉంటే Ruminococcus and Oscillospira అనే రెండు రకాల ఉపయోగకర సూక్ష్మజీవులు పిల్లలలో పెరగడాన్ని గమనించారు. ఈ రెండు సూక్ష్మజీవులూ కూడా శరీరంలో అలెర్జీలను, ఊబకాయాన్నీ నివారిస్తాయని తేలింది. బహుశా పెంపుడు జంతువుల ఒంటి మీద ఉండే క్రిములని ఎదుర్కొనే సందర్భంలో పిల్లల శరీరం ఇలాంటి సూక్ష్మజీవులను ఉత్పత్తి చేస్తూ ఉండవచ్చని భావిస్తున్నారు.   పసిపిల్లలు ఈ లోకంలోకి వచ్చాక పెంపుడు జంతువుల ప్రభావం ఉండవచ్చుగాక! కడుపులో ఉండగానే అవి ప్రభావం చూపడం ఏమిటి? అన్న అనుమానం రాకమానదు. ఆ సమయంలో తల్లి శరీరంలో ఉత్పత్తి అయ్యే క్రిములు వారి కడుపులో ఉన్న పిల్లలకు కూడా చేరడమే ఇందుకు కారణమని తేల్చారు. సిజేరియన్ ద్వారా బిడ్డ జన్మించినా, పిల్లలకు తల్లిపాలు పట్టకపోయినా కూడా ఈ తరహా రోగనిరోధకశక్తిలో ఎలాంటి మార్పూ కనిపించలేదు.   ఇంతకుముందు తరంలో పిల్లలు పెంపుడు జంతువులతో ఆడుకునేవారు, మట్టిలో దొర్లేవారు, ఏది పడితే అది కడుపు నిండా తినేవారు. కానీ ఇప్పుడు వారికి ఆ అవకాశమే లేదు. ఒకవేళ ఉన్నా... అది ప్రమాదం, ఇది మంచిది కాదు అంటూ నిరంతరం ఏవో ఒక హెచ్చరికలు అడ్డుకొంటూనే ఉన్నాయి. ఫలితం! వారి జీవితం ప్రకృతికి దూరంగా కృత్రిమంగా తయారైపోతోంది. శరీరం తనకు తానుగా రక్షించుకునే శక్తిని కోల్పోతోంది. ఇప్పుడు మళ్లీ ఒకో పరిశోధనా ఆ పాత రోజులే మంచివని గుర్తుచేస్తున్నాయి. కానీ ఈలోగా ఎన్ని విలువైన జీవితాలు వృధాగా మారిపోతున్నాయో కదా! - నిర్జర.  

read more
మందుని అందులో కలిపి తాగితే... ప్రమాదమే!

మద్యపానం ఆరోగ్యానికి హానికరం! అన్న హెచ్చరిక అన్నిచోట్లా కనిపిస్తూనే ఉంటుంది. ఆ హెచ్చరికను ఖాతరు చేయకుండా జనం పీపాల కొద్దీ మద్యాన్ని పట్టిస్తూనే ఉన్నారు. మన హీరోలు సైతం పనిగట్టుకుని ప్రతి సినిమాలోనూ మందు సన్నివేశంలో నటిస్తూనే ఉన్నారు. తాగితే తాగారు... కనీసం మోతాదుని పాటించమనీ, అందులో కలిపే పానీయాల విషయంలో జాగ్రత్త వహించమనీ సూచిస్తున్నారు నిపుణులు.   నీరు, సోడా వంటివాటితో కలిపి మద్యాన్ని పుచ్చుకోవడానికీ... కెఫిన్‌ అధికంగా ఉండే శీతలపానీయాలతో కలిపి పుచ్చుకోవడానికీ చాలా తేడా ఉందంటున్నారు. ఈ విషయంలో నిజానిజాలని నిరూపించేందుకు కెనడాకు చెందిన కొందరు శాస్త్రవేత్తలు నడుం కట్టారు. ఇందుకోసం వారు 1981 నుంచి 2016 వరకు జరిగిన ఓ 13 పరిశోధనల ఫలితాలను పరిశీలించారు.   మద్యం, కెఫిన్‌ రెండూ విరుద్ధమైన ఫలితాలని ఇస్తాయన్న విషయం తెలిసిందే! ఆల్కహాల్‌ మెదడుని మత్తులో ముంచితే, కెఫిన్‌ మనిషిని ఉత్తేజపరుస్తుంది. కానీ ఈమధ్యకాలంలో కెఫిన్‌ అధికంగా ఉండే ‘రెడ్‌బుల్‌’ వంటి ఎనర్జీ డ్రింక్స్ కలిపి మద్యం పుచ్చుకునే అలవాటు ఎక్కువవుతోంది. ఇక మౌంటెన్ డ్యూ వంటి శీతల పానీయాలలోనూ కెఫిన్‌ అధికంగానే ఉంటుంది. కెఫిన్‌కి తోడు వీటిలో చక్కెరలూ అధికంగానే ఉంటాయి. వీటిని మద్యంలో కలిపి తాగడం వల్ల, మనిషి మద్యం మోతాదుని దాటేస్తాడని కెనడా పరిశోధకులు తేల్చారు. ఒక పక్క శరీరం తూగుతున్నా, నిద్రపోకుండానే గడిపేస్తాడట. ఇలాంటి పరిస్థితి వల్ల తాగి గొడవపడటం, వాహనాలని నడపలేకపోవడం... వంటి పరిస్థితులూ తలెత్తే ప్రమాదం ఉంది.   మామూలుగానే కెఫిన్‌ను అధికంగా తీసుకోవద్దని నిపుణులు సూచిస్తుంటారు. కెఫిన్‌ పానీయాల వల్ల ఉద్వేగం ఎక్కువవుతుందనీ, రక్తపోటు పెరిగిపోతుందనీ, గుండె వేగం హెచ్చుతుందనీ హెచ్చరిస్తుంటారు. చిన్నపిల్లలు, గర్భవతులు, పిల్లలకు పాలిచ్చే తల్లులు కెఫిన్‌కి వీలైనంత దూరంగా ఉండాలని చెబుతారు. అలాంటిది కెఫిన్, చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలతో కలిపి మద్యాన్ని పుచ్చుకుంటే...   - నిర్జర. 

read more
వేసవితో మనసు చెడిపోతుంది

  వేసవికాలంతో రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలుసు. డీహైడ్రేషన్ వంటి సందర్భాలలో ఈ సమస్యలు మెదడు మీద కూడా ప్రభావం కలిగిస్తాయన్న విషయమూ తెలుసు. కానీ ఎండాకాలం క్రుంగుబాటు, మతిభ్రమణం వంటి మానసిక సమస్యలు తీవ్రతరం అవుతాయని ఎప్పుడన్నా విన్నారా!   వియత్నాంలో మానసిక రుగ్మతలకు చికిత్సను అందించే  Hanoi అనే ఆసుపత్రి ఉంది. ఈ ఆసుపత్రిలో చేరే రోగుల సంఖ్యకీ ఎండలకీ మధ్య ఏమన్నా సంబంధం ఉందేమో అన్న అనుమానం వచ్చింది ఓ పరిశోధకునికి. దాంతో 2008 నుంచి 2012 వరకు ఓ ఐదేళ్ల పాటు అక్కడ చేరిన రోగుల వివరాలను సేకరించాడు. వీటిని విశ్లేషించగా ఆశ్చర్యకరమైన ఫలితాలు తేలాయి. - వేసవిలోని ఒక మూడు నుంచి ఏడు రోజుల వరకూ అధికంగా ఉష్ణోగ్రతలు నమోదైతే... మానసిక సమస్యలతో ఆసుపత్రిలో చేరే రోగుల సంఖ్య కూడా పెరిగిందట. - చలికాలంతో పోలిస్తే వేసవికాలంలో ఆసుపత్రిలో చేరే రోగుల సంఖ్య 24 శాతం ఎక్కువగా ఉంది. - సాధారణంకంటే ఒక్క శాతం ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నా కూడా ఆసుపత్రిలో రెండు శాతం ఎక్కువ రోగులు చేరుతున్నారు. - మూడురోజులకు మించి వడగాలులు వీచినప్పటికంటే వారంపాటు విడవకుండా వడగాలి వీచినప్పుడు రెట్టింపు రోగులు మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. - వృద్ధులు, నగరాలలో ఉండేవారు వేసవితో త్వరగా అనారోగ్యం పాలవుతున్నట్లు తేలింది.   వాతావరణంలోని అధిక ఉష్ణోగ్రతల మన మెదడు మీద ఇంతగా ప్రభావం చూపుతాయని ఎవరూ ఊహించి ఉండరు. కానీ తాజా పరిశోధనతో వేసవిలో కాస్త జాగ్రత్తగా ఉండాలన్న సూచన వినిపిస్తోంది. అంతేకాదు! గ్లోబల్‌ వార్మింగ్‌ వల్ల ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయనీ... వీటి ప్రభావం మన మెదడు మీద ఉండే అవకాశం ఉందని కూడా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.   ఈ పరిశోధన వియత్నాంలో జరిగినప్పటికీ మన దేశంలో ఇంతకంటే దారుణమైన ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వియత్నాంలో వేసవికాలం పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకి మించవు. మరి మన దగ్గరేమో 40కి తగ్గవు. ఇక వడగాడ్పుల గురించి చెప్పేదేముంది!   - నిర్జర.

read more
బి విటమిన్‌తో కాలుష్యం నుంచి రక్షణ

వాయుకాలుష్యం గురించి మళ్లీ చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది. పరిశ్రమలు, వాహనాల కారణంగా గాల్లోకి విపరీతంగా ధూళికణాలు చేరుకుంటున్న విషయం అందరూ మొత్తుకొంటున్నదే! మొహానికి మాస్క్‌ వేసుకోవడం తప్ప ఈ కాలుష్యం నుంచి తప్పించుకునేందుకు మరో మార్గం లేదని అందరూ నమ్మేవారు. కానీ బి విటమిన్‌తో, కాలుష్యం కలిగించే హాని నుంచి తప్పించుకోవచ్చునని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది.   ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం దాదాపు 90 శాతం మంది ప్రజలు పరిమితి మించిన కాలుష్యం ఉన్న ప్రాంతాలలో నివసిస్తున్నారు. ఈ కాలుష్యంలో ఉండే ధూళికణాలని P.M అనే పరిమాణంలో లెక్క వేస్తారు. ఒక ప్రాంతంలోని ధూళి కణాలు 2.5 P.M కంటే తక్కువ ఉంటే... అక్కడి ప్రజలు మృత్యువుతో కలిసి జీవిస్తున్నట్లే! మన వెంట్రుకలో 30వ వంతు ఉండే ఈ ధూళి కణాలు నేరుగా మన ఊపిరితిత్తులలోకి చేరిపోతాయి.   ఊపిరితిత్తులలోకి చేరిన ధూళికణాలు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులకు దారితీస్తాయి. పసిపిల్లల పాలిట అయితే ప్రాణాంతకంగా మారతాయి. ఈ ధూళికణాలు నేరుగా మెదడులోకి కూడా చేరతాయనే ఈమధ్యే మరో పరిశోధన తేల్చింది. దీంతో మెదడులో ఊహించన మార్పులు జరుగుతాయనీ... మన ఆలోచనా సామర్థ్యం, జ్ఞాపకశక్తి మీద తీవ్ర ప్రభావం చూపుతాయనీ చెబుతున్నారు. ఇక శరీరంలోని చేరిన ధూళికణాలు ఏకంగా మన జన్యువుల పనితీరునే మార్చివేస్తాయన్నది మరో విశ్లేషణ. దీనివల్ల మన రోగనిరోధక శక్తి తీవ్రంగా దెబ్బతిని ఏకంగా కేన్సర్‌ వంటి వ్యాధులు దాడిచేసే ప్రమాదం ఉంది.   ఇదంతా కూడా వాయుకాలుష్యం వల్ల జరిగే అనర్థం. రోజూ పొట్ట చేతపట్టుకుని తిరిగేవారు ఈ అనర్థాల నుంచి తప్పించుకోవడం అసాధ్యం. అయితే బి విటమిన్‌ సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల కాలుష్య కోరల నుంచి తప్పించుకోవచ్చునని ఓ పరిశోధన నిరూపిస్తోంది. ఈ విషయాన్నే నిరూపించేందుకు అమెరికాలోని పరిశోధకులు కొంతమందికి ఫోలిక్‌ యాసిడ్‌, B6, B12 ఉన్న మందులను అందించారు. ఆ తరువాత వీరిని 2.5P.M ధూళికణాలు ఉన్న వాతావరణంలోకి పంపించారు. ఆశ్చర్యకరంగా వీరి జన్యువుల మీద ఈ ధూళికణాల ప్రభావం దాదాపు 76 శాతం తగ్గిపోయినట్లు తేలింది.   కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు బీ విటమిన్‌ తోడ్పడుతుందని తేలడం ఇదే తొలిసారి. కాబట్టి ఈ విషయమై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంటుంది. ఏది ఏమైనా బీ విటమిన్‌ వంటి పోషకాలు అధికంగా ఉండే దంపుడు బియ్యం, పాలు, గుడ్లు, కాయగూరలని తరచూ తీసుకోవడం వల్ల అపరిమితమైన ఆరోగ్యం దక్కుతుందని వేరే చెప్పనవసరం లేదు. ఇక వాటిలోని పోషకాలు ఏకంగా కాలుష్యపు కోరల నుంచి రక్షిస్తాయంటే ఇక చెప్పేదేముంది.   - నిర్జర.

read more
యాంటీబయాటిక్స్ ప్రాణాంతకమా!

యాంటీబయాటిక్స్ ప్రపంచానికి చేసిన మేలు అంతాఇంతా కాదు. అవే కనుక లేకపోతే చిన్నపాటి చెవిపోటు కూడా ప్రాణాంతకంగా మారిపోయే అవకాశం ఉంది. కానీ రోజులు గడుస్తున్నా కొద్దీ- యాంటీబయాటిక్స్ను విచ్చలవిడిగా వాడేస్తున్నారనే అపవాదు మొదలవుతోంది. దీని వల్ల సూక్ష్మజీవులు మొండిబారిపోవడమే కాకుండా, జీర్ణాశయంలోని ఉపయోగపడే బ్యాక్టీరియా కూడా నాశనం అయిపోతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇది నిజమేనని సూచించే పరిశోధన ఒకటి వెలుగులోకి వచ్చింది.   టెక్సాస్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తేనెటీగల మీద యాంటీబయాటిక్స్ ప్రభావం ఎలా ఉంటుందో చూడాలనుకున్నారు. అందుకోసం విశ్వవిద్యాలయం పైన ఉన్న తేనెపట్టులలోంచి కొన్ని తేనెటీగలను ల్యాబొరేటరీలోకి తీసుకువచ్చారు. వాటిలో కొన్నింటికి సాధారణ పంచదార నీళ్లు తాగించారు. వీటికి ఆకుపచ్చ రంగు చుక్కని అంటించారు. మరికొన్నింటికి టెట్రాసైక్లిన్ అనే సాధారణ యాంటీబయాటిక్ కలిపిన నీరు తాగించారు. వీటికి గులాబీ రంగు చుక్కని అంటించారు. ఇలా చేసిన తరువాత తిరిగి ఆ తేనెటీగలన్నింటినీ కూడా వాటి పట్టు దగ్గర వదిలిపెట్టేశారు.     కొన్ని రోజుల తరువాత తేనెపట్టు దగ్గరకి వెళ్లి పరిశీలిస్తే... యాంటీబయాటిక్స్ స్వీకరించిన తేనెటీగలలో మూడోవంతు మాత్రమే బతికి ఉన్నాయి. సాధారణ పంచదార నీళ్లు తాగిన తేనెటీగలు మాత్రం ఎక్కువశాతం ఆరోగ్యంగానే ఉన్నాయి. తేనెటీగలలో యాంటీబయాటిక్స్ వాడటం వల్ల వాటి జీర్ణవ్యవస్థలోని మంచి బ్యాక్టీరియా నాశనం అయిపోయినట్లు గ్రహించారు. ఈ కారణంగా ‘సెరాటియా’ అనే హానికారక సూక్ష్మజీవి వాటి మీద దాడి చేసే అవకాశం చిక్కింది.   యాంటీబయాటిక్స్ వాడకం వల్ల తేనెటీగలలో కనిపించిన ఫలితమే మనుషులకి అన్వయిస్తుందని ఖచ్చితంగా చెప్పలేకపోవచ్చు. కానీ రెండు జీవులకీ మధ్య చాలా పోలికలు ఉన్నాయి. తేనటీగలకి మల్లే మనుషుల జీర్ణాశయంలో కూడా ‘గట్ బ్యాక్టీరియా’ అనే మంచి బ్యాక్టీరియా నివసిస్తుంది. ఈ గట్ బ్యాక్టీరియా దెబ్బతిన్నప్పుడు ‘సెరాటియా’ అనే హానికారక జీవి మనిషిని కూడా నాశనం చేస్తుంది.   తేనెటీగల పెంపకంలో కూడా యాంటీబయాటిక్స్ వాడకం విపరీతంగా ఉంటుంది. వాటిలోని ‘foulbrood’ అనే వ్యాధిని నివారించేందుకు యాంటీబయాటిక్స్ను వాడుతుంటారు. ఈమధ్యకాలంలో తేనెపట్టులో ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా మాయమైపోతుండటం వాటి పెంపకందారులు గమనించారు. దానికి కారణం ఏమిటో తెలియక తలలు పట్టుకునేవారు. కానీ యాంటీబయాటిక్స్ వాడటం వల్లే వాటి జనాభా నశించిపోతోందని ఈ పరిశోధన రుజువుచేస్తోంది. ఇక మీదట పెంపకందారులు యాంటీబయాటిక్స్ వాడకంలో కాస్త విచక్షణ చూపించాలని కోరుతున్నారు పరిశోధకులు. అంతేకాదు! మున్ముందు మనుషులు కూడా అత్యవసర పరిస్థితులలోన యాంటీబయాటిక్స్ వాడాలని సూచిస్తున్నారు. యాంటీబయాటిక్ రెండువైపులా పదును ఉన్న కత్తిలాంటి ఆయుధమని గుర్తుచేస్తున్నారు. - నిర్జర.  

read more
పిల్లలు అన్యాయంగా చనిపోతున్నారు

ఈ లోకంలో పిల్లల్ని మించిన ఆస్తి మరేముంటుంది. ప్రపంచం ఎంత అభివృద్ధి సాధించినా, ఎటు దూసుకు పోతున్నా... అందులో పిల్లలు సంతోషంగా లేకపోతే ఉపయోగం ఏముంటుంది. కానీ ఇప్పుడు ఆ పిల్లలనే మనం చేజేతులారా దూరం చేసుకుంటున్నామని తెలుస్తోంది.   - ఐదేళ్లలోపు పిల్లలలో ఏటా దాదాపు 17 లక్షల మంది నిష్కారణంగా చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చెబుతోంది. వాయు కాలుష్యం, ఇతరులు తాగే సిగిరెట్ పొగని పీల్చడం (second hand smoke), వాతావరణ కాలుష్యం, ఆహారంలో రసాయనాలు చేరడం, అపరిశుభ్రమైన నీరు... ఇలా రకరకాల నిర్లక్ష్య ధోరణుల మధ్య వారు చనిపోతున్నారని అంచనా వేస్తున్నారు. - పిల్లలలో రోగనిరోధకశక్తి చాలా బలహీనంగా ఉంటుంది. వారి అవయవాలేమో చిన్నగా, అల్పంగా ఉంటాయి. దాని వల్ల చిన్నతనంలోనే నిమోనియా, ఆస్తమా వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతూ ఉంటారు. - గాలి సంగతి అలా ఉంచితే తాగే నీరు కలుషితం కావడం వల్ల కూడా లక్షలాదిమంది పిల్లుల డయేరియా బారిన పడుతున్నట్లు చెబుతోంది WHO. 2012లో ఇలా డయేరియా ద్వారా 3,61,000 మంది పిల్లలు చనిపోయారట. నీరు కలుషితం కావడం వల్ల దోమల ద్వారా వ్యాపించే రోగాలు కూడా అదుపుతప్పుతున్నాయి. మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులను తట్టుకోవడం పిల్లల వల్ల కావడం లేదు. - గాలి, నీరే కాదు. పిల్లలకు పరిశుభ్రమైన ఆహారం కూడా అందడం లేదన్నది WHO విశ్లేషణ. క్రిమిసంహారక మందులు, ప్లాస్టిక్‌ వంటి పదార్థాలలోని హానికారకమైన రసాయనాలు ఆహారంలోకి చేరిపోతున్నాయట. ఇలా ఆర్సెనిక్‌, లెడ్‌, ఫ్లోరైడ్‌, పాదరసం వంటివన్నీ ఆహారం ద్వారా పిల్లల శరీరంలోకి చేరుతున్నాయి. వీటిలో కొన్ని రసాయనాలు పిల్లల్లోని ఎండోక్రైన్‌ వ్యవస్థను దెబ్బతీస్తాయి. దీంతో లివర్, థైరాయిడ్‌, నరాలు దెబ్బతినిపోతాయి. - వాహనాల నుంచి వచ్చే కాలుష్యం, పెద్దవారు పొగ తాగుతున్నప్పుడు పీల్చాల్సి రావడం... ఆఖరికి ఇంటి నాలుగుగోడల మధ్యా పేరుకుపోతున్న దుమ్ము కూడా పిల్లల్లో ఆస్తమా రావడానికీ కారణం అవుతోందట. - గ్లోబల్‌ వార్మింగ్‌ కూడా పిల్లల జీవితాల మీద తీవ్రమైన ప్రభావం చూపుతోందని WHO చెబుతోంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల వాతావరణంలోని కార్బన్‌ వాయువులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వీటి వల్ల పూలల్లో పుప్పొడి ఎక్కువగా పెరుగుతుందట. ఈ పుప్పొడి కారణంగా పిల్లల్లో ఆస్తమా శృతి మించుతోంది. అంతేకాదు! ఉష్ణోగ్రతలలో వచ్చే అసాధారణమైన మార్పుల వల్ల అంటువ్యాధులు కూడా త్వరగా ప్రబలే ప్రమాదం ఉంది. - పైన పేర్కొన్నవన్నీ మనం తరచూ వింటున్న ప్రమాదాలే! కానీ ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల వల్ల కూడా పిల్లల జీవితాలు కడదేరిపోతున్నాయని చెబుతోంది WHO. ఎప్పటికప్పుడు కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నా electronic wastage వల్ల పిల్లలలో ఊపిరితిత్తులు దెబ్బతినడం దగ్గర నుంచీ కేన్సర్‌ వరకూ ప్రాణాంతక వ్యాధులు కమ్ముకుంటున్నాయని హెచ్చరిస్తోంది. ఇంతకాలమూ కాలుష్యం అనేది కేవలం పర్యావరణానికి సంబంధించినదో లేకపోతే పెద్దవారికి సంబంధించినదో అని భావించేవారు. కానీ మన కంటిముందే ఆ కాలుష్యం పసిపిల్లల జీవితాలని చిదిమేస్తోందని హెచ్చరికలు అందుతున్నాయి. మరి ఈ హెచ్చరికలని ప్రభుత్వాలు పట్టించుకుంటాయా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. అప్పటివరకూ మన చిన్నారులని మనమే ఎలాగొలా కాలుష్యం నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.   - నిర్జర.

read more
గోధుమరొట్టెలతో అసలుకే మోసం!

  ఆరోగ్యం గురించి బోలెడు విషయాలు తెలుసు అని మనలో ప్రతి ఒక్కరి నమ్మకం. అందుకే ఎవరన్నా ఏదన్నా సమస్యని చెప్పగానే ఓ వైద్యుడిలాగా మారిపోయి తెగ సలహాలు ఇచ్చేస్తుంటాం. కానీ ఇలాంటి అరకొర నమ్మకాలతోనే మన జీవితాలు పాడైపోతున్నాయని నిపుణులు తలబాదుకుంటున్నారు. అలాంటి ఓ పే...ద్ద నమ్మకమే - గోధుమ రొట్టెలు తినడం చాలా మంచిది అనే మాట!   ఊదరగొట్టేశారు   ఎవరన్నా తమ ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధగా ఉంచేందుకు చేసే మొదటి ప్రయత్నం రాత్రివేళల్లో గోధుమ రొట్టెలని తినడం. ముఖ్యంగా డయాబెటిస్ రోగులు లేదా వయసు మీద పడినవారు ఇప్పుడు రాత్రియితే అన్నం ముట్టుకోకుండా చపాతీలనే తింటున్నారు. ఇదంతా ఈ మధ్యకాలంలో కనిపిస్తున్న మార్పు మాత్రమే. ఈ మార్పు వెనుక ఆరోగ్య కారణాల కంటే వ్యాపార సంస్థలు చేసిన ప్రకటనలే ప్రభావం చూపాయంటున్నారు నిపుణులు.   సమస్యలు ఎక్కువే!   బియ్యంతో పోలిస్తే గోధుమలని అరాయించుకోవడంలో చాలా సమస్యలు ఉంటాయి. Celiac Disease, Wheat Allergy, Gluten Sensitivity వంటి ఇబ్బందులతో మన శరీరం తెగ సతమతం అయిపోతుంది. వీటివల్ల తలనొప్పి దగ్గర్నుంచీ విరేచనాల వరకూ నానారకాల సమస్యలు తలెత్తుతాయి. దురదృష్టవశాత్తూ ఈ సమస్యల వెనుక కారణం గోధుమలతో చేసిన ఆహారం అన్న విషయం చాలామందికి తెలియదు. అసలు 90 శాతానికి పైగా జనానికి, తమకి గోధుమలు పడవు అన్న విషయమే తెలియదట.   ఒకవేళ సరిపడినా!   గోధుమలు ఒకవేళ మన ఒంటికి సరిపడతాయే అనుకుందాం. అప్పుడు కూడా అవేమంత ఆరోగ్యకరం కాదంటున్నారు. గోధుమలలో gluten, gliadin అనే ప్రొటీన్లు ఉంటాయి. గోధుమ బంకగా ఉండటానికి gluten కారణమవుతుంది. ఇది మన పేగులకు అంటుకుని ఓ పట్టాన జీర్ణం కాదట. తరచూ ఇలా గ్లుటెన్తో మన పేగులకి పరీక్ష పెట్టడం వల్ల నిదానంగా వాటి శక్తి క్షీణించిపోతుందని హెచ్చరిస్తున్నారు. దీని వలన జీర్ణశక్తి మందగించడమే కాకుండా, శరీరానికి అవసరమయ్యే పోషకాలను శోషించుకునే గుణాన్ని కూడా పేగులు కోల్పోతాయి. ఇక గోధుమలు ఒక వ్యసనంలా మారే ప్రమాదం ఉందన్న హెచ్చరికలూ వినిపిస్తున్నాయి. వీటిలో ఉన్న gliadin అనే ప్రొటీన్ వల్ల రోజూ గోధుమలని తినాలని శరీరానికి అనిపిస్తూ ఉంటుందట.   షుగర్ కూడా హుళుక్కే!   గోధుమ రొట్టెలని తినడం వల్ల షుగర్ అదుపులో ఉంటుదన్నది ఓ ప్రధానమైన నమ్మకం. కానీ ఇందులో కూడా వాస్తవం లేదంటున్నారు. గోధుమలు తిన్న వెంటనే వాటిలోని చక్కెర ఒక్కసారిగా రక్తంలోకి చేరిపోతుందట. ముఖ్యంగా బ్రెడ్, రిఫైన్డ్ గోధుమలతో మనలోని చక్కెన నిల్వలు అకస్మాత్తుగా పెరిగిపోతాయి. ఇది డయాబెటిస్కు దారితీస్తుంది. ఆహారం తిన్న తరువాత అందులోని చక్కెర మన రక్తంలోకి చేరుకునే విధానాన్ని కొలిచేందుకు ‘glycemic index’ అంటారు. ఇది బియ్యంతో పోలిస్తే గోధుమ పదార్థాలలో పెద్ద తేడాగా ఏమీ కనిపించదు.   హైబ్రీడు విత్తనాలు - రిఫైన్డ్ పిండి   ఇప్పుడు మనకి లభిస్తున్న గోధుమపిండి మరో ముఖ్య సమస్య. ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందనో, పిండి మెత్తగా ఉంటుందనో... కారణం ఏదైతేనేం, ఇప్పుడంతా హైబ్రీడు గోధుమ విత్తనాలను వాడుతున్నారు. వీటివల్ల శరీరంలోని రోగనిరోధక శక్తిని దెబ్బతీసేలా ఆటోఇమ్యూన్ వ్యాధులు వచ్చే ప్రమాదం లేకపోలేదు. ఇక రొట్టెలు రుచిగా, మృదువుగా ఉండేందుకు వీటిని వీలైనంత రిఫైన్ చేస్తున్నారు. ఇలాంటి గోధుమ రొట్టెలు ఎంతవరకు ఆరోగ్యమో ప్రత్యేకించి చెప్పేదేముంది!!!   అదన్నమాట సంగతి! అంచేతా గోధుమ రొట్టెలో గోధుమ రొట్టెలో అని తెగ తపించిపోకుండా... వేరే ప్రత్యామ్నాయాల ద్వారా తగినంత పోషకాలను సాధిస్తూ ఆరోగ్యాన్ని అదుపులో ఉంచుకోమని సూచిస్తున్నారు. ముతక బియ్యం, తాజా కూరగాయలు, కాలానికి అనుగుణంగా దొరికే పండ్లు తీసుకుంటూ తగినంత వ్యాయామం చేయమన్నది నిపుణులు మాట. - నిర్జర.    

read more
కాలుష్యంతో ఆడవారిలో మతిమరపు

  జీవితం పొగచూరిపోతోంది. ప్రపంచీకరణ పుణ్యమా అని పంచభూతాలన్నీ కలుషితం అయిపోయాయి. కానీ ఈ కాలుష్య ప్రభావం స్త్రీల మీద ఎక్కువేమో అన్న అనుమానాలను కలిగిస్తోంది ఓ పరిశోధన.   సహజంగానే స్త్రీల మీద అల్జీమర్స్ దాడి ఎక్కువని గణాంకాలు చెబుతున్నాయి. మహిళలలో ఉండే APOE-E4 అనే ప్రత్యేక జన్యువు కారణంగానే వారిలో అల్జీమర్స్ ఎక్కువగా కనిపిస్తోంది ఈమధ్యనే బయటపడింది. ఇక దానికి తోడు కాలుష్యం కూడా వారిలో అల్జీమర్స్కి కారణం అవుతోందా అని పరిశీలించే ప్రయత్నం చేశారు కొందరు నిపుణులు. ఇందుకోసం వారు అమెరికా ప్రభుత్వం తరపున నమోదైన 3,647 మంది స్త్రీల ఆరోగ్యాన్ని ఓ 15 ఏళ్ల పాటు పరిశీలించారు.   వాహనాల రద్దీ లేదా పవర్ ప్లాంట్స్కి దగ్గరలో ఉండేవారు తీవ్రమైన వాయుకాలుష్యానికి గురవుతారన్న విషయం తెలిసిందే! ఇలాంటి వాతావరణంలో 2.5 P.M మాత్రమే ఉండే ధూళికణాలు విహరిస్తూ ఉంటాయి. మనిషి వెంట్రుక ఓ 70 మైక్రోమీటర్లు అనుకుంటే ఇందులో ముప్ఫయ్యో వంతులో ఈ ధూళికణాలు ఉంటాయన్నమాట. ఇంత సన్నగా ఉండే ధూళికణాలు ఏకంగా మన మెదడులోకే చొరబడిపోయే ప్రమాదం ఉంది. మెదడులోకి ఇలా చొరబడిన కణాలను ఎదుర్కొనేందుకు అక్కడ ఏకంగా ఓ యుద్ధమే జరుగుతుంది. ఫలితంగా మెదడు ఆకారంలో మార్పులు సంభవిస్తాయి.   ధూళికణాల కారణంగా మెదడులో జరిగే మార్పుల వల్ల మతిమరపు, అల్జీమర్స్ వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. ఇలాంటి ప్రదేశాలలో నివసించే మహిళలు దాదాపు 92 శాతం అధికంగా అల్జీమర్స్ బారిన పడే అవకాశం ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా APOE-E4 జన్యువు కనిపించే స్త్రీలలో ఈ ప్రమాదం ఎక్కువట. మగవారిలో ఈ జన్యు ప్రభావం చాలా తక్కువ కాబట్టి... వారికి కాలుష్యం వల్ల ఇలాంటి సమస్య ఏర్పడకపోవచ్చు అని భావిస్తున్నారు.   ధూళికణాల వల్ల మన మెదడులోని కొన్ని ముఖ్యభాగాలు ప్రభావితం అవుతాయని ఇంతకుముందే తేలింది. ఆలోచనా శక్తి మందగిస్తుందనీ, విచక్షణలో మార్పులు వస్తాయనీ పరిశోధకులు నిరూపించారు. అయితే ఇప్పుడు ఏకంగా అల్జీమర్స్, అది కూడా ఆడవారి మీద దాడిచేయనుందని తేలడంతో... ఈ పరిశోధన అమెరికాలో సంచలనం సృష్టిస్తోంది. వాయుకాలుష్యాన్ని నియంత్రించేలా కఠినమైన చట్టాలను రూపొందించాలన్న వాదనకు బలం చేకూరుతోంది. - నిర్జర.          

read more
ఆడవారి గుండెజబ్బును పట్టించుకోని వైద్యులు

  స్త్రీల పట్ల మన వ్యవస్థలో అడుగడుగా పక్షపాత ధోరణి ఉంటుందన్నది చాలామంది ఆరోపణ. ఏదో కావాలని ఇలాంటి పక్షపాతాన్ని జనం ప్రదర్శిస్తారనుకోనవసరం లేదు. మనకి తెలియకుండానే నరనరాల్లో ఆడవారంటే కాస్త చులకన భావం ఉంటుంది. అది వైద్యరంగంలో కూడా ఉంటుందనీ... ఆడవారికి ప్రాణాంతకంగా మారుతోందనీ ఓ పరిశోధన రుజువుచేస్తోంది. మన దేశంలో అత్యధిక మరణాలు గుండెజబ్బుల వల్లే ఏర్పడుతున్నాయి. ఆ మాటకు వస్తే ఆస్ట్రేలియాలో కూడా ఇదే పరిస్థితి. అందుకనే ఆస్ట్రేలియాలోని సిడ్నీ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఓ సర్వేను చేపట్టారు. అసలు ఆడవారిలో గుండెపోటుని నివారించే దిశగా అక్కడి వైద్యులు ఏమన్నా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారా లేదా అన్నదే వారి సర్వే ఉద్దేశం. ఇందులో దిమ్మతిరిగే వాస్తవాలు బయటపడ్డాయి. సాధారణంగా ఓ 35- 40 ఏళ్లు దాటిన తరువాత మనం వైద్యుడి దగ్గరకి ఏదో సమస్యతో వెళ్లామనుకోండి... మన సమస్యతో పాటుగా సిగిరెట్, మందు వగైరా అలవాట్లు ఉన్నాయేమో కనుక్కోటారు. పనిలో పనిగా మన రక్తపోటుని కూడా పరిశీలిస్తారు. ఎందుకైనా మంచిది ఓసారి షుగర్ లెవెల్స్ కూడా సరిచూసుకోమని చెబుతారు. ఇంకా మాట్లాడితే ‘40 ఏళ్లు దగ్గరకి వచ్చాయి కాబట్టి ఓసారి కంప్లీట్ చెకప్ చేయించుకోండి మాస్టారూ!’ అని సలహా ఇస్తారు. కానీ ఆడవారికి మాత్రం వారి సమస్యకి ఓ నాలుగు మందులు రాసి పంపించేస్తారట. ఆడవారిలో గుండెజబ్బుకి దారితీసే పరిస్థితులను ముందస్తుగా నమోదు చేసే ప్రయత్నం 40 శాతం సందర్భాలలోనే జరుగుతోందని తేలింది. ఒకవేళ నమోదు చేసినా కూడా అందులో దాదాపు సగం మందికి మాత్రమే గుండెజబ్బుని నివారించే మందులను అందించడం జరుగుతోంది. మగవారితో పోలిస్తే గండెజబ్బులు వచ్చే ప్రమాదాన్ని గుర్తించి తగిన మందులను అందించడం అనేది 37% తక్కువగా ఉన్నట్లు బయటపడింది. గుండెజబ్బు కేవలం మగవారికి సంబంధించిన సమస్య కాదు! నిజానికి ఆస్ట్రేలియాలో మగవారికంటే ఆడవారే గుండెకు సంబంధించిన వ్యాధులతో చనిపోతున్నట్లు తేలింది. పైగా ఆడవారిలో వచ్చే గుండెజబ్బులు మరింత సమస్యాత్మకం. ఎందుకంటే గుండెపోటుకి సంబంధించి వారిలో కనిపించే లక్షణాలు వేరు. గుండెపోటు వచ్చిన తరువాత వారు కోలుకునే అవకాశాలూ తక్కువే! పైగా మగవారు పొగ తాగడం కంటే ఆడవారు పొగ తాగడం వల్ల... వారి గుండెకు ఎక్కువ నష్టం ఉంటుందట. ఇలా చెప్పుకుంటూ పోతే ఆడవారి గుండెను మరింత పదలంగా కాపాడుకోవాల్సిన సందర్భాలు చాలానే స్ఫురిస్తాయి. అభివృద్ధి చెందిన దేశమైన ఆస్ట్రేలియాలోనే పరిస్థితి ఇలా ఉందంటే... వైద్యుడిని కలవడానికి కూడా భర్త అనుమతి తీసుకోవాల్సిన మన దేశంలో ఇంకెంత దారుణమైన స్థితి ఉందో ఊహించుకోవచ్చు. మన దగ్గర డయాబెటిస్, ఊబకాయం వంటి సమస్యలు ఎక్కువ. పైగా ఏదన్నా నొప్పి చేస్తే అదేదో పని ఒత్తిడి వల్ల వచ్చిందనుకుని సర్దుకుపోయే తత్వం కనిపిస్తుంది. వీటన్నింటి ఫలితం.... ఆడవారి గుండె పగిలిపోతోంది!!! - నిర్జర.  

read more
నొప్పులన్నీ ఆడవారికేనా?

నొప్పి అన్న మాట రాగానే ప్రసవ వేదనే గుర్తుకువస్తుంది. ఆడవారు పడే ప్రసవవేదన ముందు ఎలాంటి నొప్పయినా బలాదూరే అని చెబుతూ ఉంటారు. ఆ సంగతేమో కానీ... మగవారితో పోలిస్తే ఆడవారు పడే నొప్పి తీవ్రం అంటున్నారు పరిశోధకులు.   అమెరికాలోని జార్జియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు నొప్పిని ఎదుర్కోవడంలో ఆడవారికీ, మగవారికీ మధ్య ఏమన్నా తేడా ఉందేమో అని గమనించారు. ఈ సందర్భంగా కొన్ని అనూహ్యహైన ఫలితాలు వెల్లడయ్యాయి. తీవ్రమైన నొప్పులను ఎదుర్కొనేందుకు ఇచ్చే మార్ఫిన్‌ అనే మందు స్త్రీల విషయంలో అంతగా పనిచేయడం లేదని తేలింది. మగవారికి ఇచ్చే మార్ఫిన్‌ కంటే రెట్టింపు మోతాదుని ఇస్తేకానీ ఆడవారికి ఆ మందు పనిచేయకపోవడాన్ని గమనించారు.   ఒకటే మందు అటు మగవారిలో ఒకలాగా, ఇటు ఆడవారిలో ఒకలాగా పనిచేయడానికి కారణం ఏమిటా అని శోధన మొదలైంది. ఇందుకు కారణం మెదడులో ఉంటే microglia అనే కణాలు అని తేలింది. ఈ కణాలు శరీరంలో ఎలాంటి నొప్పి, ఇన్ఫెక్షన్‌వంటివి ఉన్నాయోమో గమనిస్తూ ఉంటాయట. శరీరంలో నొప్పి ఉందని ఈ microglia కణాలు నిర్థారిస్తే తప్ప... సదరు నొప్పిని నివారించే మందులు ముందుకు పోలేవు. మరోమాటలో చెప్పాలంటే microglia కణాల అనుమతి లేకపోవడం వల్లే ఆడవారిలో మార్ఫిన్‌ వంటి మందులు పనిచేయకుండా పోతున్నాయి.   నొప్పినివారణ మందులను స్వీకరించడంలో స్త్రీ మెదడు భిన్నంగా వ్యవహరించడానికి కారణం తెలియడం లేదు. కానీ ఇక మీదట వారిలోని microglia కణాలను కూడా ప్రభావితం చేసేలా మాత్రలు రూపొందిస్తే కానీ ఫలితం ఉండదని మాత్రం తేలిపోయింది. అసలే ఆడవారిలో నరాలకు, కీళ్లకు సంబంధించిన వ్యాధులు అధికం. ఇక రుతుక్రమం కారణంగా ఏర్పడే సమస్యలు సరేసరి! ఈ నొప్పులన్నీ వారి జీవితాలని నరకం చేస్తుంటాయి. ఇక వీటికి తోడు తీవ్రమైన నొప్పులకు వాడే మందులు కూడా వారిమీద పనిచేయవు అని తేలడం నిజంగా దురదృష్టకరం! మరి ఈ పరిస్థితిని విజ్ఞానరంగం చూసీ చూడనట్లు ఊరుకుంటుందా... లేకపోతే ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనే దిశగా పరిశోధన సాగిస్తుందా అన్నది వేచి చూడాల్సిందే!   - నిర్జర.

read more
కొత్త యాంటీబయాటిక్స్ రాకపోతే కోటిమంది చనిపోతారు

  అవగాహన లేకపోవడం వల్లనో, రోగం త్వరగా తగ్గిపోవాలన్న ఆశతోనో... కారణం ఏదైతేనేం! విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్‌ వాడకం అన్ని చోట్లా కనిపించేదే. వీటి ప్రభావం నుంచి తప్పించుకున్న క్రిములు మరింత బలంగా రాటుదేలడం ప్రస్తుత సమస్య. ఆ సమస్యని పరిష్కరించాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రమాద సూచికలు జారీచేసింది.   ఇంతకుముందు చక్కగా పనిచేసిన యాంటీబయాటిక్స్, ప్రస్తుతం పనిచేయకపోవడం అనేది ప్రపంచం ముందున్న తాజా సవాలని హెచ్చరిస్తోంది WHO. ఇలా యాంటీబయాటిక్స్ పనిచేయకపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా కనీసం ఏడు లక్షల మంది చనిపోతున్నారని ఆ సంస్థ అంచనా వేస్తోంది. పరిస్థితులను ఇలాగే చూస్తూ ఊరుకుంటే 2050 నాటికి ఏకంగా ఏటా కోటిమంది అర్థంతరంగా చనిపోయే ప్రమాదం ఉందని చెబుతోంది.   WHO యాంటీబయాటిక్స్‌కు లొంగని మందులు అంటూ ఓ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో పేర్కొన్న సూక్ష్మక్రిములను ఎదుర్కొనేందుకు కొత్త యాంటీబయాటిక్స్‌ను కనుగొనే ప్రయత్నం చేయకపోతే, భవిష్యత్తులో మన ఆరోగ్యం ప్రశ్నార్థకంగా మారిపోతుందని తేల్చి చెప్పేసింది. ఈ జాబితాలో మొదటి మూడు స్థానాలలో ఉన్న సూక్ష్మక్రిములకైతే ప్రస్తుతం ఎలాంటి యాంటీబయాటిక్స్ పనిచేయడం లేదట. Carbapenems అనే అతి శక్తివంతమైన యాంటీబయాటిక్స్‌కు కూడా ఇవి లొంగడం లేదట.   ఇక జాబితాలో పేర్కొన్న మిగతా సూక్ష్మక్రిముల పరిస్థితి కూడా ఏమంత అనుకూలంగా లేదు. ఇంతకు ముందు అవి ఏఏ యాంటీబయాటిక్స్‌కైతే పనిచేశాయో ప్రస్తుతం ఆ మందులకు సదరు క్రిములు రాటుదేలిపోయాయట. వీటి మీద ప్రభావం చూపగల అతి కొద్ది మందులు కూడా మున్ముందు నిష్పలం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయట. వీటిలో చాలా తరచుగా కనిపించే గనేరియా, సాల్మొనిలే వంటి సూక్ష్మక్రిములు కూడా ఉండటం బాధాకరం.   WHO తన జాబితాలో పేర్కొన్న 12 సూక్ష్మక్రిములే కాదు... క్షయ వ్యాధిని కలిగించే Mycobacterium tuberculosis వంటి క్రిములు కూడా రోజురోజుకీ మందులకి రాటుదేలిపోతున్నాయి. అయితే ప్రభుత్వాలు కానీ, పరిశోధనా సంస్థలు కానీ ఈ సమస్య మీద తగినంత దృష్టి పెట్టడం లేదన్నది WHO ఆవేదన. కనీసం ఇప్పటి నుంచీ సరికొత్త యాంటీబయాటిక్స్‌ను కనుగొనే ప్రయత్నం చేసినా... ఆ పరిశోధనలు సాకారం కావడానికి మరో పదేళ్లన్నా పడుతుంది. అప్పటికే జరగరాని నష్టం జరిగిపోతుందని నిపుణులు భయపడుతున్నారు. మరి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా డబ్బు సంపాదించాలనుకునే మందుల కంపెనీలు, వైద్య పరిశోధనలు చేయడం తమ బాధ్యత కాదని భావించే ప్రభుత్వాలు ఎప్పటికి మేలుకుంటాయో! ఆపాటికి ఎంత నష్టం వాటిల్లుతుందో!   - నిర్జర.

read more
అక్కడ 90 ఏళ్లు మించి బతికేస్తారు - ఎందుకంటే...

  1990లో మన దేశపౌరుల సగటు ఆయుర్దాయం 58 ఏళ్లు. ఇది ప్రస్తుతం 68 ఏళ్లకు చేరుకుంది. శిశు మరణాలు తగ్గడం, మంచి పోషకాహారం, మెరుగైన వైద్య సదుపాయాలు వంటి కారణాల వల్లే ఈ మార్పు వచ్చిందని మన ప్రభుత్వాలు సంబరపడుతూ ఉంటాయి. కానీ మిగతా దేశాలతో పోలిస్తే మన సగటు ఆయుర్దాయం చాలా దారుణం. ఆయుర్దాయాల జాబితాలో మనది ఏకంగా 164వ స్థానం. ఇదిలా ఉంటే ఇప్పుడు మన ప్రభుత్వాలు ఉలిక్కిపడేలా మరో సర్వే వెలుగులోకి వచ్చింది.   బ్రిటన్లోని ప్రఖ్యాత Imperial College London, ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి ఈ సర్వేను నిర్వహించింది. ప్రస్తుత పరిస్థితులని అంచనా వేస్తూ 2030 నాటికి వేర్వేరు దేశాలలోని ఆయుర్దాయం ఎలా ఉంటుందనేదే ఈ సర్వే లక్ష్యం. ఇందుకోసం వారు 35 అభివృద్ధి చెందిన దేశాల తాలూకు గణాంకాలను సేకరించారు. ఇందులో దక్షిణ కొరియా ప్రథమ స్థానంలో నిలిచే అవకాశాలు మెరుగ్గా కనిపించాయి. 2030నాటకి అక్కడి సగటు మనిషి ఆయుర్దాయం 90 ఏళ్లకు మించిపోతుందట. కేవలం దక్షిణ కొరియానే కాదు... స్విట్జర్లాండ్, కెనడా, ఫ్రాన్స్ వంటి దేశాలెన్నో 80 ఏళ్లకు మించిన సగటు ఆయుర్దాయాన్ని సాధిస్తాయని ఈ సర్వే స్పష్టం చేస్తోంది.   పై జాబితాను చూడగానే దక్షిణ కొరియాలో అంతేసి ఆయుర్దాయం ఉండేందుకు కారణాలు ఏమిటి అన్న అనుమానం రాక మానదు. ఎదిగే వయసులో తగిన పోషకాహారం అందడం, రక్తపోటు అదుపులో ఉండటం, పొగతాగే అలవాటు లేకపోవడం, మెరుగైన ఆరోగ్య సదుపాయాలు, ఆరోగ్య రంగంలో వస్తున్న మార్పుల మీద ఎప్పటికప్పుడు అవగాహన ఏర్పరుచుకోవడం వంటి చర్యల వల్లే అక్కడి ఆయుర్దాయం అద్భుతంగా ఉండే అవకాశం ఉందంటున్నారు. దక్షిణ కొరియా సంగతి అలా ఉంచితే అమెరికా వాసుల ఆయుర్దాయంలో మాత్రం 2030 నాటికి పెద్దగా మార్పులు రాకపోవచ్చునని తేలింది. పెరిగిపోతున్న ఊబకాయం, పేట్రేగుతున్న హత్యల కారణంగా వారి సగటు ఆయుష్షు 80 ఏళ్లలోపే ఉంటుందట.   ఒకప్పుడు మనిషి సగటు ఆయుర్దాయం 90 ఏళ్లు దాటడం అసాధ్యం అనుకునేవారు. కానీ ఆ ఊహ కేవలం అపోహేనని తాజా సర్వే రుజువుచేస్తోంది. 65 ఏళ్లు దాటినవారు తగిన జాగ్రత్తలు తీసుకుంటే నిక్షేపంగా నిండు నూరేళ్లు జీవించవచ్చని చెబుతోంది. అంతేకాదు! ఒకప్పుడు ఆడవారికంటే మగవారు త్వరగా చనిపోతారనే నమ్మకం కూడా ఉండేది. అనారోగ్యకరమైన అలవాట్లు, హత్యలకు దారితీసే గొడవలు, రోడ్డు ప్రమాదాల కారణంగా వారు కాస్త త్వరగానే తనువు చాలించేసేవారు. కానీ రానురానూ మగవారి జీవిత విధానం బోలెడు జాగ్రత్తలతో నిండిపోతోందట. కాబట్టి మున్ముందు మగవారికీ, ఆడవారికీ మధ్య ఆయుర్దాయంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చునని చెబుతున్నారు.   సర్వే జరిగిన దేశాల జాబితాలో మన దేశం లేదు. కానీ ఈ సర్వే నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. విజ్ఞానరంగం అభివృద్ధి చెందిన ఈ కాలంలో ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వహిస్తే చాలు సెంచరీ కొట్టేయడం అసాధ్యం కాదు. అలాగే 60వ వడిలో పడిన వృద్ధులకి ప్రభుత్వరం ఆర్థికంగానూ, ఆరోగ్యపరంగానూ తగిన భరోసాని కల్పించగలిగితే వారు హాయిగా మరెంతో కాలం జీవించే అవకాశం ఉంది. - నిర్జర.    

read more
ఉపవాసం ఇలా చేసి చూడండి

శివరాత్రి అనగానే ఉపవాసం గుర్తుకువస్తుంది. ఉపవాసం కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు... ఆధ్యాత్మికంగానూ, ఆరోగ్యపరంగానూ అది చేకూర్చే లాభం అసమాన్యం. అలాంటి ఉపవాసాన్ని చేసేందుకు కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిదంటున్నారు నిపుణులు.   - చాలామంది రేపు ఉపవాసం అనగానే ముందురోజు రాత్రి సుష్టుగా భోజనం చేస్తారు. ఇదేమంత మంచి పద్ధతి కాదు. శరీరాన్ని నిదానంగా ఉపవాసాన్ని సిద్ధపరచడం ముఖ్యం. అందుకే మన పెద్దలు ఏకాదశి రోజు ఉపవాసం చేయాలంటే దశమి రాత్రి నుంచే మొదలుపెట్టాలనీ, శివరాత్రి ఉపవాసాన్ని కూడా ముందురోజు నుంచే ఆరంభించాలనీ చెబుతుంటారు.   - ఉపవాసం ఉండటం మంచిదే! కానీ ఎట్టిపరిస్థితుల్లోనూ ఉండితీరాలన్న నియమం ఏదీ లేదు. షుగర్ వ్యాధి ఉన్నవారు, వృద్ధులు, బాలింతలు, రక్తహీనత వంటి సమస్యలతో బాధపడేవారు, విపరీతంగా కాయకష్టం చేసే పనిలో ఉండేవారు ఉపవాసం ఉండటం వల్ల లేనిపోని సమస్యలు రావచ్చు.   - స్వల్ప వ్యాయామం చేసినా కానీ మనకి తెలియకుండానే శరీరంలోని శక్తంతా దహించుకుపోతుంది. దానిని తిరిగి భర్తీ చేసేందుకు తగిన ఆహారం అందదు కాబట్టి నిస్సత్తువ, కళ్లు తిరగడం వంటి సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ఉపవాసం చేసే రోజున వ్యాయామానికి సెలవివ్వడం మంచిది.   - శరీరానికి ఆహారం ద్వారా ఎంతో కొంత నీరు అందుతూ ఉంటుంది. ఉపవాసం రోజున ఆ అవకాశం ఉండదు కాబట్టి, ఎక్కువ మంచినీటితో ఆ లోటుని భర్తీ చేయవలసి ఉంటుంది. తద్వారా డీహైడ్రేషన్‌కు లోనయ్యే ప్రమాదం రాదు. ఇక ఉపవాసం రోజున జీర్ణవ్యవస్థ ఖాళీగా ఉంటుంది కాబట్టి, అందులోకి చేరిన నీరు పేగులను శుద్ధి చేసే అవకాశం దక్కుతుంది. అందుకనే ఉపవాసపు రోజున ఎప్పటికప్పుడు తగినంత నీరు తాగుతూ ఉండాలి.   - ఆహారం లేకుండా పూట గడవని మనకి ఉపవాసం నిజంగా ఓ పరీక్షే! అందుకే ఎలాంటి నీరసానికి లోనవకుండా ఉండాలంటే తేనె, నిమ్మరసం కలిపిన నీటిని తీసుకోమని సూచిస్తున్నారు. పెద్దగా జీర్ణప్రక్రియ అవసరం లేకుండానే తేనె మన శరీరానికి తక్షణశక్తిని అందిస్తుంది. ఇక నిమ్మరసం సత్తువని కలిగిస్తుంది.   - ఉపవాసం ఉన్న రోజున ఏదో ఒక వ్యాపకంలో మునిగితేలండి. శరీరాన్ని ఎక్కువ కష్టపెట్టకుండా మనసు మాత్రమే నిశ్చలంగా ఉండే పనిలో నిమగ్నమవ్వండి. ఏదన్నా పుస్తకం చదవడమో, ప్రసంగాలు వినడమో, ధ్యానంలో గడపడమో చేయడం వల్ల ఉపవాసానికి మంచి ఫలితం దక్కుతుంది.   - చాలామంది ఉపవాసం చేసే రోజు విపరీతంగా కాఫీ,టీ, సిగిరెట్లు తాగేస్తుంటారు. ఇలా చేయడంకంటే ఉపవాసం ఉండకపోవడమే మేలంటున్నారు వైద్యులు. వీలైతే రోజూ తాగే కాఫీ, టీలు కూడా మానేయమని చెబుతుంటారు. దీని వల్ల కొందరికి తలనొప్పి వచ్చినా అది తాత్కాలికమే కాబట్టి ఓపికపట్టమని సూచిస్తున్నారు.   - ఉపవాసం అంటే పూర్తిగా ఆహారాన్ని నిషేధించాలని ఏమీ లేదు. పాలు, పండ్లు వంటి అపక్వమైన ఆహారాన్ని తీసుకుంటూ ఉపవాసాన్ని సాగించడం వల్ల కూడా ఎంతోకొంత ఫలితం ఉంటుంది. ఉపవాసాన్ని విరమించే సమయంలో కూడా ఒక్కసారిగా జీర్ణవ్యవస్థ మీద భారం కలగకుండా ఉండేందుకు ఇలాంటి తేలికపాటి ఆహారాన్నే తీసుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు. యాపిల్‌, కమల, అరటిపండు, పుచ్చకాయలు, ఖర్జూరాలు, పాలు, గ్రీన్‌టీ వంటి ఆహారం జీర్ణవ్యవస్థకి పెద్దగా పని కల్పించకుండానే శరీరానికి కావల్సిన శక్తిని అందిస్తుంటాయి.     - నిర్జర.

read more
మృత్యువుని దూరం చేసే బిల్వదళాలు

శివరాత్రి వచ్చిందంటే నీటితో అభిషేకం, బిల్వపత్రాలతో అర్చనా గుర్తుకువస్తాయి. శివుని ఎన్ని విధాలా పూజించినా, అందులో బిల్వ పత్రం లేనిదే మనసుకి లోటుగానే ఉంటుంది. మరి ఆ పరమేశ్వరునికే ప్రీతిపాత్రమైనదంటే... బిల్వ పత్రంలో ఎన్నో ప్రత్యేకతలు ఉండే ఉంటాయి కదా! వాటిలో కొన్ని...   - బిల్వవృక్షంగా పిలుచుకునే మారేడు చెట్టు మన దేశంలోనే ఉద్భవించిందని శాస్త్రవేత్తలు నిరూపించారు. ఈ చెట్టు -7 డిగ్రీల నుంచి 48 డిగ్రీల వరకూ ఎలాంటి వాతావరణాన్నయినా తట్టుకుని ఎంతటి నేలలో అయినా ఎదుగుతుంది. కాబట్టి ఊరూరా కనిపించే ఆ బిల్వదళాలు అటు అర్చనకే కాదు ఇటు ఆయుర్వేదంలోనూ విస్తృతంగా వినియోగించేవారు.   - గాలి, వెలుతురు సరిగా సోకని గర్భగుడులలోని తేమకి రకరకాల సూక్ష్మక్రిములు చేరుకుంటాయి. కానీ అక్కడ శివలింగం చెంతన ఉండే బిల్వదళాలు అక్కడి వాతావరణాన్ని మార్చేస్తాయి. మిగతా ఆకులతో పోలిస్తే బిల్వదళాలు రోజుల తరబడి తాజాగా ఉంటాయి. పైగా సూక్ష్మక్రిములను సంహరించే యాంటీబ్యాక్టీరియల్ గుణాలు వీటి సొంతం. కాబట్టి గర్భగుడిని నిరంతరం పరిమళభరితంగా, ఆరోగ్యవంతంగా ఉంచడంలో బిల్వానిది గొప్ప పాత్ర!     - చక్కెర వ్యాధికి బిల్వం గొప్ప ఔషధం. బిల్వపత్రాల నుంచి తీసిన రసాన్ని కానీ, ఆ పత్రాలను ఎండించి చేసిన పొడిన కానీ తీసుకుంటే చక్కెర నిల్వలు అదుపులో ఉంటాయట. వగరుగా ఉండే బిల్వ ఫలాలని తిన్నా కూడా చక్కెర వ్యాధి అదుపులో ఉంటుంది.   - జీర్ణ సంబంధమైన అనేక వ్యాధులకు మారేడు ఫలాలు, దళాలు ఉపయోగపడతాయి. మలబద్ధకం, అతిసారం, ఆకలి లేకపోవడం, పేగులలో పుండ్లు, ఎసిడిటీ వంటి సమస్తమైన సమస్యలలోనూ బిల్వం ప్రభావవంతంగా పనిచేస్తుంది.       - బిల్వపత్రాలకి యాంటీఫంగల్ లక్షణం ఉంది. ఆ కారణంగా వీటి రసాన్ని శరీరానికి రాసుకుంటే ఎలాంటి దుర్వాసనా రాకుండా కాపాడతాయి. అంతేకాదు! గాయాలు త్వరగా మానాలన్నా, వాపులు తగ్గాలన్నా కూడా బిల్వపత్రాల నుంచి తీసిన రసాయనం పైపూతగా రాస్తే సరి!   - మారేడు ఫలాల నుంచి తీసిన గుజ్జుతో చేసిన పానీయంతో శరీరం చల్లగా ఉంటుంది. జీర్ణవ్యవస్థ కూడా మెరుగవుతుంది. మనవైపు తక్కువ కానీ ఇలా మారేడు పండ్లతో పానీయాలు, షర్బత్లు చేసుకునే అలవాటు ఒడిషా, బెంగాల్ ప్రాంతాలలో ఇంటింటా కనిపిస్తుంది.   - బిల్వ పత్రాలలో కనిపించే Aegeline అనే రసాయం చక్కెర నిల్వలను అదుపులో ఉంచడంలోనూ, రక్తపోటుని నియంత్రించడంలోనూ, కొవ్వుని తగ్గించడంలోనూ ఉపయోగపడుతుందనే దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి.   మారేడు పూలు, పత్రాలు, బెరడు, వేళ్లు....  ఇలా మారేడు వృక్షంలోని అణువణువుకీ ఆరోగ్యాన్ని అందించే లక్షణం ఉంది. అందుకనేనేమో మారేడు వృక్షం సాక్షాత్తు ఆ పరమేశ్వరుని స్వరూపం అని చెబుతారు. మూడు ఆకులుగా ఉండే ఆ దళంలో ఆయన త్రినేత్రాలను దర్శిస్తారు. ఎలాంటి ఆరోగ్య సమస్యనయినా మారేడు దూరం చేయగలదు కాబట్టే దానికి ‘మృత్యు వంచనము’ అనే పర్యాయపదం కూడా ఉంది. కేవలం శైవారాధనలోనే కాకుండా వినాయకచవితినాడు పూజించే ఏకవింశతి పత్రాలలో మారేడు కూడా చోటు చేసుకుంది. అంతదాకా ఎందుకు! మారేడు విశిష్టతను ఎరిగిన మన పెద్దలు బిల్వాష్టకం పేరుతో ఒక స్త్రోత్రాన్నే రూపొందించుకున్నారు. - నిర్జర.      

read more
అతిగా తినేవారి వల్లే ఆకలి చావులు

  అవసరానికి మించి తినే ఆహారం వల్ల మన ఒక్కరి ఆరోగ్యం మాత్రమే పాడవుతుందని అనుకునేవారం. కానీ మన ఆహారపు అలవాట్లు ఏకంగా ప్రపంచంలోని ఆకలినే శాసిస్తున్నాయని ఓ సర్వే తేల్చి చెబుతోంది. అతిగా తినడం, ఆహారాన్ని వృధా చేయడం వంటి అలవాట్లతో ప్రపంచంలో దాదాపు 20 శాతం ఆహారం పనికిరాకుండా పోతోందని హెచ్చరిస్తోంది. అంతేనా మాంసాహారాన్ని ఉత్పత్తి చేసే ప్రయత్నంలోనూ విలువైన పంటలు వృధా అవుతున్నాయని సర్వే సూచిస్తోంది.   స్కాట్లాండ్లోని ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు ఆహారానికి సంబంధించిన ఈ పరిశోధనకు పూనుకున్నారు. దీని కోసం వాళ్లు ఐక్యరాజ్య సమితి దగ్గర ఉన్న గణాంకాలన్నింటినీ సేకరించి విశ్లేషించారు. ఈ విశ్లేషణ తరువాత, తాము అనుకున్నదానికంటే ఎక్కువ ఆహారమే అనవసరంగా వృధా అవుతోందని గమనించారు. ఆహారం పండించే దశ నుంచి దానిని వినియోగించే దశ వరకూ జరుగుతున్న వృధాను గమనిస్తే మన కళ్లు కూడా చెదిరిపోక తప్పదు.   ఆహారాన్ని పండించే దశలో జరిగే నష్టాన్ని నివారించడం కష్టం కావచ్చు. కానీ చేతికి అందిన ఆహారాన్ని కూడా మనం వృధా చేయడం దారుణం. ప్రపంచవ్యాప్తంగా పండుతున్న ఆహారంలో దాదాపు పదిశాతం ఆహారాన్ని వృధాగా నేలపాలు చేస్తున్నట్లు గమనించారు. కొందరు అతిగా తినడం వల్ల మరో పదిశాతం ఆహారం ఇతరులకు అందకుండా పోతోందట.   సర్వేలో బయటపడిన మరో ఆశ్చర్యకరమైన అంశం – పశువుల పోషణ! పాల కోసమో, మాంసం కోసమో ఇబ్బడిముబ్బడిగా పశువులని పెంచడం వల్ల కూడా ఆహారభద్రతకు ముప్పు వాటిల్లుతోందట. ఎందుకంటే ఆ పశువులని పెంచేందుకు టన్నుల కొద్దీ పంటలను వాడాల్సి వస్తోంది. ఉత్పత్తి అవుతున్న ఆహారంలో దాదాపు 20 శాతం ఇలా పశుపోషణ కోసమే వినియోగిస్తున్నారని తేలింది.   ప్రపంచవ్యాప్తంగా దాదాపు పదోవంతు మంది సరైన తిండి లేకుండా బతికేస్తున్నారు. ఇప్పటికీ రోజుకి 20 వేల మంది ప్రజలు తగిన ఆహారం అందక చనిపోతున్నారు. మనం వృధా చేస్తున్న ఆహారం వీరికి అందితే ఎంత బాగుంటుందో కదా! అందుకే తిండి మీద కాస్త ధ్యాసని తగ్గించి, ఒంటికి తగిన పోషకాహారం అందుతోందా లేదా అన్న విషయం మీదే దృష్టి పెట్టమంటున్నారు. అంతేకాదు! జంతుసంబంధమైన ఉత్పత్తుల మీద కాస్త ఆసక్తిని తగ్గించుకోమంటున్నారు. మరి ఈ మాట వినేదెవరో! - నిర్జర.    

read more
లాలిపాటతో డిప్రెషన్ దూరం

  నెలల వయసు పసికందుని చూసి తల్లి నిశబ్దంగా ఉండగలదా! ఆ పిల్లవాడు ఏడుస్తుంటే ఓదార్చేందుకు తన గొంతు విప్పకుండా ఉంటుందా! అందుకే ప్రపంచంలో ఏ పురాణాలూ, కావ్యాలూ పుట్టకముందే లాలిపాటలు పుట్టి ఉంటాయి. అలాంటి లాలా పాటలను ఏవో లల్లాయి పదాల్లాగా తీసిపారేయవద్దని సూచిస్తున్నారు పరిశోధకులు.   లాలిపాటల గురించి పరిశోధనలు జరగడం కొత్తేమీ కాదు. లాలిపాటల వల్లే మాతృభాష పిల్లలకు అలవడుతుందనీ, తల్లీబిడ్డల మధ్య సంబంధం మెరుగుపడుతుందనీ ఇప్పటికే అనేక పరిశోధనలు నిరూపించాయి. మియామీ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు మరో అడుగు ముందుకు వేసి, లాలిపాటల వల్ల అటు తల్లి మీదా ఇటు బిడ్డ మీదా ఎలాంటి ప్రభావం ఉంటుందో గమనించే ప్రయత్నం చేశారు.   ఈ పరిశోధన కోసం శాస్త్రవేత్తలు ఓ 70 మంది పసిపిల్లలను ఎన్నుకొన్నారు. వీరికి ఆరురకాల శబ్దాలను వినిపించారు. వీటిలో తల్లి తన బిడ్డ కోసం పాడే పాట, ఎవరో ఆగంతకుడు పాడే పాట, మ్యూజిక్ సిస్టమ్ నుంచి వచ్చే సంగీతం, పుస్తకం చదివి వినిపించడం... వంటి శబ్దాలు ఉన్నాయి. వీటన్నింటిలోకీ తల్లి తన కోసం పాట పాడినప్పుడే, పిల్లవాడి మెదడు చురుగ్గా ప్రతిస్పందిస్తున్నట్లు గమనించారు. పిల్లవాడి మానసిక ఎదుగుదలకు లాలిపాటలు ఉపయోగపడుతున్నట్లు తేలింది.   పిల్లల సంగతి అలా ఉంచితే మరి తల్లి పరిస్థితి ఏమిటి? దానికీ జవాబు కనుగొన్నారు పరిశోధకులు. పిల్లలు పుట్టిన తరువాత శరీరంలో ఏర్పడే మార్పుల వల్ల తల్లులలో డిప్రెషన్ తలెత్తే ప్రమాదం ఉంది. పిల్లల వంక చూస్తూ, వారి ప్రతిస్పందనలకి అనుగుణంగా స్వరంలో మార్పులు చేస్తూ.... లాలిపాటలు పాడటం వల్ల అలాంటి డిప్రెషన్ చిటికెలో తీరిపోతుందంటున్నారు. మరింకేం! స్వరం గురించి సంకోచం లేకుండా మీ గొంతుని చిన్నారి ముందు విప్పండి. - నిర్జర.      

read more