నీరు త్రాగడం ఆరోగ్యానికి చాలా అవసరం.  ఒక వాహనానికి ఇంధనం ఎలాగో.. శరీరానికి నీరు కూడా అలాగే చాలా అవసరం.  చాలా మంది నీరు బాగా తాగాలి అని చెబుతూ ఉంటారు. అయితే ఆరోగ్యానికి మంచిది కదా అని ఎక్కువ నీరు తాగితే చాలా నష్టం ఎదుర్కోవాల్సి ఉంటుంది అని అంటున్నారు వైద్యులు.  ఇంతకీ నీరు ఎక్కువ తాగడం వల్ల కలిగే నష్టాలు ఏంటో తెలుసుకుంటే..

ఎక్కువ నీరు తాగమని తరచుగా చాలామంది సలహాలు ఇస్తుంటారు. అయితే నీరు ఎక్కువ తాగితే శరీరానికి చాలా ప్రమాదం అంటున్నారు వైద్యులు.  ఆహార నిపుణులు కూడా.

ఎక్కువ నీరు తాగడం వల్ల నీటి మత్తుకు దారి తీస్తుందని అంటున్నారు.  నీరు ఎక్కువగా తాగినప్పుడు రక్తంలో సోడియం స్థాయిలు తగ్గుతాయట.  దీని వల్ల శరీరం ఒకానొక మత్తు స్థితిలోకి జారుకుంటుంది. అందుకే శరీరానికి మంచిది అనే అపోహలో నీరు ఎడాపెడా తాగకూడదు.

శరీరానికి సోడియం అవసరం చాలా ఉంది. ఇది శరీరంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది.  ఇది మెదడు, కండరాలు,  నరాలు సరిగ్గా పనిచేయడానికి చాలా అవసరం.  అలాంటి సోడియం శరీరంలో ద్రవాల సమతుల్యతను కూడా కాపాడుతుంది.  కాబట్టి సోడియం స్థాయి తగ్గిపోతే శరీరం మత్తులోకి జారుతుంది.

రక్తంలో సోడియం స్థాయిలు తగ్గిపోతే అది శరీరంపై ఇతర ప్రభావాలు కూడా చూపిస్తుంది.  ముఖ్యంగా తలనొప్పి,  తలతిరగటం,  వాంతులు,  అలసట వంటి సమస్యలే కాకుండా బలహీనత వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.

నీటిని ఎక్కువ తాగడం వల్ల మెదడులో నరాలు ఒత్తిడికి లోనవుతాయి. ఇది మెదడు పనితీరు మీద ప్రభావం చూపిస్తుంది.  కొన్ని సార్లు మెదడు వాపు సమస్య కూడా వస్తుంది.  మరికొన్ని సందర్భాలలో స్పృహ కోల్పోవడం, లేదా మూర్ఛ వంటి సమస్యలు కూడా వస్తాయి.

ఒక వ్యక్తి ఎంత నీరు తాగాలి అనేది.. వ్యక్తి వయసు, బరువు,  చేసే పనులను బట్టి ఉంటుంది. అయితే సగటున పెద్దలకు రోజుకు 2 నుండి 3 లీటర్ల నీరు తాగడం మంచిది.

నీరు బాగా తాగే వారిలో తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లడం,  శరీరంలో వాపు కనిపించడం,  ఎప్పుడూ తలనొప్పిగా ఉండటం,  వంటి లక్షణాలు కనిపిస్తే అవన్నీ నీరు అధికంగా తాగడం వల్ల వచ్చే సమస్యలేనని అర్థం చేసుకోవాలని వైద్యులు అంటున్నారు. ఇలాంటి లక్షణాలు దీర్ఘకాలం కొనసాగితే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.


                                   *రూపశ్రీ.


గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...