
తమలపాకుకు మన సంప్రదాయంలో, సంస్కృతిలో, ఆహారంలో ఒక విశిష్టమైన స్థానం ఉంది. సాధారణంగా పూజలలో తమలపాకు అగ్రస్థానంలో ఉంటుంది. ఆ తరువాత పాన్, తాంబూలంలో వాడతారు. కానీ తమలపాకు ఔషధంగా కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా చలికాలంలో సరైన పద్ధతిలో తీసుకుంటే ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుంది. చలికాలంలో తమలపాకు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే..
తమలపాకు చలికాలంలో తినవచ్చా?
చలికాలంలో తమలపాకు తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది, ఎందుకంటే ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచే స్వభావం కలిగి ఉంటుంది. .
చలితో వచ్చే కఫం, దగ్గు, జలుబు వంటి సమస్యలను తగ్గిస్తుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
కానీ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఎక్కువగా తినకూడదు. రోజుకు ఒక ఆకుకన్నా ఎక్కువ తీసుకుంటే దాని వేడి శక్తి వల్ల కడుపు మండడం, నోరు ఎండిపోవడం లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
ఏ సమయంలో తినాలి?
తమలపాకు తీసుకునే సమయం కూడా చాలా ముఖ్యం. ఉదయం భోజనం తరువాత లేదా సాయంత్రం భోజనం తరువాత.. ఈ రెండు సమయాల్లో ఏదైనా ఒకసారి తినడం ఉత్తమం. ఎందుకంటే భోజనం తర్వాత జీర్ణక్రియను సులభం చేస్తుంది. తిన్న వెంటనే కాదు భోజనం తర్వాత 10–15 నిమిషాలు గ్యాప్ ఇవ్వాలి.
ఎలా తింటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయంటే..
తమలపాకును తినే పద్ధతిని బట్టి దాని ప్రయోజనాలు ఉంటాయి.
సాధారణ పద్ధతి..
ఒక తాజా తమలపాకు తీసుకుని, దానిపై చిన్నమొత్తం ఎలకులు పొడి లేదా సొంపు వేసి మెల్లగా నమిలాలి. ఇది జీర్ణక్రియకు సహాయం చేస్తుంది, నోరు తాజా వాసన ఇస్తుంది.
దగ్గు లేదా చలి ఉన్నప్పుడు:
ఒక తమలపాకును తేలికగా మంట మీద వేడి చేసి దానిపై కొంచెం తేనె రాసి తినండి. ఇది కఫం తగ్గిస్తుంది, గొంతు నొప్పి తగ్గిస్తుంది.
జీర్ణక్రియ కోసం:
తమలపాకు మీద కొంచెం చింతపండు, ఉప్పు వేసి నమిలితే, జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
తమలపాకు ఆరోగ్య ప్రయోజనాలు
భోజనం తర్వాత తీసుకుంటే గ్యాస్, బరువుగా ఉండటం తగ్గుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
తేనెతో కలిపి తింటే గొంతు సమస్యలు తగ్గుతాయి.కఫం, దగ్గు నియంత్రణ అవుతుంది.
నోటి దుర్వాసన తగ్గిస్తుంది ఇది సహజమైన మౌత్ ఫ్రెషనర్ గా పని చేస్తుంది.
చలికాలంలో వేడి శక్తి ఇస్తుంది. శరీరానికి తాపాన్ని అందిస్తుంది.
తమలపాకులో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇమ్యునిటీ పెంచుతుంది.
చిన్న రక్తనాళాలను శుభ్రం చేస్తుంది. తద్వారా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది
తినటంతో పాటు తమలపాకు నూనెతో మసాజ్ చేస్తే ఉపశమనం లభిస్తుంది.
జాగ్రత్తలు..
ఎక్కువగా తింటే కడుపు మండడం లేదా నోరు ఎండిపోవడం జరుగుతుంది.
చలికాలంలో రోజుకు ఒక ఆకుకంటే ఎక్కువ కాదు.
సున్నం లేదా సుపారితో తినడం మాత్రం వద్దు.. అవి ఆరోగ్యానికి హానికరం.
గర్భిణీ స్త్రీలు లేదా గుండె, రక్తపోటు సమస్యలున్నవారు తీసుకునే ముందు వైద్యుని సలహా తీసుకోవాలి.
*రూపశ్రీ.




