ఈ ఆసనాలు వేస్తే చాలు.. మహిళలలో జుట్టు పొడవుగా పెరుగుతుంది..!
.webp)
మహిళల్లో జుట్టు రాలిపోవడం, సరిగ్గా పెరగకపోవడం అనేది ఈ రోజుల్లో చాలా సాధారణ సమస్య అయిపోయింది. రకరకాల షాంపూలు, ఆయిల్స్ మార్చి మార్చి వాడి అలసిపోతుంటారు. కానీ ఎలాంటి ఖర్చు లేకుండా, ఇంట్లోనే ఉంటూ మన జుట్టును ఒత్తుగా, పొడవుగా పెంచుకోవడానికి యోగాలో కొన్ని అద్భుతమైన ఆసనాలు ఉన్నాయి. ఇవి తలకు రక్త ప్రసరణను పెంచి, జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. అవేంటో తెలుసుకుంటే..
అధో ముఖ స్వనాసనం..
ఈ ఆసనం వేయడం చాలా సులభం. దీనిని ఇంగ్లీషులో డౌన్వర్డ్ ఫేసింగ్ డాగ్ అంటారు. ఈ ఆసనం వేసేటప్పుడు మన తల కిందికి, కడుపు పైకి వస్తుంది. దీనివల్ల గుండె నుంచి తలకు రక్త ప్రసరణ చాలా వేగంగా సాగుతుంది. తలకు ఆక్సిజన్, పోషకాలు సరిగ్గా అందడం వల్ల జుట్టు కుదుళ్లు బలపడి త్వరగా పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది.
సర్వాంగాసనం..
యోగాలో సర్వాంగాసనానికి చాలా ప్రత్యేకత ఉంది. దీనిని అన్ని ఆసనాలకు క్వీన్ అని కూడా అంటారు. వెల్లకిలా పడుకుని కాళ్లను పైకి లేపి, చేతులతో నడుమును పట్టుకుని శరీరాన్ని పైకి ఎత్తాలి. ఈ ఆసనం వేయడం వల్ల మెడ, తలకు రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. అంతేకాకుండా హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది. హార్మోన్లు సరిగ్గా ఉంటే జుట్టు రాలే సమస్య చాలావరకు తగ్గుతుంది.
శీర్షాసనం..
తల కిందకు పెట్టి కాళ్లు పైకి లేపి చేసే ఈ ఆసనం జుట్టు ఆరోగ్యానికి నిజంగా ఒక వరం లాంటిది. తలక్రిందులుగా ఉండటం వల్ల తలకు రక్తం బాగా ప్రసరిస్తుంది. దీనివల్ల నెత్తి మీద చర్మం ఆరోగ్యంగా మారుతుంది. అయితే ఈ ఆసనం వేసేటప్పుడు మొదట్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, వీలైతే గోడ సహాయంతో లేదా నిపుణుల పర్యవేక్షణలో చేయడం మంచిది.
వజ్రాసనం..
మనం భోజనం చేసిన తర్వాత వేసే ఒకే ఒక ఆసనం వజ్రాసనం. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా శరీరంలో రక్త ప్రసరణను సరిగ్గా ఉంచుతుంది. పొట్ట శుభ్రంగా ఉంటే మనం తిన్న ఆహారంలోని పోషకాలు శరీరానికి, జుట్టుకు సరిగ్గా అందుతాయి. రోజూ పది నిమిషాలు ఈ ఆసనంలో కూర్చుంటే జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది.
ఉత్తనాసనం..
నిలబడి ముందుకు వంగి చేతులతో కాళ్ల వేళ్లను తాకే ఆసనాన్ని ఉత్తనాసనం అంటారు. ఈ ఆసనంలో తల కిందికి ఉంటుంది కాబట్టి, తల భాగంలోని కణాలకు విశ్రాంతి దొరుకుతుంది. తలకు రక్తం ప్రవహించి జుట్టు కుదుళ్లకు కావలసిన శక్తి అందుతుంది.
ఈ యోగాసనాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఉదయం పూట వేయడం వల్ల కేవలం జుట్టు పెరగడమే కాకుండా శరీరం కూడా దృఢంగా, ఆరోగ్యంగా ఉంటుంది. ఎలాంటి ఖర్చు లేని ఈ చిన్న చిట్కాలను పాటిస్తే మీ జుట్టును అందంగా, పొడవుగా మార్చుకోవచ్చు.
*రూపశ్రీ.




