ఈ ఆసనాలు రోజూ వేస్తుంటే చాలు.. మహిళల గర్భాశయం సేఫ్..!
.webp)
ప్రస్తుత ఆధునిక జీవనశైలి, మారుతున్న ఆహారపు అలవాట్లు , శారీరక శ్రమ తగ్గడం వల్ల చాలా మంది మహిళలు వివిధ రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా హార్మోన్ల అసమతుల్యత, నెలసరి నొప్పులు , గర్భాశయానికి సంబంధించిన సమస్యలు నేడు సర్వసాధారణం అయిపోయాయి. ఇలాంటి ఇబ్బందుల నుంచి సహజ సిద్ధంగా ఉపశమనం పొందడానికి , గర్భాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి యోగా ఎంతగానో సహాయపడుతుంది. క్రమం తప్పకుండా కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు వేయడం ద్వారా పెల్విక్ ప్రాంతంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది , పునరుత్పత్తి వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.
మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఐదు ముఖ్యమైన ఆసనాల గురించి వివరంగా తెలుసుకుంటే..
మాలాసనం
ఈ ఆసనాన్ని గర్లాండ్ పోజ్ అని కూడా అంటారు. ఇది శరీర దిగువ భాగానికి, ముఖ్యంగా పెల్విక్ ప్రాంతానికి అద్భుతమైన వ్యాయామంలా పనిచేస్తుంది. ఈ ఆసనం వేసేటప్పుడు శరీరాన్ని మోకాళ్ల దగ్గర మడిచి , పాదాల మీద కూర్చున్నట్లుగా ఉంచి, రెండు చేతులను నమస్కార ముద్రలో ఉంచాలి. ఈ భంగిమలో ఐదు దీర్ఘమైన శ్వాసలు తీసుకోవాలి. ఇది పెల్విక్ భాగంలో రక్త ప్రసరణను వేగవంతం చేస్తుంది , పునరుత్పత్తి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది
బద్ధ కోణాసనం..
దీనిని కోబ్లర్ పోజ్ లేదా సీటెడ్ యాంగిల్ పోజ్ అని పిలుస్తారు. నేలపై కూర్చుని రెండు పాదాల అరికాళ్లను ఒకదానికొకటి తాకించి, చేతులతో పట్టుకోవాలి. ఈ భంగిమలో వెన్నుముకను నిటారుగా ఉంచి ఐదు శ్వాసల పాటు అలాగే ఉండాలి. ఈ ఆసనం అండాశయాలను ఉత్తేజపరిచేందుకు , గర్భాశయ ఆరోగ్యాన్ని బలోపేతం చేసేందుకు అద్భుతంగా సహాయపడుతుంది.
కపొతాసనం...
దీనిని పిజన్ పోజ్ అని కూడా అంటారు. ఇది తొడల భాగాన్ని, కటి వలయాన్ని సాగదీయడానికి , ఆ ప్రాంతంలో పేరుకుపోయిన బిగువును తగ్గించడానికి సహాయపడుతుంది. ఒక వైపు కాలును ముందుకు మడిచి, మరో కాలును వెనుకకు చాపి ఛాతీని పైకి ఎత్తి ఉంచాలి. దీనిని రెండు వైపులా ఆచరిస్తూ ఐదు శ్వాసల పాటు ఈ భంగిమలో ఉండాలి. ఇది పెల్విక్ ప్రాంతంలోని ఒత్తిడిని తగ్గించి, గర్భాశయం సరైన స్థితిలో ఉండేలా సహకరిస్తుంది.
ఆనంద బాలాసనం..
దీనిని హ్యాపీ బేబీ పోజ్ అని పిలుస్తారు. వెల్లకిలా పడుకుని రెండు మోకాళ్లను కడుపు వైపునకు మడిచి, చేతులతో రెండు పాదాల వేళ్లను పట్టుకుని వెడల్పుగా తెరవాలి. ఈ స్థితిలో ఐదు దీర్ఘమైన శ్వాసలు తీసుకోవాలి. ఇది పొత్తికడుపు భాగంలో ఉద్రిక్తతను తగ్గించి, శరీరాన్ని ప్రశాంతపరుస్తుంది , గర్భాశయ అవయవాలకు మంచి విశ్రాంతిని ఇస్తుంది.
సేతు బంధాసనంలో యోగ బ్లాక్..
వెల్లకిలా పడుకుని మోకాళ్లను మడిచి నడుము భాగాన్ని పైకి ఎత్తే బ్రిడ్జ్ పోజ్ సమయంలో, రెండు మోకాళ్ల మధ్య ఒక చిన్న యోగ బ్లాక్ ఉంచి దానిని గట్టిగా నొక్కాలి. ఈ పద్ధతిని పది సార్లు రిపీట్ చేయాలి. ఇది గర్భాశయ కండరాలను దృఢపరచడానికి , పెల్విక్ ఫ్లోర్ కండరాలకు అద్భుతమైన బలాన్ని చేకూర్చడానికి సహాయపడుతుంది.
యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు, అది మన అంతర్గత ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఒక సాధనం. రోజూ క్రమం తప్పకుండా ఈ చిన్న ఆసనాలను ప్రాక్టీస్ చేయడం ద్వారా మహిళలు తమ గర్భాశయ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు , అనేక అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు.
*రూపశ్రీ.




