విటమిన్-డి సూర్యరశ్మి నుండి లభించే ముఖ్యమైన విటమిన్. ఇది శరీరంలో కాల్షియం, ఫాస్పేట్ సరైన స్టాయిలో ఉండేలా చేస్తుంది. విటమిన్-సి మాత్రమే కాకుండా విటమిన్-డి కూడా రోగనిరోధక శక్తి బలంగా ఉండేలా చేస్తుంది. కానీ ఈ చలికాలంలో సూర్యుని వెలుగు సరిగా లేకపోవడం వల్ల చాలామందిలో విటమిన్-డి లోపం ఏర్పడుతుంది. సాధారణంగా విటమిన్స్ లోపాన్ని చాలామంది గుర్తించలేరు. కానీ వివిధ రకాల అసౌకర్యాలు మాత్రం ఎదుర్కొంటూ ఉంటారు. విటమిన్-డి లోపాన్ని గుర్తించడానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. వాటిని గమనించుకుని విటమిన్ లోపాన్ని భర్తీ చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండచ్చు.
విటమిన్-డి లోపం లక్షణాలు..
మూడ్ స్వింగ్స్.. డిప్రెషన్..
విటమిన్-డి లోపం ఉంటే గనుక మూడ్ స్వింగ్స్, డిప్రెషన్ వంటి సమస్యలు మెండుగా ఉంటాయి. ఎప్పుడూ ఇంట్లో ఉండేవారికి, ఉదయం నుండి రాత్రి వరకు గదులలోనే నుండి పనిచేసుకునేవారికి ఈ సమస్యలు అధికంగా ఉంటుంటాయి. ఈ విటమిన్-డి లోపం శరీరంలో హార్మోన్లను కూడా ప్రభావితం చేస్తుంది. ఫలితంగా మానసిక సమస్యలకు కారణమవుతుంది. విటమిన్-డి లోపం వల్ల సెరోటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి కాదు. ఈ హార్మోన్ తగినంత ఉత్పత్తి కాకపోతే అది మానసిక కల్లోలానికి, నిరాశ, నీరసం వంటి సమస్యలకు కారణం అవుతుంది.
జుట్టు రాలడం..
చాలామంది ఆరోగ్యకరమైన ఆహారం తింటున్నా జుట్టు ఎందుకు రాలుతోందని తికమకపడుతుంటారు. అయితే విటమిన్-డి లోపం కూడా జుట్టు రాలడానికి కారణం అవుతుంది. విటమిన్-డి లోపం వల్ల చాలామందిలో అలోపేసియా అరేటా వ్యాధి ప్రమాదం పెరుగుతుంది. ఇగి తల, శరీరం మీద వెంట్రుకలను ప్రభావితం చేసే వ్యాధి. తలమీద వెంట్రుకలు వేగంగా రాలిపోయి బట్టతల రావడానికి ఈ వ్యాధే కారణం. విటమిన్-డి లోపిస్తే జుట్టు బలహీనంగా, సున్నితంగా మారిపోయి బాగా రాలిపోతుంది.
ఎముకల నొప్పి..
ఎముకలకు కాల్షియమే ప్రధాన వనరు అనే విషయం తెలిసిందే. అయితే విటమిన్-డి లోపం కూడా ఎముకల నొప్పికి ప్రధాన కారణమవుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే కాల్షియం నిల్వచేయడంలో, ఎముకలను బలంగా ఉంచడంలో విటమిన్-డి ఖచ్చితంగా అవసరం. విటమిన్-డి లోపిస్తే ఎముకలకు కాల్షియం అందకుండా పోతుంది. ఫలితంగా ఎముకలు, కండరాల నొప్పి, ఎముకల బలహీనత వంటి సమస్యలు వస్తాయి. చలికాలంలో ఎముకల సమస్యలు వేధిస్తుంటే దాన్ని విటమిన్-డి లోపంగా గుర్తించాలి.
చర్మం పొడిబారడం..
విటమిన్-డి లోపం ఉంటే చర్మం పొడిబారుతుంది. చాలామందికి పొడిచర్మంతో పాటు దద్దుర్లు, మంటలు కనిపిస్తాయి. మరికొందరికి చర్మం ఎర్రగా మారి కొన్నిసార్లు రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుంది. కొసమెరుపు ఏంటంటే విటమిన్-డి భర్తీ అయ్యే వరకు ఈ సమస్యలు పదే పదే వేధిస్తూనే ఉంటాయి.
తామర, సొరియాసిస్..
విటమిన్-డి లోపం చర్మ ఆరోగ్య విషయంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. పైన చెప్పుకున్నట్టు చర్మం పొడిబారడం, దద్దుర్లు, మంటలు వంటి సమస్యలతో పాటు తామర, సొరియాసిస్ వంటి చర్మ సంబంధ రుగ్మతలకు కూడా కారణం అవుతుంది. తామర ఉంటే శరీరంలో ఏదైనా భాగంలో కాసింత పెద్దగా వృత్తాకారంలో ఎరుపురంగులో దద్దుర్లు రావడంతో మొదలై అది కస్తా తీవ్రరూపం దాల్చి కురుపులా మారుతుంది.
పై లక్షణాలు ఎవరిలో అయినా కనిపిస్తే.. అవి ధీర్ఘకాలం కొనసాగితే అవన్నీ విటమిన్-డి లోపం లక్షణాలని గుర్తించి లోపాన్ని భర్తీ చేసుకోవాలి.
*నిశ్శబ్ద