శీతాకాలం ఉష్ణోగ్రతలలో చాలా మార్పు తెలుస్తుంది. ఇది శరీరాల మీద ప్రభావం చూపిస్తుంది. శీతాకాలంలో నువ్వులు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. నువ్వులు వేడి స్వభావం కలిగి ఉంటాయి. వీటిని శీతాకాలంలో తినడం వల్ల శరీరంలో వేడి పుట్టి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. చలికాలపు అనారోగ్యాలను ఎదుర్కొనే విధంగా శరీరాన్ని ధృడంగా ఉంచుతాయి. నువ్వులలో రెండు రకాలున్నాయనే విషయం అందరికీ తెలిసిందే.. ఈ  రెండూ ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ  రెండింటిలో ఒకటి ఎక్కువ ఆరోగ్యప్రయోజనాలను, మరొకటి తక్కువ ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. నలుపు, తెలుపు  నువ్వులలో ఏవి ఆరోగ్యానికి ఎక్కువ మంచివి? వేటి వల్ల ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి? పూర్తీగా తెలుసుకుంటే..

ఏవి మంచివి?

నలుపు, తెలుపు నువ్వులు రెండూ ఆరోగ్యానికి మంచివే.  అయినప్పటికీ తెల్లనువ్వుల కంటే నల్ల నువ్వులలో ఎక్కువ పోషకాలు ఉంటాయి.  వీటిలో అధిక మొత్తంలో కాల్షియం ఉంటుంది. కాబట్టి శీతాకాలంలో నల్ల నువ్వుల లడ్డూలు లేదా నువ్వుల చిక్కీలు తినడం మంచిది. వీటిని రోజూ తినడం వల్ల ఎముకల ఆరోగ్యం బలపడుతుంది. నల్ల నువ్వులు వగరుగా, క్రంచీగా ఉంటాయి. అయితే తెల్ల నువ్వులు మెత్తగా, తీపిగా తేలికపాటి రుచి కలిగి ఉంటాయి.

నల్ల నువ్వులలో పోషకాలు ఎక్కువ ఎందుకంటే..

తెల్ల నువ్వుల కంటే నల్ల నువ్వులలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. నల్లనువ్వులలో ఒమెగా-3 ప్యాటీ యాసిడ్ లు తెల్లనువ్వులలో కంటే ఎక్కువ. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.  నల్ల నువ్వులలో ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, ఇనుము, రాగి, మెగ్నీషియం,  పాస్పరస్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా తెల్లనువ్వుల కంటే  పుష్కలంగా ఉంటాయి. వీటన్నింటికి కారణం నల్ల నువ్వుల మీద పొట్టు తీయకపోవడమే.  నల్లనువ్వులను పొట్టు తీసే క్రమంలో పోషకాలు లాస్ అవుతాయి.

శీతాకాలంలో ప్రాముఖ్యత ఎందుకంటే..

శీతాకాలంలో నల్ల నువ్వులు తినమని చెబుతారు. ఎందుకంటే పైన చెప్పుకున్నట్టు వీటిలో వేడి గుణం ఉంటుంది. వీటని రోజూ ఆహారంలో తీసుకుంటే చాలా మంచిది. వేడి శరీరం ఉన్నవారు డైలీ అరటీస్పూన్ వేయించిన నల్లనువ్వులను, ఇతర శరీర తత్వం ఉన్నవారు టేబుల్ స్పూన్ నల్లనువ్వులను తీసుకోవచ్చు. లేదంటే లడ్డూ చేసుకుని అయినా తినవచ్చు. సలాడ్ లలోనూ, వంటకాల్లోనూ ఉపయోగించవచ్చు. వీటిలో పైబర్, ఐరన్, ఫాస్పరస్, కాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల వీటిని డైలీ ఆహారంలో తీసుకుంటే ఐరన్ లోపం, కాల్షియం లోపం ఏర్పడదు. మలబద్దకం సమస్య పరిష్కారమవుతుంది. రక్తపోటు మెరుగవుతుంది. రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.  అయితే నువ్వులు  వేడి చేస్తాయి కాబట్టి నీరు కూడా బాగా తాగితే వేడి సమస్య వేధించదు.

                                                        *నిశ్శబ్ద.