1. నమిలి తినాలి
వినటానికి ఆశ్చర్యంగా ఉంటుంది కానీ మనలో చాలామంది ఆహారాన్ని నమిలి తినరు. గబగబ తినేస్తారు. దీని వల్ల ఆహారంలో ఉండే కొన్ని రకాల పీచు పదార్థాలు జీర్ణం కావు. అందువల్లే ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినమని నిపుణులు సూచిస్తూ ఉంటారు. నెమ్మదిగా నమిలినప్పుడు నోటిలో లాలాజలం ఊరుతుంది. దీనిలో ఉండే ఎంజైమ్‌లు ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తాయి.
2. ఎక్కువ అల్పాహారం
గబగబ ఆఫీసులకు, కాలేజీలకు బయలుదేరేవారికి కష్టం కానీ- ఉదయం పూట ఎక్కువ తింటే ఎటువంటి జబ్బులు దగ్గరకు రావంటున్నారు నిపుణులు. దీనికి ఒక కారణముంది. రోజంతా పనిచేయాలంటే మన శరీరానికి పోషక పదార్థాలు అవసరం. లేకపోతే అవసరమైన శక్తి అందదు. అందువల్ల పొద్దుటిపూట వీలైనంత ఎక్కువ తిని.. మధ్యాహ్నం భోజనం తక్కువగా తినమని నిపుణులు సూచిస్తున్నారు.
3. రాత్రి కొద్దిగానే..
కొంత మంది రాత్రి చాలా ఎక్కువగా తింటారు. దీని వల్ల మన జీర్ణ వ్యవస్థ ఇబ్బంది పడుతుందని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో మిగిలిన అవయవాల మాదిరిగానే మన జీర్ణ వ్యవస్థకు కూడా విశ్రాంతి ఉండాలి. రాత్రి ఎక్కువగా తినటం వల్ల జీర్ణవ్యవస్థకు తక్కువ విశ్రాంతి దొరుకుతుంది. దాని ప్రభావం మర్నాడు ఉదయం శరీరంపై పడుతుంది. రాత్రి ఎక్కువ తినేవారు సాధారణంగా ఉదయం తక్కువగా తింటారు. దీని వల్ల పగలంతా శరీరానికి అవసరమైన పోషక పదార్థాలు లభించవు.
4. గ్లౌసిమిక్ ఇండెక్స్ కూడా ప్రధానమే..
మనం తినే ఆహారపదార్థాలలో కొన్ని త్వరగా.. కొన్ని ఆలస్యంగా శక్తిని విడుదల చేస్తాయి. ఆలస్యంగా శక్తిని విడుదల చేసే ఆహారపదార్థాల వల్ల మన శరీరంలో చక్కెర నిల్వలు అదుపులో ఉంటాయి. ఆహారపదార్థాలు శక్తిని విడుదల చేసే స్థాయిని నిర్ధారించే టేబుల్‌ను గ్లౌసిమిక్ ఇండెక్స్ అంటారు. ఉదాహరణకు బ్రౌన్ రైస్, గోధుమలు గ్లౌసమిక్ ఇండెక్స్ ప్రకారం నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తాయి. మైదా త్వరగా విడుదల చేస్తుంది. అందువల్ల బ్రౌన్ రైస్, గోధుమతో చేసిన పదార్థాలను తినటం వల్ల శరీరంలోని శక్తి సమతౌల్యంలో సమస్యలు ఏర్పడవు.
5. సరైన వంట
మనం తినే పదార్థాలతో పాటు వాటిని వండే పద్ధతి కూడా ముఖ్యమే. ఉడకపెట్టిన పదార్థాలలో తక్కువ కేలరీలు ఉంటాయి. వేయించిన పదార్థాలలో ఎక్కువ కేలరీలు ఉంటాయి. అందువల్ల వేయించటం తప్పనిసరైనప్పుడు ముందు ఆ పదార్థాన్ని ఉడకపెట్టాలి. ఆ తర్వాతే వేయించాలి.
6. ఎక్కువ నీళ్లు
ప్రతి రోజు వీలైనన్ని ఎక్కువ నీళ్లు తాగాలి. నీరు మన ఆకలిని నియంత్రించటమే కాకుండా శరీరపు ఉష్ణోగ్రతలను నియంత్రణలో ఉంచుతుంది. శరీరంలో మలినాలను బయటకు పంపటంలో కూడా నీరు చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది.