ప్రాణాయామం చేసేటపుడు తీసుకోవలసిన జాగ్రత్తలు

 


మైదానంలోగాని, తోటలోగాని, తలుపులు తెరచియున్న గదిలోగాని, కంబళీ లేక బట్ట లేక ఏదేనీ ఆసనం మీద కూర్చొని ప్రాణాయామం చేయాలి.

గాలి విపరీతంగా వీస్తూ ఉంటే ఆ గాలి మధ్య ప్రాణాయామం చేయకూడదు.

మురికిగా ఉన్న చోట, దుర్వాసన వస్తున్న చోట, పొగ వస్తున్న చోట ప్రాణాయామం చేయకూడదు.

సిగరెట్టు, బీడి, చుట్టపొగ వస్తున్న చోట ప్రాణాయామం చేయకూడదు.

పొట్ట నిండుగా ఉన్నపుడు ప్రాణాయామం చేయకూడదు.

ప్రాణాయామం చేసే ముందు, చేసిన తరువాత కూడా ఇతర యోగాసనాలు వేయవచ్చు. అయితే చివర శవాసనం వేసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి.

ప్రాణాయామం వేసినపుడు బట్టలు తక్కువగానూ, వదులుగానూ ధరించాలి.

నేల మీద కూర్చోలేనివారు, కుర్చి మీద నిటారుగా కూర్చొని ప్రాణాయామం చేయవచ్చు.

నడుం, వీపు, వెన్నెముక, మెడలను నిటారుగా ఉంచి ప్రాణాయామం చేయాలి.

ప్రాణాయామం చేసేటపుడు ఒకసారి కుడి ముక్కు రంధ్రాన్ని, ఒకసారి ఎడమ ముక్కు రంధ్రాన్ని మూయవలసి ఉంటుంది. కుడి ముక్కు రంధ్రాన్ని కుడిచేతి బొటన వ్రేలితోనూ, ఎడమ ముక్కు రంధ్రాన్ని కుడిచేతి ఉంగరం వ్రేలితోనూ మూయాలి.

ముక్కు రంధ్రాలు సరిగా శుభ్రంగా లేకపోతే ప్రాణాయామం చేసే ముందు జలనేతి, సూత్రనేతి క్రియలు సక్రమంగా చేయాలి. అలాచేస్తే ప్రాణాయామం చేస్తున్నపుడు శ్వాస సరిగ్గా ఆడుతుంది.

ప్రాణాయామ క్రియలు చేస్తూ ఉన్నపుడు మనస్సును పూర్తిగా శ్వాస ప్రశ్వాస క్రియలపెై కేంద్రీకరిచాలి. వేరే యోచనలకు తావు ఇవ్వకూడదు.