30ఏళ్లు నిండిన ప్రతి మహిళ చేయించుకోవాల్సిన పరీక్షలు.. ఇవి ఎంత ముఖ్యమంటే..!

మహిళల శరీరం ప్రతి దశలో చాలా మార్పులకు లోనవుతూ ఉంటుంది.  రుతుచక్రం మొదలైన దగ్గర నుండి వివాహం,  ప్రసవం,  మెనోపాజ్.. ఇలా చాలా దశలలో మహిళల శరీరం కుదుపులకు లోనవుతూ ఉంటుంది.  అంతేకాదు.. ఇలా దశలు మారుతున్నప్పుడు చాలా రకాల ఆరోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి.  30ఏళ్లు నిండిన ప్రతి మహిళ కొన్ని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది.  వీటిని చేయించుకోవడం వల్ల శరీరంలో ఏవైనా సమస్యలు ఉంటే ముందుగానే గుర్తించి,  వాటికి తగిన ట్రీట్మెంట్ కూడా తీసుకోవచ్చు.  ఇంతకీ 30ఏళ్లు నిండిన మహిళలు చేయించుకోవాల్సిన పరీక్షలు ఏంటో తెలుసుకుంటే..

CBC టెస్ట్..

ఇది కంప్లీట్ బ్లట్ కౌంట్ టెస్ట్.  ఈ పరీక్ష చేయించుకోవడం వల్ల రక్తహీనత సమస్య ఉందో లేదో తెలుసుకోవచ్చు.  భారతదేశంలో 80శాతం మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని నివేదికలు చెబుతున్నాయి.  ఈ పరీక్ష చేయించుకోవడం ద్వారా రక్తహీనతను తగ్గించి ఆరోగ్యంగా మారడంలో సహాయపడుతుంది.

రక్తహీనత ఉన్న మహిళలలో అలసట,  బలహీనత వంటి సమస్యలు ఉంటాయి.  చికిత్స తీసుకోవడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ పెరగడమే కాకుండా.. బలహీనత, అలసట వంటివి కూడా తగ్గుతాయి.

బ్లడ్ షుగర్ టెస్ట్..

నేటికాలంలో మధుమేహం చాలా చిన్న వయులోనే వస్తోంది.  డయాబెటిస్ వచ్చే అవకాశాలను ముందుగానే గుర్తించడం వల్ల దాన్ని రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. కుటుంబ సభ్యులలో ఎవరికైనా డయాబెటిస్ ఉంటే ముందుగానే ఈ పరీక్ష చేయించుకుంటే చాలా జాగ్రత్త పడవచ్చు.

థైరాయిడ్ టెస్ట్..

చాలా మంది మహిళలు అసాధారణంగా బరువు పెరగడం,  బరువు తగ్గడం వంటివి ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే జుట్టు బాగా రాలిపోవడం,  అలసట,  నెలసరి సమస్యలు ఎదురుకావడం వంటివి కూడా ఎదుర్కొంటూ ఉంటారు.  ఇవన్నీ థైరాయిడ్ వల్ల ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది.  థైరాయిడ్ గ్రంథి అతిగా పనిచేసినా,  సరిగా పనిచేయకపోయినా కూడా శరీరంలో ఇబ్బందులు ఏర్పడతాయి.  కాబట్టి థైరాయిడ్ టెస్ట్ తప్పనిసరిగా చేయించుకోవాలి.

లిపిడ్ ప్రోపైల్.. (కొలెస్ట్రాల్ టెస్ట్)..

గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి,  కొలెస్ట్రాల్ స్థాయిలు తెలుసుకోవడానికి లిపిడ్ ప్రోపైల్ టెస్ట్ తప్పనిసరిగా చేయించుకోవాలి.

పాప్ స్మియర్ టెస్ట..

మహిళలను ఇబ్బంది పెట్టే సమస్యలలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ చాలా ముఖ్యమైనది.  ఇది చాలా ప్రమాదమైనది.  దీన్నే సర్వై కల్ క్యాన్సర్ అంటారు. 30ఏళ్లు దాటిన మహిళలు ప్రతి 3 లేదా 5 సంవత్సరాలకు ఒకసారి ఈ పరీక్షలు చేయించుకోవాలి.

 అల్ట్రాసౌండ్ అబ్డోమెన్, పెల్విస్..

మహిళలలో గర్భధారణ సమస్యలు,  రక్తహీనత,  నెలసరి సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు అల్ట్రాసౌండ్ అబ్డోమెన్, పెల్విన్ సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. అందుకే ఈ ప్రాంతాలను అల్ట్రాసౌండ్ స్కాన్ తీయించుకోవడం మంచిది. ఇది పైబ్రాయిడ్స్, సిస్ట్స్, పిసిఓయస్,  గర్భాశయం, అండాశయాల ఆరోగ్యం మొదలైన వాటి గురించి తెలుసుకోవడానికి సహాయపడుతుంది.

విటమిన్-డి, విటమిన్-బి-12..

మహిళలలో ఎముకలు ఆరోగ్యంగా ఉండాలన్నా,  నరాల సమస్యలు లేకుండా బాగుండాలన్నా, అలసట, మూడ్ స్వింగ్స్ వంటివి లేకుండా ఉండాలన్నా విటమిన్-డి, విటమిన్-బి12 చాలాముఖ్యం.  ఈ పరీక్షలు చేయించుకోవడం ద్వారా విటమిన్ లోపాలు తెలుసుకుని ఆహారం ద్వారా లేదా సప్లిమెంట్ ద్వారా లోపాన్ని అధిగమించవచ్చు.

రక్తపోటు.. బీపి..

చాలామంది చిన్న వయసులోనే హై బీపితో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే హై బీపి అనేది ఒకేసారి బయట పడదు.  అందుకే అప్పుడప్పుడు బీపి చెక్ చేయించుకుంటూ ఉంటే దాని స్థాయులను బట్టి ఆహార జాగ్రత్తల ద్వారా బీపి కి చెక్ పెట్టవచ్చు.

బరువు, బిఎంఐ..

నేటికాలంలో డయాబెటిస్,  పిసిఓయస్ వంటి సమస్యలు రావడానికి అధికబరువు కారణం అవుతుంది.  అందుకే  ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చూసుకోవాలి.  దీనికోసం బిఎంఐ టెస్ట్ బాగా సహాయపడుతుంది. అలాగే అప్పుడప్పుడు  బరువును చెక్ చేసుకుంటూ ఉండాలి.

బ్రెస్ట్ పరీక్ష..

మహిళలు ఎదుర్కునే క్యాన్సర్ లలో బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ముఖ్యమైనది.  బ్రెస్ట్ క్యాన్సర్ గుర్తించడానికి ముందు జాగ్రత్తగా సెల్ఫ్ ఎగ్జామ్ చేసుకోవాలి.   ఒకసారి డాక్టర్ దగ్గర చూపించుకుని, తర్వాత సెల్ఫ్ ఎగ్జామ్ చేసుకోవడం మంచిది. ఇది బ్లెస్ట్ క్యాన్సర్ ను ముందుగా గుర్తించడానికి సహాయపడుతుంది.

పై పరీక్షలను ఏడాదికి ఒకసారి లేదా 2ఏళ్లకు ఒకసారి చేయించుకోవడం వల్ల మహిళల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవచ్చు.

                                      *రూపశ్రీ.