పరిగెత్తేటప్పుడు లెగ్గింగ్స్ లేదా షార్ట్స్ ఏవి ధరిస్తే మంచిది!

పరుగు ఆరోగ్యానికి చాలామంచిది. చాలామంది మహిళలు తమ ఆరోగ్యం గురించి అవగాహనతో రోజువారీ వాకింగ్, రన్నింగ్ చేస్తుంటారు. అయితే చాలామంది వాకింగ్, రన్నింగ్, యోగా వంటివి చేస్తున్నా.. వాటికి తగిన దుస్తులు ఎంపిక చేసుకోవడంలో, ధరించడంలో మాత్రం అంతగా అవగాహన కలిగి ఉండరు. అయితే ముఖ్యంగా పరిగెత్తేటప్పుడు పాదాలు చురుగ్గా ఉంటాయి. ఇలాంటి సందర్బంలో దుస్తుల వల్ల ఏదైనా ఇబ్బంది ఎదురైతే రన్నింగ్ అయినా, వాకింగ్ అయినా సరిగా చేయలేరు. ఇంతకూ రన్నింగ్ చేసేటప్పుడు లెగ్గింగ్స్ ధరించడం మంచిదా? లేదా షార్ట్స్ ధరించడం మంచిదా? తెలుసుకుంటే..
పరుగు ఆరోగ్యానికి చాలామంచిది. రోజూ కనీసం రెండు నుండి మూడు కిలోమీటర్లు అయినా రన్నింగ్ చేసేవారు చాలా ఆరోగ్యంగా ఉంటారు. రన్నింగ్ చేసేటప్పుడు ప్రోఫెషనల్ రన్నర్ లు అయితే షార్ట్స్ ధరిస్తారు. చాలామంది మహిళలు మాత్రం లెగ్గింగ్స్ ధరిస్తారు. రన్నింగ్ చేసేటప్పుడు ఏది ధరించాలి అనే విషయం తెలియని వారు మాత్రం గందరగోళంలో ఏదో ఒకటి అన్నట్టు ధరిస్తుంటారు.
లెగ్గింగ్స్..
లెగ్గింగ్స్ కాళ్ల కండరాలకు బాగా సపోర్ట్ ఇస్తుంది. ఎందుకంటే లెగ్గింగ్స్ సాగే గుణాన్ని కలిగి ఉంటాయి. ఇది సాగడం కారణంగా కండరాలు సంకోచ, వ్యాకోచాలు సజావుగా జరుగుతాయి. కండరాలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేస్తాయి.
ఎక్కువ దూరం పరిగెత్తినప్పుడు కాళ్ళు, ముఖ్యంగా తొడల చర్మం ఒరుసుకుని పోకుండా చేయడంలో లెగ్గింగ్స్ సహాయపడతాయి. దీని వల్ల చికాకు తగ్గుతుంది.
చలికాలంలో లెగ్గింగ్స్ ధరించడం వల్ల కాళ్లు వెచ్చగా ఉంటాయి. కండరాలను చలి నుండి రక్షిస్తాయి. పరిగెత్తేటప్పుడు సౌకర్యంగా కూడా ఉంటాయి.
లెగ్గింగ్స్ వేసుకున్నప్పుడు రన్నింగ్ చేయడానికే కాకుండా ముందుకు, వెనక్కు, కూర్చోవడం, లేవడం వంటి కదలికలకు కూడా బాగా సహాయపడుతుంది. చాలామంది సాధారణ జీన్స్ వంటివి వేసుకోవడం వల్ల రన్నింగ్ మాత్రమే కాకుండా చాలా కదలికలకు ఇబ్బందిగా ఉంటుంది.
మంచి నాణ్యత కలిగిన లెగ్గింగ్స్ అయితే చెమటను కూడా బాగా పీల్చుకోగలుగుతాయి. తద్వారా చర్మాన్ని పొడిగా కూడా ఉంచుతాయి. నడుస్తున్నప్పుడు లేదా రన్నింగ్ చేస్తున్నప్పుడు సౌకర్యవంతంగా కూడా ఉంచుతాయి.
శరీరానికి సరిగ్గా సరిపోయే లెగ్గింగ్స్ వేసుకోవడం వల్ల రన్నింగ్ చాలా సజావుగా జరుగుతుంది. మరీ ముఖ్యంగా బరువులు ఎత్తడం, యోగా, ఎరోబిక్స్ వంటి అన్ని రకాల వ్యాయామాలకు కూడా లెగ్గింగ్స్ బాగా సెట్ అవుతాయి.
సరైన లెగ్గింగ్స్ ఎలా ఎంచుకోవాలంటే..
రన్నింగ్ కోసం అయితే నైలాన్, స్పాండెక్స్ లేదా పాలిస్టర్ వంటి సింథటిక్, గాలి ప్రసరణ జరిగేలా ఉండే లెగ్గింగ్ లను ఎంచుకోవాలి. ఇవి చెమటను తొందరగా తొలగించి చర్మాన్ని పొడిగా ఇంచుతాయి. లెగ్గింగ్స్ ను ఎప్పుడూ ఎక్కువ ఎలాస్టిక్ గుణం ఉన్నవే ఎంచుకోవాలి. ఎలాస్టిక్ గుణం తక్కువ ఉన్నవి ఎంచుకుంటే అసౌకర్యాన్ని కలిగిస్తాయి.
*రూపశ్రీ.




