శరీరానికి ఆహారం చేసే మేలు అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఆహారంలో పండ్లు, కూరగాయలు,  డ్రై ఫ్రూట్స్,  డ్రై నట్స్ వంటివి ఉండాలి.  వీటి నుండి విటమిన్లు,  మినరల్స్, ప్రోటీన్లు అన్నీ శరీరానికి లభిస్తాయి. అయితే సీజన్ అనుగుణంగా లభించే వాటిలో శరీరానికి కావలసిన పోషకాలు, శరీరానికి మేలు చేసే సమ్మేళనాలు మెరుగ్గా ఉంటాయి. అలాంటి వాటిలో వాటర్ చెస్ట్ నట్స్ కూడా ఒకటి.  వీటిని తెలుగులో సింగోడ అని అంటారు.  ఇవి శీతాకాలంలో మార్కెట్లోకి అందుబాటులోకి వస్తాయి. ఇవి రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి.  శీతాకాలంలో ఈ వాటర్ చెస్ట్ నట్స్ ను తప్పకుండా తినాలని ఆహార నిపుణులు చెబుతున్నారు.  ఇంతకీ ఇవి తింటే కలిగే లాబాలు తెలుసుకుంటే..

వాటర్ చెస్ట్ నట్ తింటే రోగనిరోధక శక్తి బలపడుతుంది.  ఇది వివిధ రకాల వ్యాధులతో పోరాడటంలో సహాయపడుతుంది. ఏవైనా జబ్బులు వచ్చినప్పుడు ఈ వాటర్ చెస్ట్ నట్స్ ను తింటూ ఉంటే తొందరగా రికవరీ కావచ్చు.

చలికాలంలో జీర్ణ వ్యవస్థ నెమ్మదిస్తుంది.  దీని కారణంగా ఆహారం జీర్ణం కావడంలో ఇబ్బందులు ఏర్పడతాయి.  మలబద్దకం, అజీర్ణం వంటి సమస్యలు ఏర్పడతాయి. కానీ వాటర్ చెస్ట్ నట్స్ తింటే  జీర్ణవ్యవస్థ బలోపేతం అవుతుంది.  మలబద్దకం సమస్యలు తగ్గుతాయి.

వాటర్ చెస్ట్ నట్స్ లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది.  ఇది రక్త పోటును అదుపులో ఉంచుతుంది.  దీని కారణంగా చలికాలంలో గుండె సంబంధ వ్యాధుల బారిన పడే అవకాశం తగ్గుతుంది.  సాధారణంగా చలికాలంలో శరీరంలో రక్తప్రసరణ తగ్గడం వల్ల గుండె కండరాలు బిగుసుకుపోయినట్టు ఉంటాయి. కానీ ఈ సమస్య తగ్గించడంలో వాటర్ చెస్ట్ నట్స్ సహాయపడతాయి.

వాటర్ చెస్ట్ నట్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో చర్మం మెరుస్తూ ఉండేలా చేయడంలో సహాయపడతాయి. ముఖం మీద మొటిమలను  తొలగించడమే కాకుండా కాలుష్యం వల్ల వచ్చే సమస్యల నుండి కూడా ఇవి కాపాడతాయి.

అన్నింటి కంటే ముఖ్యంగా వాటర్ చెస్ట్ నట్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది.  ఈ ఫైబర్ శరీరానికి చాలా అవసరం.  ఇది ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంచడంలో సహాయపడుతుంది.  ఆకలిని నియంత్రణలో ఉంచుతుంది.  ఫలితంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.


                                          *రూపశ్రీ.