ఆహారమే ఆరోగ్యం అనే మాట వినే ఉంటారు.  శరీరానికి శక్తిని ఇచ్చేది ఆహారమే.  అయితే ఆరోగ్యానికి ఔషధంలా పని చేసే ఆహారమే అనారోగ్యాన్ని కూడా తెచ్చిపెడుతుంది. దీనికి కారణం సీజన్.. సీజన్ కు తగ్గట్టు ఆహారం తినాలని అంటుంటారు.  ఏ కాలంలో పండే కూరగాయలు, పండ్లు ఆ కాలంలో తింటే ఎలాంటి జబ్బులు పెద్దగా ఇబ్బంది పెట్టవు. కానీ నేటి కాలంలో పరిస్థితి వేరుగా ఉంది.  ఏ సీజన్ లో అయినా ఎలాంటి ఆహారం అయినా దొరుకుతుంది.  కొందరు  ఖరీదు ఎక్కువ పెట్టి సీజన్ లో లభించని ఆహారాలు కొని తినడాన్ని గొప్పగా ఫీలవుతారు కూడా. అయితే చలికాలంలో కొన్ని ఆహారాలు తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ ఆహారాలు తినడం వల్ల ఆరోగ్యం పాడయ్యి వ్యాధుల బారిన పడతారట. చాలా వరకు ఏ ఆహారాలు హాని కలిగిస్తాయి అనే విషయం చాలా మందికి తెలియదు.  సాధారణ రోజుల్లో ఎంతో ఆరోగ్యం అనుకునే ఆహారాలే ఆ తరువాత హాని కలిగిస్తాయి.  చలికాలంలో తినకూడని ఆహారాలేంటో తెలుసుకుంటే..

చలికాలంలో ఐస్ క్రీమ్ తినడం,  వర్షం పడుతుండగా ఐస్ క్రీమ్ ఆస్వాదించడం చాలామంది అదేదో  గొప్పగా చెబుతారు. కానీ చలికాలంలో చాలావరకు ఐస్ క్రీములు,  చల్లని జ్యూసులు తీసుకోవడం వల్ల జలుబు,  దగ్గు,  ఇతర సీజనల్ సమస్యలు చాలా తొందరగా వస్తాయి.

చల్లని వాతావరణంలో వేడిగా ఏదైనా తినాలని అనుకునే చాలామంది నూనెలో వేయించిన ఆహారాలు,  కరకరలాడే ఫ్రై లు తినాలని అనుకుంటారు.  అలాంటి ఆహారానికే మొగ్గు చూపుతారు. కానీ చలికాలంలో సాధారణంగానే జీర్ణవ్యవస్థ పనితీరు నెమ్మదిస్తుంది.  ఇది జీర్ణవ్యవస్థను పాడు చేసి అజీర్ణం,  మలబద్దకం వంటి సమస్యలు కలిగిస్తుంది.

బాగా కారంగా ఉన్న ఆహారం తినడాన్ని ఇష్టపడే వారు అధికం అయ్యారు.  కారం తినడం అంటే తమ వ్యక్తిత్వం, శరీరం బాగా బలంగా ఉందని వ్యక్తం చేయడం అనుకుంటారు. దీని కారణంగానే చాలామంది బిరియానీ,  మసాలా వంటకాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ ఇలాంటి ఆహారాలు తినడం వల్ల చలికాలంలో ఎసిడిటీ,  గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి.

చలికాలంలో జీర్ణ వ్యవస్థ పనితీరు నెమ్మదిగా ఉంటుంది. జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకునే ఆహారాలను ఈ కాలంలో తీసుకోకపోవడమే మంచిది.  అలాంటి ఆహారాలలో పచ్చి కూరగాయలు కూడా ఒక భాగం.  పచ్చి కూరగాయలను తినడం మానుకోవాలి.

చక్కెర ఎక్కువగా జోడించిన ఆహారాలు తినడం వల్ల జలుబు, ఫ్లూ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.  వీటిని చలికాలంలో వీలైనంత వరకు తగ్గించాలి.

                                               *రూపశ్రీ.