థైరాయిడ్.. మహిళలలో పిల్లలు పుట్టకుండా చేస్తుందా? వైద్యులు ఏం చెబుతున్నారంటే!

ఈ రోజుల్లో థైరాయిడ్ సమస్యలు చాలా సాధారణమైపోయాయి. భారతదేశంలో  థైరాయిడ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. శరీరం హార్మోన్‌ను చాలా ఎక్కువగా లేదా చాలా తక్కువగా ఉత్పత్తి చేసినప్పుడు థైరాయిడ్ సమస్యలు వస్తాయి. థైరాయిడ్ సమస్యలు ఏ వయసులోనైనా రావచ్చు. భారతదేశంలో ప్రతి 10 మందిలో ఒకరు థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ వ్యాధి మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. థైరాయిడ్ సమస్యల వల్ల మహిళల్లో నెలసరి సరిగా రాకపోవడం,  పిల్లలు పుట్టకపోవడం వంటివి జరిగే అవకాశం ఉంటుందని కొందరు అంటుంటారు.  అయితే దీని గురించి వైద్యులు కొన్ని విషయాలు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుంటే..

థైరాయిడ్ అంటే..

మన మెడలో ఉండే థైరాయిడ్ గ్రంథి థైరాయిడ్ హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇందులో T3 , T4 అనే రెండు రకాల హార్మోన్లు ఉంటాయి. ఇవి శరీర జీవక్రియ, శక్తి ఉత్పత్తి, శరీర విధులు , హార్మోన్ల సమతుల్యతను నియంత్రిస్తాయి. ఈ హార్మోన్లను నియంత్రించడానికి TSH విడుదల అవుతుంది. ఆటోఇమ్యూన్ వ్యాధులు లేదా అయోడిన్ లోపం వంటి కొన్ని పరిస్థితులలో థైరాయిడ్ హార్మోన్లు తక్కువగా ఉత్పత్తి అవుతాయి, దీనివల్ల TSH స్థాయిలు పెరుగుతాయి. దీన్ని పరిస్థితిని హైపోథైరాయిడిజం అంటారు.

హైపర్ థైరాయిడిజం..

కొన్ని వ్యాధులలో T3 , T4 స్థాయిలు పెరిగి, TSH తగ్గడానికి కారణమవుతాయి, ఈ పరిస్థితిని హైపర్ థైరాయిడిజం అంటారు.

హైపోథైరాయిడిజం లక్షణాలు..

హైపోథైరాయిడిజంలో రోగికి  అలసట ఎక్కువగా ఉండటం, మతిమరుపు, జ్ఞాపకశక్తి సమస్యలు, పొడి చర్మం, జుట్టు రాలడం, విపరీతమైన చలి, మలబద్ధకం,  రుతుచక్రం సరిగా ఉండకపోవడం పిల్లలు పుట్టడంలో సమస్యలు ఉండే  అవకాశం ఉంటుంది.

హైపర్ థైరాయిడిజం లక్షణాలు..

హైపర్ థైరాయిడిజం వల్ల బరువు తగ్గడం, ఆందోళన, భయం, చిరాకు, అధికంగా చెమట పట్టడం, చేతులు వణకడం, కళ్లు ఉబ్బడం, గుండె కొట్టుకునే వేగం పెరగడం, విరేచనాలు,  రుతుస్రావం,  రుతుచక్రం సరిగా లేకపోవడం,   పిల్లలు పుట్టడంలో సమస్యలు రావచ్చు.

గర్భధారణలో థైరాయిడ్ సమస్యలు..

గర్భధారణ సమయంలో థైరాయిడ్ సమస్యలు తల్లి , బిడ్డ ఇద్దరికీ ప్రమాదాలను పెంచుతాయి. తల్లికి రక్తహీనత , అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది, అదే సమయంలో బిడ్డ తక్కువ బరువుతో పుట్టడం, ఎదుగుదల లోపం , నెలలు నిండక ముందే ప్రసవం అయ్యే ప్రమాదం పెరుగుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా,  థైరాయిడ్ వ్యాధి అదుపులో లేకపోతే  పిల్లలు పుట్టడంలో సమస్యలు,  అబార్షన్ లు జరగడం వంటి సమస్యలు పెంచుతుంది. ప్రత్యేకించి  హైపోథైరాయిడిజం పిల్లల మానసిక వికాసాన్ని ప్రభావితం చేస్తుంది. అందువల్ల, థైరాయిడ్ వ్యాధిని ముందుగానే గుర్తించడం , సరైన చికిత్స అందించడం చాలా కీలకం. ఏవైనా లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన సలహా తీసుకోవాలి.

                               *రూపశ్రీ.