నిజంగా ఒక వ్యక్తి పొగతాగడం మానేయడం సాధ్యమేనా?? ఒకవేళ సాధ్యమైతే అది ఎలా మానగలుగుతాడు?

సహజంగా మొట్టమొదట చెయ్యవలసిన పని మానివెయ్యడమే. మొదటి రోజు గంటసేపు, మరునాడు రెండేసి గంటల సేపు, మూడో రోజున మూడేసి గంటల సేపు - ఇలా మానివెయ్యడమా? అసలు ఒకేసారి పూర్తిగా మానివెయ్యడమా? అనేది వ్యక్తిగత విషయం. దాన్ని ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చు. ఏమైనా సరే, ఈ విషయంలో ఒక నిశ్చయం చేసుకోవడానికీ, దాన్ని తు.చ తప్పక అమలు చేయడానికి దృఢమయిన మనోనిబ్బరం అవసరం. 

అందుకోసం కొన్ని చిట్కాలు:
సాధ్యమైనంత వరకు పొగ తాగేవాళ్లకి దూరంగా ఉండాలి. ముఖ్యంగా మొదటి మూడు నాలుగు వారాలపాటు పొగతాగే వారితో, ఆ అలవాటు ఉన్న స్నేహితులతో కలవడకూడదు. వాళ్ళతో కలవకపోతే వాళ్ళు అపార్థం చేసుకుంటారని, ఏదో అనుకుంటారని ఆలోచన వద్దు. వాళ్ళు ఏమైనా అనుకున్నా.. మీరు పొగతాగడం మానేస్తే చాలామంది మీ దృఢ నిశ్చయానికి చాటున ఎంతో మెచ్చుకుంటారు. కాని, మరికొందరు ఏమి కాదు తాగు అంటూ బలవంతం చేస్తారు. కాబట్టి మీరు అనుకున్నది సాధించే వరకు స్నేహితులను కలవద్దు. 

పొగాకు వాడకం ఏ రూపంలోనైనా సరే దగ్గరకు రానివ్వకూడదు. పొగాకు అంటే అదొక మత్తు. కేవలం ధూమపానమే కాదు, ఇతర పొగాకు ఆధారిత పదార్థాలను కూడా తీసుకోకూడదు. వీలైతే స్నేహితులను కూడా మీతో జతకలిపి వారు కూడా మానేందుకు ప్రోత్సహించండి.  

ఎప్పటి నుండో అలవాటైన పొగ ఒక్కసారిగా మానితే.. మనసు అటే లాగుతుంది. అయితే పొగ తాగాలని అనిపించినప్పుడల్లా ఒకటి రెండు గ్లాసుల నీళ్లయినా లేదా పళ్లరసమైనా తాగాలి. కొంత కాలం ఇలా రోజూ చాలా సార్లు చెయ్యాల్సి వస్తుంది. కానీ తాగిన నీరు పొగ పీల్చాలనే తీవ్ర వాంఛను అరికట్టడానికి సాయపడుతుంది. పైగా, శరీరంలో కలిసిపోయిన నికొటిన్, ఇతర విష పదార్థాలను తొలగించడంలో ఇది తోడ్పడుతుంది.

రోజూ రెండుసార్లు వేన్నీళ్ల స్నానం చేసి, ఆ వెంటనే చురుకు పుట్టించే లాగ చన్నీటి స్నానం చెయ్యాలి. ఇది శారీరకంగా ఎంతో మెరుగు చెయ్యడమే కాదు, రక్తప్రసరణ క్రమాన్ని చక్కబరిచి, అనుకున్న పని చేయడానికి సహకరిస్తుంది. మనోనిబ్బరాన్ని పెంచుతుంది.  

రోజూ వ్యాయామం చెయ్యాలి. శ్వాస సంబంధ వ్యాయామాలు ఎంతో గొప్పగా సహాయపడతాయి. ప్రశాంతంగా, స్వచ్ఛమైన గాలి ఉన్న ప్రాంతాలకు అలా వాకింగ్ వెళ్లడం శ్వాసకోశాలను శుభ్రపరచి, ఆరోగ్యాన్ని పెంచుతుంది. 

ఆహారం విషయంలో జాగ్రత్త.. వీలైనంత ఎక్కువగా తాజా కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. పొగాకు వల్ల శరీరంలో చేరిన విషాలకు ఇవి చక్కని విరుగుడుగా పనిచేస్తాయి. నిజం చెప్పాలంటే కొన్ని వారాలపాటు ప్రత్యేకించి పండ్లు, కూరగాయలే తీసుకొని ఉన్నారంటే పొగ తాగాలనే కోరికే లేకుండా పోతుంది. రక్తంలో షుగర్లు నిలకడగా ఉండేందుకు సహాయపడుతుంది. తరచుగా కొంచెం కొంచెంగా తింటూ ఉండాలి. ఒత్తిడి సమయంలో నాడులను స్థిమిత పరచడానికి ఇది తోడుపడుతుంది. ఒత్తిడి ఉన్నప్పుడు తెలియకుండానే ఎక్కువ తినేస్తారు కాబట్టి జాగ్రత్త, ఇది ఊబకాయానికి దారి తీస్తుంది.

ఇవన్నీ పాటిస్తే పొగతాగడం ఇంత సులువా అంటారు..

◆నిశ్శబ్ద