యజ్ఞ జ్యోతి వేదగిరి లక్ష్మీనరసింహస్వామి
శ్రీ నారసింహ క్షేత్రాలు - 19
యజ్ఞాలలో అనేక రకాలున్నా పురాతన కాలంలో ఋషులుకానీ, రాజులుగానీ యజ్ఞాలు ఎక్కువగా ప్రజోపయోగంకోసం చేసేవారు. అలాగే తపస్సులు కూడా. పూర్వం అనేక మహర్షులు తపస్సు చేసి, దైవ దర్శనాన్ని పొంది, ఆ దేవతారాధన అందరికీ సులభం చెయ్యటానికి ఆ దైవాలను అక్కడ కొలువుతీరి భక్తులను కరుణించమని ప్రార్ధించి, వారి విగ్రహాలను అక్కడ ప్రతిష్టించేవారు. తర్వాత కాలంలో అవి సువిశాల ఆలయాలుగామారి, ఈ నాటికీ భక్తుల అభీష్టాలను నెరవేరుస్తున్నాయి. పూర్వం కశ్యప ప్రజాపతి చేసిన యజ్ఞ కుండాలనుంచి వెలువడిన జ్యోతి నరసింహస్వామిగా రూపు దాల్చిన వేదగిరి గురించి ఇప్పుడు చెప్పుకుందాము.
నెల్లూరు జిల్లాలో, నెల్లూరుకు 7 కి.మీ. ల దూరంలో వున్నది వేదగిరి, నరసింహులు కొండగా పిలువబడే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి కశ్యప ప్రజాపతిచే ప్రతిష్టించబడ్డాడు. ఆ కధ ఏమీటంటే... పూర్వం సప్త ఋషులలో ప్రధముడైన కశ్యప ప్రజాపతి లోక కళ్యాణార్ధం యజ్ఞం చెయ్య తలపెట్టాడు. ఆ యజ్ఞానికి ఈ వేదగిరికి దక్షిణంగా వున్న లోయ అనుకూలమైన ప్రదేశంగా భావించి, అక్కడ ఏడు యజ్ఞ కుండాలను నెలకొల్పారు. యాగ సంరక్షకునిగా శ్రీ ప్రసన్న లక్ష్మీ సమేత శ్రీ గోవిందరాజస్వామిని ప్రతిష్టించి, సప్త ఋషులతో కలసి యజ్ఞం పరిసమాప్తి చేసి, పూర్ణాహుతి చేశారు. ఆ సమయంలో యజ్ఞ కుండాలనుంచి వెలువడ్డ ఒక తేజస్సు జ్యోతి రూపంలో ఈ వేదగిరిమీద గుహలోకి వచ్చింది. ఆ జ్యోతి వెంట వచ్చిన కశ్యప ప్రజాపతి మొదలగువారు గుహలోకి ప్రవేశించిన జ్యోతి స్ధానంలో వెలసి యున్న నరసింహమూర్తిని చూసి అక్కడే ప్రతిష్టించారు.
జ్యోతి సాక్షాత్కరించిన గుహలోనే కశ్యప ప్రజాపతి లక్ష్మీ నరసింహస్వామిని శాంత మూర్తిగా ప్రతిష్టించాడు.కాలక్రమంలో కాశ్యపాది మహర్షులు ఏర్పాటు చేసుకున్న ఏడు హోమగుండాలూ ఏడు కోనేళ్ళుగా రూపొందాయి. వీటినుంచీ పంపు ద్వారా కొండపైకి నీటి సరఫరా నేటికీ జరుగుతున్నది. ఈ లోయలో కశ్యపాదులచే యాగ రక్షణకోసం ప్రతిష్టింపబడ్డ శ్రీ ప్రసన్నలక్ష్మీ సమేత గోవిందరాజస్వామి ఆలయం అనేకసార్లు జీర్ణోధ్ధరణ తర్వాత నేటికీ చూడవచ్చు. ఇక్కడ శ్రీ గోవిందరాజస్వామి ఐదు తలలల నాగేంద్రునిపై శయనించి వుంటారు. నాభి కమలమునందు బ్రహ్మదేవుడు, పాద సేవలో శ్రీదేవి, భూదేవిలను చూడవచ్చు. స్వామి సన్నిధి పక్కన శ్రీ ప్రసన్నలక్ష్మీ అమ్మవారి సన్నిధి. ఈ ఆలయానికి వచ్చే భక్తులు ముందుగా గోవిందరాజస్వామి దర్శనం చేసుకుని తర్వాత నరసింహస్వామి దర్శనానికి వెళ్తారు.
అశ్వధ్దామ గుహలు
ఈ లోయప్రాంతంలోనే కొన్ని గుహలు వున్నాయి. మహాభారత కాలంలో ఉప పాండవులను సంహరించిన అశ్వధ్దాముడు కృష్ణార్జునుల శాపం వల్ల ఆ పాప ఫలాన్ని చిరంజీవిగా అనుభవిస్తున్నాడు. ఆయన ఈ వేదగిరికి వచ్చి ఇక్కడ తపస్సు చేసుకున్నారనీ, చిరంజీవికావటం వల్ల ఇప్పటికీ జీవించివున్నారనీ చెప్పుకుంటారు. ఆలయ నిర్మాణం పురాతన కాలంలో కశ్యప మహర్షి చేత ప్రతిష్టింపబడిన నరసింహస్వామి గుహ చాలాకాలం ఏ ఆలయం నిర్మింపబడకుండా అలాగే వున్నది. ఆ కాలంలో వశిష్ట మహర్షి, వనవాస సమయంలో శ్రీ రామచంద్రుడు ఈ స్వామిని దర్శించారని ప్రసిధ్ధి. తర్వాత కాలంలో నెల్లూరు మండలం పల్లవ చక్రవర్తి అయిన విక్రమసింహవర్మ పరరిపాలనలో వున్న సమయంలో ఆయన ఒకసారి సత్యపురిలో విడిసి వున్నాడు. ఆ సత్యపురే నేటి జొన్నవాడ. ఆ సమయంలో ఆయనకి ఒక రాత్రి కలలో కామాక్షీ దేవి కనబడి కంచిలోవలె తనకి అక్కడ ఒక ఆలయం నిర్మించమని ఆదేశించింది. శివ భక్తుడైన ఆ చక్రవర్తి అమ్మవారి ఆదేశానుసారం ఒకటిన్నర సంవత్సరాలు అక్కడ వుండి శ్రీ మల్లికార్జున సమేత శ్రీ కామాక్షీతాయి ఆలయాన్ని నిర్మింపచేసి, కంచినుండి వేద పండితులైన బ్రాహ్మణులను రప్పించి, ఆలయ నిర్వహణ అప్పగించారు.
ఆ సమయంలో వేదగిరిలోని నరసింహస్వామి భక్తులైన విప్రులు కొందరు చక్రవర్తిని దర్శించి కశ్యప మహర్షిచేత ప్రతిష్టింపబడి అప్పటిదాకా సరైన ఆలయం లేని నరసింహస్వామికి ఆలయం నిర్మించమని కోరారు. వారి కోరికమేరకు పల్లవ చక్రవర్తి విక్రమసింహవర్మ వేదగిరి మీద అతి విశాలమైన ఆలయాన్ని నిర్మింపచేశాడు. తర్వాత కాలంలో విజయనగర సామ్రాజ్యాధీశులు ఈ ఆలయాన్ని దర్శించి ఆలయ అభివృధ్దికి అనేక కానుకలిచ్చారని శాసనాలద్వారా తెలుస్తున్నది.
ఆలయం ప్రవేశానికి ఏడంతస్తుల గాలి గోపురంనుంచి వెళ్ళాలి. ఈ గోపురం సుమారు 500 సంవత్సరాల క్రితం రెడ్డి రాజుల కాలంలో నిర్మింపబడింది. ఆలయాన్ని చేరుకోవటానికి కొద్ది మెట్లు ఎక్కాలి. కొండపై శ్రీ వీరాంజనేయస్వామి, గరుక్మంతుల విగ్రహాలను దర్శించవచ్చు. ఆలయం ముందు నలభై అడుగుల ఎత్తయిన ధ్వజ స్తంభము, ముఖద్వారానికి ఇరువైపులా ద్వార పాలకులు జయ విజయుల 6 అడుగుల ఎత్తయిన విగ్రహాలను చూడవచ్చు. దేవాలయము గర్భాలయము, అంతరాలయము, ముఖమండపము, అర్ధ మండపములుగా నిర్మింపబడినది. స్వామి వెలిసిన గుహ అతి ప్రాచీనమైనది....మిగతా నిర్మాణములు తర్వాత చేపట్టబడినవి.
స్వామి దర్శనం
ముఖ మండపమునకి ముందు భాగములో శ్రీ గణపతిని దర్శించుకునిస్వామి దర్శనార్ధం వెళ్ళవచ్చు. గర్భాలయంలో స్వామి వెండి విగ్రహం 6 అడుగుల ఎత్తుగా కన్నుల పండుగగా దర్శనమిస్తుంది. స్వామి చతుర్భుజాలలో అభయ, వరద ముద్రలు, శంఖు చక్రాలు విరాజిల్లుతుంటాయి. దిగువగా కశ్యప ప్రజాపతిచే ప్రతిష్టింపబడిన, మూడు అడుగుల ఎత్తయిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం దర్శనం చేసుకోవటం మరువద్దు. ఇవేకాక, అంతరాలయంలో శ్రీదేవీ, భూదేవీ సమేతులైన స్వామి ఉత్సవ విగ్రహాలనుకూడా దర్శించవచ్చు.ఉపాలయాలలో శ్రీ ఆండాళ్, శ్రీ అనంత పద్మనాభస్వామి, శ్రీ కృష్ణుడు, విష్వక్సేనుడు, ఆళ్వార్లను దర్శించవచ్చు.
శ్రీ ఆదిలక్ష్మి
అమ్మవారు శ్రీ ఆదిలక్ష్మికి ప్రత్యేక ఆలయం వున్నది. ఇక్కడ చెలికత్తెలచే సేవింపబడుతున్న శ్రీమహాలక్ష్మి, దీపకన్య, శ్రీ రుక్మిణీ, సత్యభామా సమేత శ్రీకృష్ణుడి విగ్రహాలను చూడవచ్చు. గర్భాలయంలో శ్రీ ఆదిలక్ష్మీ అమ్మవారు పద్మాసన స్ధితయై,చతుర్భుజములతో దర్శనమిస్తుంది.. కొండపైనుంచి చూస్తే చుట్టూ సుందర దృశ్యాలు కనువిందు చేస్తాయి. అమ్మవారి సన్నిధికి కొంచెం దూరంలో సంతాన వృక్షం వున్నది. సంతానం కోరే స్త్రీలు ఈ చెట్టుకు ముడుపులు కడతారు. ఇక్కడ కొండికాసుల హుండి కూడా చూడవచ్చు. ఈహుండీలో దక్షిణ సమర్పించిన భక్తులకు తేళ్ళు, పాములు మొదలగు ఏ విష జంతువులనుంచి ఆపదగానీ, రోగాల భయంకానీ వుండదని నమ్ముతారు.
మార్గము
ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు పట్టణానికి రైలు, రోడ్డు రవాణా వసతి వున్నది. పట్టణంలోని సంతపేట బస్టాండునుంచి నరసింహులు కొండ (వేదగిరి)కి వెళ్ళటానికి బస్సులుంటాయి. ఆటో సౌకర్యం కూడా వున్నది. ఇతర వాహనాలను కూడా కొండమీదకి అనుమతిస్తారు.
వసతి, భోజనం.
వేదగిరరి నెల్లూరుకు 7 కి.మీ. ల దూరంలో వున్నది. నెల్లూరు జిల్లా ముఖ్య కేంద్రము. సకల సదుపాయాలూ లభిస్తాయి.
దర్శన సమయాలు
ఉదయం 6 గం.లనుంచి మధ్యాహ్నం 12 గం. ల దాకా, తిరిగి సాయంత్రం 4 గం.లనుంచీ రాత్రి 8 గం.ల దాకా.
ఇతర దర్శనీయ ప్రదేశాలు నెల్లూరు జిల్లాలో దర్శనీయ ప్రదేశాలు చాలా వున్నాయి. పెంచలకోన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, జొన్నవాడ కామాక్షీతాయి ఆలయం, పట్టణంలో పెన్నానది ఒడ్డున శ్రీ రంగనాధస్వామి ఆలయం వగైరాలు.
- పి.యస్.యమ్.లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)