ఎడారిగా మారిన పుణ్యక్షేత్రం - తలకాడు!

 

 

పక్కనే కావేరీ నది... కానీ ఆ ఊరు మాత్రం ఎడారిని తలపిస్తుంది. వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఆ ఊరు ఓ రాణి శాపం కారణంగా అలా మారిపోయిందని చెబుతారు. ఇంతకీ ఎక్కడిదా ఊరు? ఎవరా రాణి? ఆమెకీ మైసూరు రాజ్యానికీ మధ్య సంబంధం ఏమిటి? తెలుసుకోవాలంటే తలకాడు గురించి చదవాల్సిందే!

 

కర్ణాటకలోని మైసూరుకి కేవలం 45 కిలోమీటర్ల దూరంలో ‘తలకాడు’ అనే పుణ్యక్షేత్రం ఉంది. క్రీ.శ మూడో శతాబ్దం నుంచే ఈ ప్రాంతం అనేక రాజులకు ముఖ్యనగరంగా ఉండేదని చరిత్ర చెబుతోంది. అసలు ఈ ప్రాంతానికి తలకాడు అన్న పేరు రావడం వెనుక ఓ స్థలపురాణాన్ని చెబుతుంటారు. ఒకప్పుడు సోమదత్తుడు అనే రుషి తన శిష్యులతో కలిసి తీర్థయాత్ర చేస్తున్నాడట. ఆ యాత్రలో భాగంగా కావేరీ తీరం వెంబడి వెళ్తుండగా, వారిని అడవి ఏనుగలు చంపేశాయట. శివభక్తి పరాయణులైన సోమదత్తుడు, అతని శిష్యులు మరుజన్మలో అడవిఏనుగులుగా జన్మించి అక్కడే శివుని ప్రార్థించసాగారు. ఒక బూరుగు చెట్టులో పరమేశ్వరుని చూసుకుంటూ ఆ చెట్టుకి పూజలు చేయసాగారు.

 

 

కాలం ఇలా గడుస్తుండగా తల, కాడు అనే ఇద్దరు కిరాతులు అక్కడకు చేరుకున్నారు. పచ్చపచ్చగా కళకళలాడుతున్న ఆ బూరుగుచెట్టుని చూసి వారికి ఆశ పుట్టింది. వెంటనే దానిని నరకడం మొదలుపెట్టారు. కానీ గొడ్డలి వేటు పడగానే ఆ చెట్టు నుంచి రక్తం కారడం చూసి వాళ్లని నోటమాటరాలేదు. ఆ సమయంలో ఆకాశవాణి ఒకటి వారికి వినిపించింది. తాను పరమేశ్వరుడిననీ, తనని పూజిస్తున్న సోమదత్తుని కోసం బూరుగు చెట్టులోనే నివసిస్తున్నాననీ... ఆ వాణి తెలిపింది. ఆ ఘటనకు సాక్ష్యంగా నిలిచిన తల, కాడులతో పాటుగా ఏనుగుల రూపంలో ఉన్న భక్తులందరూ కూడా కైవల్యాన్ని పొందారు. తనకు కలిగిన గాయాన్ని తానే నయం చేసుకునే శక్తికలవాడు కావడం చేత అక్కడ వెలసిన పరమేశ్వరుని ‘వైద్యనాథుని’గా కొలుచుకోసాగారు. క్రమేపీ ఆ ప్రదేశాన్ని ‘తలకాడు’ అని పిల్చుకుంటూ, అక్కడ వైద్యనాథునికి వైభవోపేతమైన ఆలయాన్ని నిర్మించారు.

 

తలకాడు అనేక రాజ్యాలకు ముఖ్యనగరంగా మారడంతో ఇక్కడ వైద్యనాథుని ఆలయంతో పాటుగా మరో నాలుగు శివాలయాలనీ నిర్మించారు. పాతాళేశ్వర, అర్కేశ్వర, మరులేవ్వర, మల్లికార్జున, వైద్యనాథ ఆలయాలే ఈ అయిదు శివాలయాలు. ఈ అయిదు శివాలయాలనీ కలిపి పంచలింగాలుగా పిలుచుకుంటారు. వీటితో పాటుగా మరో పాతిక బ్రహ్మాండమైన ఆలయాలు ఈ తలకాడులో ఉన్నాయి. వాటిలో రామానుజాచార్యులు నిర్మించారని చెబుతున్న ‘కీర్తినారాయణ’ ఆలయం ప్రముఖమైనది.

 

 

ప్రస్తుతానికి ఈ ఆలయాలలో చాలావరకు ఇసుకదిబ్బల కింద కూరుకుపోయి ఉన్నాయి. వైద్యనాథ ఆలయం వంటి అతి కొద్ది కట్టడాలలోకి మాత్రమే ప్రవేశించే వీలు ఉంది. వేల ఏళ్ల చరిత్ర కలిగి, నదీతీరాన ఉండి కూడా ఈ ప్రాంతం ప్రస్తుతం ఎడారిగా మారిపోయింది. దాని వెనుక మరో ఆసక్తికరమైన కథ ఉంది! ఆ కథ రేపు...

- నిర్జర.

 


More Punya Kshetralu