దుర్యోధనుడికీ ఓ గుడి ఉంది!

 


దుర్యోధనుడనగానే దుష్టత్వానికి ప్రతీకగా నిలిచే పాత్ర గుర్తుకువస్తుంది. అధికారం కోసం ఎంతటికైనా తెగించే దుర్మార్గం గుర్తుకువస్తుంది. మరికొందరేమో దుర్యోధనుడిని స్నేహానికీ, అభిమానానికీ ప్రతీకగా భావిస్తారు. ఆయనని కూడా ఒక దేవునిగా కొలుస్తారు. కానీ దుర్యోధనుడికి ఏకంగా ఓ ఆలయమే ఉందంటే ఆశ్చర్యం కలగక మానదు.

 

కేరళలోన కొల్లం జిల్లాలో పోరువళి అనే చిన్న గ్రామం ఉంది. అక్కడి కొండ మీదే ఈ దుర్యోధనుడి ఆలయం ఉంది. ఆ కొండని మలనాడ అని పిలుస్తారు. మలనాడ అంటే ఆలయం ఉన్న కొండ అని అర్థం! ఈ ఆలయం వెనుక చాలా వింత చరిత్రే వినిపిస్తుంది. కౌరవులతో జరిగిన జూదంలో ఓడిపోయిన పాండవులు 12 ఏళ్ల అరణ్యవాసాన్నీ, ఏడాది అజ్ఞాతవాసాన్నీ అనుభవించేందుకు సిద్ధపడిన సంగతి తెలిసిందే!

 


అజ్ఞాతవాసంలో ఉన్న పాండవుల ఉనికిని కనుక్కోగలిగితే... మళ్లీ వారు మరో 12 ఏళ్ల అజ్ఞాతవాసాన్ని చేయవలసి ఉంటుంది. అందుకే అజ్ఞాతవాసంలో ఉన్న పాండవుల జాడను కనుగొనేందుకు దుర్యోధనుడు కూడా బయల్దేరాడు. అలా వెళ్తూ వెళ్తూ కేరళలోని ఈ మలనాడు ప్రదేశానికి చేరుకున్నాడట. ఇక్కడికి రాగానే దుర్యోధనుడికి విపరీతంగా దాహం వేసింది. దాంతో తన దాహార్తిని తీర్చేందుకు ఎవరన్నా కనిపిస్తారేమో అని ఎదురుచూడసాగాడు.

 

దుర్యోధనుడి బాధను గమనించిన ఓ వృద్ధురాలు తన దగ్గర ఉన్న కల్లుని ఆయనకు అందించి దాహాన్ని తీర్చింది. కల్లు రుచి చూసిన దుర్యోధనుడు మహా సంబరపడిపోయాడు. అక్కడి ప్రజల ఆతిథ్యాన్నీ, అక్కడి ప్రకృతి అందాలను చూసి ముగ్ధుడయ్యాడు. వెంటనే ఆ కొండ మీద కూర్చుని ఆ ప్రాంతాన్ని సుభిక్షంగా ఉంచమంటూ పరమేశ్వరుని ప్రార్థించాడు. ఇక అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ ఓ వంద ఎకరాల పొలాన్ని ఆ ప్రాంత వాసులకు దానం చేశాడు. ఇప్పటికీ ఆ ప్రదేశం ప్రభుత్వ రికార్డులలో దుర్యోధనుడి పేరు మీదుగానే ఉంటుందని అంటారు.

 


ఇదంతా జరిగిన ప్రదేశంలో దుర్యోధనుడికి ఓ ఆలయాన్ని నిర్మించారు ఆ ప్రాంతవాసులు. కాకపోతే ఆ ఆలయంలో దుర్యోధనుడి విగ్రహం మాత్రం ఉండదు. గుడిలో ఒక ఎత్తైన ఖాళీ వేదిక మాత్రమే దర్శనమిస్తుంది. గుడిలోకి చేరుకునే భక్తులు తమ మనసులోనే ఆ మూర్తిని ఊహించుకుంటారు. ఈ ఆలయంలోని ‘కురవ’ అనే కులానికి చెందిన వారు మాత్రమే పూజారులుగా సాగడం మరో విచిత్రం. దుర్యోధనుడికి కల్లుని అందించిన వృద్ధురాలు ‘కురవ’ స్త్రీ కావడంతో ఈ ఆచారం మొదలై ఉంటుంది.

 

మలనాడకి ప్రతిరోజూ భక్తులు వస్తూనే ఉంటారు. కానీ మార్చిలో జరిగే ‘కెట్టుకజ’ ఉత్సవానికి మాత్రం రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది జనం వస్తారు. మన బోనాల సందర్భంగా ఎలాగైతే వెదురుతో తొట్టెలు చేస్తామో... అలాగే 70. 80 అడుగుల ఎత్తున అలంకరణలు చేసి వాటిని భుజాన మోస్తారు. ఉత్తర భారతంలో అక్కడక్కడా దుర్యోధనుడిని ఆరాధించే ప్రజలు కనిపిస్తారు. కానీ దక్షిణభారతదేశంలో మాత్రం బహుశా ఈ ఒక్క ప్రదేశంలోనే ఆయన పూజ కనిపిస్తుంది.


- నిర్జర.
 


More Punya Kshetralu