శ్రీముఖలింగం - మధుకేశ్వరాలయం
శ్రీకాకుళం జిల్లాలో వంశధారానదికి ఎడమ గట్టున నగరికటకం, ముఖలింగం అనే రెండు గ్రామాలున్నాయి. ఈ రెండు గ్రామాల నడుమ, ముఖ్యంగా ముఖలింగంలో మధుకేశ్వరాలయం, సోమేశ్వరాలయం, భీమేశ్వరాలయం అని మూడు శైవ దేవాలయాలు ఉన్నాయి. ఈ మూడు ఆలయాలలో "మధుకేశ్వరాలయం" అతి పురాతనమైనది, చారిత్రక ప్రసిద్ధమైనది.
మధూకము అంటే ఇప్ప చెట్టు. మధుకేశ్వరుడు అను పేరు రావడానికి ఇప్ప చెట్టే కారణమని ఇక్కడి స్థలపురాణం చెప్తుంది.
ఆ కథ ఏమిటంటే....
ఒకప్పుడు హిమాలయాలమీద గొప్ప వైష్ణవయాగం జరిగింది. ఆ యాగాన్ని చూడడానికి గంధర్వరాజైన చిత్రగ్రీవుడు తన గంధర్వ గణాలతో వచ్చాడు. ఆ హిమాలయాలమీద ఉండే శబరకాంతలు కూడా ఆ యాగం చూడడానికి వచ్చారు.
శబరకాంతల సౌందర్యం చూసి గంధర్వులు కామవశీభూతులయ్యారు. అది గమనించిన వామదేవ మహర్షి కోపగించి ‘ సభామర్యాదను అతిక్రమించిన దోషానికి మీరంతా శబరజాతిలో జన్మించండి’ అని శపించాడు. గంధర్వులంతా శబరులుగా జన్మించారు. వారి నాయకుడైన చిత్రగ్రీవుడు శబర నాయకుడుగా జన్మించాడు. అతని రాణి చిత్తి. రెండవ భార్య చిత్కళ. ఈమె శివభక్తురాలు. ఈ రాణులిద్దరికీ ఒక్క క్షణం పడేదికాదు.చీటికీ మాటికీ కీచులాడుకునేవారు. ఒకరోజు చిత్తి తన భర్తను చేరి ‘నీతో ఉంటే నేనైనా ఉండాలి...లేదా చిత్కళైనా ఉండాలి. ఏదో ఒకటి తేల్చి చెప్పు’ అని అతనిని నిలదీసింది. శబర నాయకుడు పట్టపురాణి అయిన చిత్తిని వదులుకోలేక తన రెండవరాణి అయిన ఛిత్కళను పిలిచి ‘మన వాకిలిలో ఉన్న ఇప్పచెట్టు కొమ్మలు రెండు వంచి, రాలిన పువ్వులు ఏరుకుని, వాటిని అమ్ముకుని బతకమన్నాడు. మహాసాధ్వి అయిన చిత్కళ భర్త మాటకు ఎదురు చెప్పలేక, ఇప్పచెట్టు కొమ్మలు రెండు వంచి ఆ రాలిన పువ్వులు ఏరుకునేది. అయితే ఆమె శివభక్తురాలు కనుక శివానుగ్రహం వల్ల రాలిన పువ్వులు బంగారు పువ్వులుగా మారిపోయేవి. చిత్కళ ఆ బంగారు పువ్వులను సుమంతపురంలో అమ్ముకుంటూ కాలం గడుపుతోంది. ఈ సంగతి తెలిసి చిత్తి అసూయ చెంది చిత్కళతో గొడవకు దిగింది. విసుగు చెందిన శబర నాయకుడు సవతుల గొడవకు ఆ ఇప్నచెట్టే కారణమని తలచి, ఆ ఇప్పచెట్టును నరకడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు మహాశివుడు రౌద్రాకారంతో ఆ చెట్టు మొదట ప్రత్యక్షమయ్యాడు. అది చూసి శబర నాయకుడు మూర్ఛబోయాడు. దీనికంతటికీ చిత్కళయే కారణమని తలచి శబరులంతా కలిసి చిత్కళను చంపడానికి సిద్ధబడ్డారు. అప్పుడు మహాశివుడు వారి ముందు ప్రత్యక్షమై శబరరూపులైన ఆ గంధర్వులకు శాపవిముక్తి అనుగ్రహించాడు. ఆ విధంగా మధూక వృక్షంలో సాక్షాత్కరించిన మహాశివుడే మధుకేశ్వరుడుగా వెలసాడు.
మధుకేశ్వరాలయానికి ముందు పెద్ద నంది విగ్రహం ఉంది. గర్భాలయంలో తెల్లని ముఖలింగేశ్వరుడు దర్శనమిస్తాడు. ఈ ఆలయంలో ఉన్న అనేక శాసనాలలో అతి ప్రాచీనమైన శాసనం, శిల్ప లక్షణాధారం ప్రకారం ఈ ఆలయం 8వ శతాబ్ధిలో నిర్మాణం జరిగి ఉండవచ్చునని పరిశోధకుల అభిప్రాయం. ఇతర భక్తుల సంగతి ఎలా ఉన్నా...మధుకేశ్వరుడు శబరుల, గిరిజనుల ఆరాధ్యదైవంగా ఇప్పటికీ పూజింపబడుతూండడం శబరుల అవ్యాజభక్తికి నిదర్శనం.
- యం.వి.యస్.సుబ్రహ్మణ్యం