ఇక్కడి అమ్మవారిని కళ్లుమూసుకునే పూజించాలి!

 


దసరా దగ్గరకి వస్తోందంటే, అమ్మవారి ఆలయాలన్నీ కిటకిటలాడిపోతాయి. సకల సృష్టికీ మూలమైన ఆ జగదాంబను కొలుచుకునేందుకు భక్తులు ఇదే తగిన సమయంగా భావిస్తారు. అనురాగంతో లాలించినా, ఆపదలో దారి చూపించినా... ఆ అమ్మవారికే చెల్లుతుందని నమ్ముతారు. అందుకే దేశం నలుమూలలా ఆమె ఆలయాలు వెలిశాయి. వాటిలో ప్రతి ఆలయానిదీ ఓ ప్రత్యేకత. అలాగే గుజరాత్‌లోని అంబాజీమాత ఆలయానిది కూడా!

 

ఉత్తర గుజరాత్‌లో రాజస్థాన్‌కు సమీపంలో ఉందీ అంబాజీమాత ఆలయం. చుట్టూ ఎత్తైన అరావళీ పర్వతాల నడుమ, పచ్చటి చెట్ల మధ్య... ఆ ప్రకృతి అంతా తన అనుగ్రహమే అన్నట్లుగా ఈ ఆలయం కనిపిస్తుంది. దక్షయజ్ఞం తర్వాత జరిగిన సంఘటనలో సతీదేవి శరీరభాగాలు వేర్వేరు చోట్ల పడిన కథ తెలిసిందే! వాటిలో అమ్మవారి హృదయభాగం ఇక్కడే పడిందని చెబుతారు.

 

 

హృదయం అనేది మన భావాలకు, అనుభూతులకు సంబంధించినది. దానికి రూపం అంటూ ఉండదయ్యే. అందుకే ఇక్కడి ఆలయంలో అమ్మవారికి ఎలాంటి విగ్రహమూ ఉండదు. బదులుగా బీజాక్షరాలు లిఖించిన ఒక శ్రీయంత్రం మాత్రమే దర్శనమిస్తుంది. ఆ శ్రీయంత్రాన్ని కూడా అదేపనిగా చూడకూడదని చెబుతారు. అందుకే శ్రీయంత్రాన్ని పూజించాలనే భక్తులు తెల్లటి వస్త్రంతో తమ కళ్లని కప్పుకోవాలని ఆలయ నిబంధన.

 

ప్రస్తుతం ఉన్న అంబాజీ ఆలయాన్ని నిర్మించి 1500 సంవత్సరాలకు పైనే గడుస్తోంది. అయితే ఒకప్పుడు ఈ ఆలయం దగ్గరలోని ‘గబ్బర్‌’ అనే కొండ మీద ఉండేదట. పూర్వం దంతుడనే రాజు అక్కడ కొండ మీద ఉన్న అమ్మవారిని ఎలాగైనా తన రాజ్యానికి తీసుకువెళ్లాలని అనుకున్నాడట. అందుకని రేయింబగళ్లు అమ్మవారిని ప్రార్థించి తనతో పాటుగా తన రాజ్యానికి రమ్మని ప్రార్థించాడట.

 

రాజు ప్రార్థనను మన్నించిన అమ్మవారు ఒక్క షరతుని మాత్రం విధించింది. తాను రాజు వెనకే వస్తాననీ, కానీ పొరపాటున కూడా ఆయన వెనక్కి తిరిగి చూడకూడదన్నదే ఆ షరతు. ఆ షరతుని కనుక రాజు ఉల్లంఘిస్తే... తాను అక్కడి నుంచి ఒక్క అడుగు కూడా కదలనని అమ్మవారు తేల్చి చెప్పారు. ఆ షరతుకి లోబడే రాజు తన రాజ్యానికి ప్రయాణమయ్యాడు.

 

 

అమ్మవారిని తీసుకుని ప్రయాణం చేస్తున్న రాజుగారు తన కుతూహలాన్ని ఆపుకోలేకపోయాడు. కొండ నుంచి కాస్త దూరం వచ్చిన వెంటనే, ఓరకంటితో తన వెనకాల వస్తున్న అమ్మవారిని చూసే ప్రయత్నం చేశాడు. దాంతో షరతు ప్రకారం అమ్మవారు అక్కడే స్థిరపడిపోయారు. ఆమె స్థిరపడిన చోటే ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని నిర్మించారు. ఇక గబ్బర్‌ కొండ మీద ఒకప్పుడు అమ్మవారు ఉన్న ఆలయ శిథిలాలను కూడా చూడవచ్చు. అక్కడ ఇప్పటికీ నిరంతరాయంగా జ్యోతిని వెలిగిస్తూ ఉంటారు.

 

శ్రీశైలానికి చేరుకుంటే కేవలం అమ్మవారి ఆలయమే కాకుండా... అక్కడి ప్రతి అంగుళం వెనుకా ఏదో ఒక మహత్యం కనిపిస్తుంది. అంబాజీ పట్నం కూడా అంతే! అక్కడి ఆలయమే కాకుండా సమీపంలో గబ్బర్‌ కొండ, కోటేశ్వర ఆలయం, సరస్వతీ నది ఉద్భవించిన చోటు, వాల్మీకి ఆశ్రమం, అమ్మవారి సోదరి అజయ్‌దేవి ఆలయం, కైలాస కొండ... ఇలా లెక్కలేనన్ని దివ్యక్షేత్రాలు కనిపిస్తాయి. ఈ ఆలయం రాజస్థాన్‌లోని మౌంట్‌ ఆబూకి అతి సమీపంలో ఉండటంతో, మౌంట్‌ ఆబూకి వెళ్లేవారంతా అంబాజీ ఆలయాన్ని కూడా సందర్శించే ప్రయత్నం చేస్తారు.

- నిర్జర.

 


More Punya Kshetralu