సముద్రంలో నీరు ఉప్పగా ఉండటానికి శివ పురాణంలో ఉన్న ఓ కారణం!

సముద్రం చాలా విశాలమైనది. ఎంత విశాలమైనదో అంతే లోతైనది. సముద్రాన్ని చూడటానికి ఎవరైనా ఎంత ఇష్టపడతారో దాని దగ్గరకు వెళితే దాని గంభీరతకు, దాని హోరుకు అంతే భయపడతారు కూడా. అయితే సముద్రంలో నీరు ఉప్పగా ఎందుకు ఉంటుందని చాలా మంది బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉంటారు. అందులో లవణాల శాతం ఎక్కువని, అందుకే ఉప్పగా ఉంటాయని ఓ సైన్స్ కారణం కూడా చెబుతారు. కానీ దీని వెనుక పురాణ గ్రంథాలలో ఉంది. శివ పురాణం ప్రకారం సముద్రంలో నీరు ఉప్పగా ఉండటం వెనుక ఓ కథ ఉంది.

శివ పురాణం ప్రకారం పార్వతి దేవి శివుడిని భర్తగా పొందాలని ఆశ పడింది. శివుడిని ప్రసన్నం చేసుకుని తన కోరిక తీర్చుకోవాలని తపస్సుకు పూనుకుంది. పార్వతి దేవి తపస్సు చేస్తుండగా సముద్రుడి కళ్లు పార్వతి దేవిపై పడ్డాయి. పార్వతి దేవి రూపాన్ని చూసి సముద్రుడు మోహించాడు. ఎలాగైనా ఆమెను తన సొంతం చేసుకోవాలని అనుకున్నాడు. నేరుగా పార్వతి మాత ముందే పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. పార్వతి మాత నేను పరమేశ్వరుడి కోసం తపస్సు చేస్తున్నాను. ఆయన్నే వివాహమాడతాను అని సముద్రుడి ప్రతిపాదనను తిరస్కరించింది.

పార్వతి మాటలు వినేసరికి సముద్రుడు ఉగ్రుడయ్యాడు. శివుడిలో లేనివెన్నో నాలో ఉన్నాయి, అలాంటిది నన్ను కాదని శివుడిని వివాహమాడతాన్ని చెబుతావెందుకు? నేను ప్రజల దాహాన్ని తీరుస్తాను. నా నీరు పాలలా తియ్యగా స్వచ్చంగా ఉంటుంది. అలాంటి నన్ను తిరస్కరించకు. నా ప్రతిపాదనను అంగీకరించు అంటూ పార్వతిని  ఒత్తిడి చేశాడు.

సముద్రుడి మాటలకు పార్వతి దేవి ఆగ్రహం చెంది నువ్వు ఏ నీటిని అయితే చూసుకుని గర్వపడుతున్నావో ఆ నీరు ఎవ్వరూ తాగనంత కఠినంగా ఉప్పగా మారిపోతుంది. ఇదే నా శాపం అని సముద్రుడికి శాపం ఇస్తుంది. ఈ కారణం వల్లే సముద్రంలో నీరు ఉప్పగా ఉంటాయని అంటారు. మరికొందరేమో సాగర మథనం కారణంగా సముద్రపు నీటికి ఆ రుచి వచ్చిందని అంటారు.

                                               *నిశ్శబ్ద.


 


More Shiva